ఏపీ క్యాబినెట్లోకి నాగబాబు వస్తున్నారు. ఇప్పటికే ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. మంత్రి కావడం లాంచనమే. అయితే నాగబాబు వ్యవహార శైలితో కూటమి పార్టీల మధ్య విభేదాలు వచ్చే అవకాశం ఉంది. నాగబాబు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుంటే ఆయన తరచూ వివాదాస్పద కామెంట్స్ చేస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవిని అడ్డం పెట్టుకొని నాగబాబు చేసే కామెంట్స్ గతంలో చాలా సార్లు వివాదాస్పదం అయ్యాయి. లేనిపోని వివాదాలు చుట్టుముట్టాయి. ఇప్పుడు కూడా కూటమి పార్టీల్లో విచ్చన్నానికి తప్పకుండా నాగబాబు కారణమవుతారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఇంకా ఆయన మంత్రి కాలేదు.. అప్పుడే వివాదాస్పద కామెంట్స్ మొదలుపెట్టారు. జనసేన ప్లీనరీలో పిఠాపురం వర్మను ఉద్దేశించి దారుణంగా మాట్లాడారు. పిఠాపురంలో పవన్ గెలుపు ఎవరి దయాదాక్షణ్యం కాదని.. అలా అనుకుంటే అది వారి కర్మ అని తేల్చి చెప్పారు నాగబాబు. కానీ అదే నాగబాబు ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ ప్రసంగాలు వింటే ఇట్టే అర్థమవుతుంది.
పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మకు నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నప్పుడు అందరి చూపు వర్మపై పడింది. సహజంగానే ఆయనకు ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచిన చరిత్ర ఉంది. వర్మ ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉంటే ఆయన గెలవక పోవచ్చు కానీ.. పవన్ కళ్యాణ్ గెలుపు ఓటములను ప్రభావితం చేసేవారు.
అయితే కూటమి కట్టడంలో కీలక భాగస్వామ్యమైన పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం నియోజకవర్గాన్ని కేటాయించారు చంద్రబాబు. వర్మను బుజ్జగించారు. పవన్ కళ్యాణ్ సైతం వర్మకు ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. వర్మ లేనిది తన గెలుపు లేదని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అదే వర్మను పట్టుకొని నాగబాబు అనుచిత వ్యాఖ్యలు చేయడం మాత్రం సంచలనం అవుతోంది.
నాగబాబుకు నోటి దూకుడు అధికం. ఒక విధంగా మెగా కుటుంబం వివాదాల్లో చిక్కుకోవడానికి నాగబాబు వైఖరి కారణం. గతంలో ఇదే నోటితో నందమూరి బాలకృష్ణ ఎవరు అంటూ ప్రశ్నించి తనలో ఉన్న మెడ పొగరును బయట పెట్టుకున్నారు నాగబాబు. అప్పట్లో ఎన్టీఆర్ బయోపిక్ మూవీ కథానాయకుడు పై విమర్శలు కూడా సంధించారు. ఆ బయోపిక్ పై లేని పోనీ కామెంట్స్ కూడా చేశారు.
సినీ రంగంలో ఆయన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్. అయితే మెగా కుటుంబానికి ఉన్న గుర్తింపుతో తనకంటూ ఒక ఇమేజ్ తెచ్చుకున్నారు. అయితే ఆయన వైఖరితో చిరంజీవి చాలా ఇబ్బందులు పడ్డారు. నాగబాబు వైఖరి వల్లే చాలామంది సినీ సహచరులు చిరంజీవికి దూరమయ్యారన్న విమర్శ ఉంది.
ప్రజారాజ్యం పార్టీ సమయంలో సైతం నాగబాబు తీరు చాలా అభ్యంతరకరంగా ఉండేది. అందుకే జనసేన తొలినాళ్లలో పవన్ సైతం నాగబాబు విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించుకున్నట్లు తెలుస్తోంది. పవన్ విశాల దృక్పథంతో వ్యవహరిస్తారు. నాగబాబు మాత్రం క్షణికావేశంతో అనవసర కామెంట్స్ చేస్తుంటారు. వివాదాలు సృష్టిస్తారు అన్న కామెంట్స్ ఆయన పై ఉన్నాయి.
ప్రస్తుతం కూటమి ఏడాదిపాలన సవ్యంగా ముందుకు సాగుతోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే నాగబాబు ఎమ్మెల్సీగా పదవి చేపట్టారు. త్వరలో మంత్రి పదవి స్వీకరిస్తారు. ఇప్పుడు మాదిరిగా కూటమి అధినేతను, సహచర మంత్రులతో పాటు ప్రజా ప్రతినిధుల విషయంలో నోటికి పని చెబితే మాత్రం కూటమి ప్రమాదంలో పడుతుంది. అందుకే చంద్రబాబు ఎందుకు వచ్చింది గొడవ రాజ్యసభకు పంపిస్తే పోలే అన్నట్టు నిర్ణయానికి వచ్చారట. అయితే నాగబాబు మాత్రం తాను మంత్రి పదవి చేపడతానని పట్టు పట్టినట్లు సమాచారం. అయితే ఇప్పుడు నాగబాబు పుణ్యమా అని.. కూటమి పార్టీల మధ్య విభేదాలు, విచ్ఛిన్నం రావడం ఖాయం అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.