హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పేరు మారింది. దశాబ్ద కాలం కిందట నాటి నుంచి ఈ విశ్వవిద్యాలయం పేరు మార్చాలన్న ప్రతిపాదన వచ్చింది. కానీ అనేక రకాల కారణాలతో ఆ పని చేయలేక పోయింది తెలంగాణ ప్రభుత్వం. కానీ రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పొట్టి శ్రీరాములు పేరును చెరిపేసింది. సురవరం ప్రతాప్ రెడ్డి పేరును కొత్తగా చేర్చనుంది. అయితే ఇది టిడిపి కూటమి ప్రభుత్వానికి మాయని మచ్చ.
తొలి భాషా ప్రయుక్త యూనివర్సిటీగా 1985 డిసెంబర్ 2న ఏర్పాటయింది తెలుగు యూనివర్సిటీ. తెలుగు ప్రజల కోసం పనిచేసిన పొట్టి శ్రీరాములు పేరును దానికి పెట్టారు. అప్పటినుంచి అదే పేరుతో కొనసాగుతూ వస్తోంది. దేశంలో ప్రముఖ యూనివర్సిటీలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ ఒకటి. కానీ అటువంటి యూనివర్సిటీ పేరును ఏకపక్షంగా తొలగించింది రేవంత్ సర్కార్.
వాస్తవానికి తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కల్వకుంట చంద్రశేఖర రావు ఎన్నికయ్యారు. తెలంగాణ నేపథ్యమున్న నిర్మాణాలు, సంస్థల పేరు మార్చారు. ఈ తరుణంలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పు తెరపైకి వచ్చింది. కానీ నాడు కవులు,రచయితలు, జర్నలిస్టులు, అభ్యుదయ వాదుల విజ్ఞప్తి మేరకు ఆ పేరును అలానే విడిచిపెట్టారు కేసీఆర్.
గత ఐదేళ్లలో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పునకు ప్రయత్నాలు జరిగాయి. కానీ అప్పటి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అడ్డుకున్నారు. అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన నేత రేవంత్ సీఎం గా ఉన్నారు. అయినా సరే పొట్టి శ్రీరాములు పేరు చెరిపేయడం నిజంగా దురదృష్టకరం. కనీసం అడ్డుకోలేని స్థితిలో చంద్రబాబు ఉండడం పై విమర్శలు వస్తున్నాయి.
వాస్తవానికి పొట్టి శ్రీరాములు అమరజీవి అంటారు. ఆయన చేసిన త్యాగఫలమే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీ నిలిచింది. అటు తరువాత తెలుగు రాష్ట్రాలు ముక్కలు అయ్యాయి. రెండుగా మారాయి. అయితే దశాబ్ద కాలంగా పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ పేరు మార్పు లేదు. కానీ చంద్రబాబుకు అనుకూల ప్రభుత్వంగా ఉన్న రేవంత్ సర్కార్ ఈ చర్యలకు దిగడం మాత్రం మింగుడు పడని విషయం. ఈ విషయంలో చంద్రబాబు కలుగజేసుకోకపోవడం ఏంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఏపీవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతున్నాయి.