లేని తలనొప్పులు తెచ్చుకోవడం అంటే అదే. కూటమి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చింది. 164 అసెంబ్లీ స్థానాలను సొంతం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ సొంతంగా 135 సీట్లు పొందింది. అయినా చంద్రబాబులో ఆరాటం తగ్గడం లేదు. అధికార దాహం తీరడం లేదు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను బరిలో దించి రెండు స్థానాలను కైవసం చేసుకునేందుకు గట్టి పట్టుదలతోనే ఉన్నారు. అయితే అందులో టిడిపి గెలిచినా.. ఓడిపోయినా మూల్యం తప్పదు అన్న హెచ్చరికలు మాత్రం వస్తున్నాయి. దీనికి కారణాలు లేకపోలేదు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ఇలాగే ఆలోచించి చేతులు కాల్చుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దారుణంగా దెబ్బతిన్నారు. రాజకీయంగా ఇబ్బంది పడగా.. యువతతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులు పార్టీకి దూరమయ్యారు. ఇప్పుడు సేమ్ సీన్ చంద్రబాబుకు ఎదురు కానుంది.
ఉమ్మడి కృష్ణా- గుంటూరు, ఉభయగోదావరి జిల్లాలకు సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఈనెల 27న జరగనుంది. ఈ రెండు స్థానాల్లో పార్టీ అభ్యర్థులను బరిలోదించారు చంద్రబాబు. ఉభయగోదావరి జిల్లా ల నుంచి పేరాబత్తుల రాజశేఖర్, కృష్ణ- గుంటూరు జిల్లాలనుంచి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ను బరిలో దించారు చంద్రబాబు. అయితే ఈ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా పక్కకు తప్పుకుంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. కానీ పిడిఎఫ్ అభ్యర్థులు మాత్రం బరిలో ఉన్నారు. గుంటూరు- కృష్ణాజిల్లాలనుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ లక్ష్మణరావు పోటీ చేస్తున్నారు. ఉభయగోదావరి జిల్లాల పిడిఎఫ్ అభ్యర్థిగా డివి రాఘవులు సైతం పోటీ చేస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పిడిఎఫ్ అభ్యర్థులకు ఓట్లు వేసే అవకాశం ఉంది. అయితే ఈ రెండు ప్రాంతాల్లో కూటమి రాజకీయంగా బలంగా ఉంది. 9 నెలల కిందట దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. అయితే గెలిస్తే ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు వ్యతిరేకం అయినట్టే. సాధారణంగా అధికార పార్టీ కావడంతో గెలుపొందేందుకు అన్ని రకాల ప్రయత్నాలు జరుగుతాయి. కూటమికి అవే ప్రతి బంధకంగా మారనున్నాయి.
ఎలాగైనా గెలిచి తీరాలని చంద్రబాబు పార్టీ మంత్రులకు, కూటమి ఎమ్మెల్యేలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారు రంగంలోకి దిగారు. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. రెండు స్థానాల్లో గెలవడానికి అధికార అండతో సహజంగానే తొక్కని అడ్డదారులు ఉండవు. అదే జరిగితే కూటమికి బలమైన శత్రువును ఏరి కోరి తెచ్చుకున్నట్టే. పోనీ ఈజీగా తీసుకుందామంటే పిడిఎఫ్ కు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పరోక్ష మద్దతు ఉంటుంది. పొరపాటున ఓడిపోతే ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతుంది.
గెలిచినా కష్టమే.. ఓడిపోయినా కష్టమే. అనవసరంగా పట్టభద్రుల స్థానాల్లో పిడిఎఫ్ ఫై పోటీ పెట్టడమే అనాలోచితం నిర్ణయం. పిడిఎఫ్ ను బలపరిచే ఓటర్లంతా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక ప్రజా సంఘాలకు చెందినవారు. మొన్నటి ఎన్నికల్లో వీరంతా కూటమికి అండగా నిలిచారు. కానీ ఇప్పుడు రాజకీయ కోణంలో ఆలోచించి చంద్రబాబు తమపైనే పోటీ పెడుతున్నారు అన్న ఆగ్రహం వారిలో ఉంది. ఇవన్నీ రానున్న రోజుల్లో రాజకీయంగా టిడిపికి శాపంగా మారే అవకాశం ఉంది.
పిడిఎఫ్ అభ్యర్థులు గెలిచినా, ఓడిపోయినా.. ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఉద్యమాలకు దిగే ఛాన్స్ కనిపిస్తోంది. అక్రమాలు చేసి గెలిస్తే టిడిపికి వారు వ్యతిరేకంగా మారిపోతారు. ఒకవేళ వారు ఓడిపోయిన తమ గొంతు నొక్కుతున్నారన్న వాదనతో బయటకు రానున్నారు. ఇలా ఎలా చూసుకున్నా చంద్రబాబుకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు చుక్కలు చూపించడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు