ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గందరగోళంలో ఉన్నట్టున్నారు. ఒకవైపు హామీల అమలు బాధ్యత నీడలా వెంటాడుతోంది. మరోవైపు బాధ్యత నుంచి తప్పించుకోవడం ఎలా? అనే ఆలోచన. సంక్షేమ పథకాలకు జనం మద్దతు ఇచ్చే కాలం పోయిందని చంద్రబాబు పదేపదే చెప్పదలుచుకున్నారు. ఆకాశమే హద్దుగా సంక్షేమ పథకాల లబ్ధి కలిగిస్తామని హామీలిచ్చింది చంద్రబాబే. మొత్తానికి కోరుకున్న విధంగా అధికారాన్ని దక్కించుకున్నారు.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని, వైసీపీని రాజకీయంగా విధ్వంసం చేస్తే తప్ప, కూటమికి భవిష్యత్ వుండదని ఆయన నమ్ముతున్నారు. చక్కటి పాలన అందించి మరో దఫా అధికారంలోకి రావాలనే ఆలోచన చంద్రబాబులో ఎంత మాత్రం కనిపించడం లేదు. ఎంతసేపూ, వైసీపీని పూర్తిగా బలహీనపరిచి, ఎన్నికల్లో రాజకీయంగా ప్రయోజనం పొందాలనేది బాబు ఎత్తుగడ. కూటమి ప్రభుత్వం కొలువుదీరి ఈ నెల 12తో 8 నెలలు పూర్తి చేసుకుంటుంది.
రోజులు శరవేగంగా ముందుకెళ్తున్నాయి. కాలం ముందుకే తప్ప, వెనక్కి వెళ్లదనే చేదు నిజం చంద్రబాబును ఆందోళనకు గురి చేస్తోంది. ఈ ఎనిమిది నెలల కాలంలో కూటమి ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలు, నాయకుల్ని భయాందోళనకు గురి చేసి, అసలు ప్రత్యర్థులు అనే ఊసే లేకుండా చేయాలని పరితపించింది. కానీ అనుకున్నదొకటి, అయ్యిందొకటి. కూటమి ప్రభుత్వ పెద్దలకు ప్రకృతి సహకరించినట్టు లేదు.
ఏది చేసినా, వ్యతిరేక ఫలితాలే. తిరుమలలో లడ్డూ ప్రసాదాల్లో కల్తీ జరిగిందనే ఆరోపణల మొదలు మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్ల ఎన్నికల్లో అనుసరించి తీరు సర్వత్రా విమర్శలకు దారి తీసింది. అరాచకత్వంతో పోయిన ప్రభుత్వమే మేలు అనే అభిప్రాయాన్ని కూటమి పాలకులు కలిగించగలిగారు.
అలాగే అప్పుడప్పుడు సొంత ప్రభుత్వంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విమర్శలు కూటమిపై ప్రజల్లో పలుచన భావం ఏర్పడేలా చేశాయి. చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు పాలకులకు అప్రతిష్ట తీసుకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్లో మహిళా హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఉన్నా, లేనట్టైందన్న విమర్శ వెల్లువెత్తుతోంది. అంతెందుకు, సీఎం చంద్రబాబు ఇచ్చిన ర్యాంకుల్లో అనితకు 20వ స్థానం దక్కిందంటే, ఆమె పనితీరును ప్రభుత్వమే ప్రజల ముందు వుంచింది.
ఈ నేపథ్యంలో సూపర్ సిక్స్ హామీల అమలు కోసం ఎదురు చూస్తున్న జనం. సంపద సృష్టించిన తర్వాతే సంక్షేమ పథకాలను అందిస్తామని చంద్రబాబు నుంచి పిడుగులాంటి మాట. మరోవైపు కూటమి ఎమ్మెల్యేలు, మంత్రులు, వాళ్ల అనుచరులు……… దీపం వుండగానే ఇంటిని చక్కదిద్దుకోవాలనే తాపత్రయంలో చేయకూడని తప్పుల్ని చేస్తున్నారని జనమే అంటున్నారు. వైసీపీని బలహీనపరచడం కథ పక్కన పెడితే, కూటమే రోజురోజుకూ ప్రజా విశ్వాసాన్ని చూరగొనడంలో విఫలమవుతోందనే చర్చ.
చంద్రబాబు ప్రభుత్వం ఇంత తక్కువ సమయంలో, ఇలాంటి పేరు తెచ్చుకుంటుందని అసలు అనుకోలేదనే వాళ్లే ఎక్కువ. లోపాల్ని సరిదిద్దుకోడానికి కావాల్సినంత సమయం వుంది. రానున్న రోజుల్లో ప్రభుత్వం పాలనపై దృష్టి పెడితే మంచిది. అలా కాకుండా ప్రత్యర్థుల్ని వేధించడానికే ప్రాధాన్యం ఇస్తే, లాభం కంటే నష్టమే ఎక్కువ.