పోసాని కృష్ణ మురళి కోసం సినీ ప్రముఖులు రంగంలోకి దిగారా? ప్రభుత్వంతో మధ్యవర్తిత్వం వహిస్తున్నారా? ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నారా? కృష్ణ మురళి బెయిల్ కు మార్గం సుగమం కానుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ప్రస్తుతం కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు పోసాని కృష్ణ మురళి. ఒక కేసు నుంచి బయట పడితే.. మరో కేసు పెట్టి లోపల వేస్తున్నారు. దీంతో తీవ్ర గందరగోళంలో పడ్డారు పోసాని కృష్ణ మురళి.
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి అభిమానిగా ఉండేవారు పోసాని కృష్ణ మురళి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విపక్షంలో ఉన్నప్పుడు కూడా బలమైన మద్దతుదారుడుగా ఉండేవారు. అందుకే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పోసానికి కీలక పదవి దక్కింది. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే పోసాని పవర్ ఎంజాయ్ చేశారో లేదో కానీ.. జగన్మోహన్ రెడ్డికి అండగా నిలిచారు. ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులపై స్థాయికి మించి ఆరోపణలు చేశారు.
ప్రధానంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి కుటుంబం పై వ్యక్తిగతంగా కూడా విమర్శలు చేశారు పోసాని. ఒకానొక దశలో స్థాయికి మించిపోయారు. తిట్ల దండకాన్ని కూడా అందుకున్నారు. ఏకంగా మీడియా సమావేశంలోనే వారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అప్పట్లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉండడంతో ఆ మాటలు చెల్లుబాటు అయిపోయాయి. ఎటువంటి కేసులు నమోదు కాలేదు.
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పోసాని కృష్ణ మురళి పై రాష్ట్రవ్యాప్తంగా కేసులు నమోదయ్యాయి. సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలను తప్పుపడుతూ కేసులు నమోదు కాగా.. ఏపీ పోలీసులు హైదరాబాద్ వెళ్లి మరి అరెస్టులు చేశారు. కోర్టులో హాజరు పరిచారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత బెయిల్ వచ్చింది. కానీ సిఐడి మరోసారి అదుపులోకి తీసుకుంది. ఇంకో కేసులో ఆయనకు ఈ నెల 26 వరకు రిమాండ్ విధించింది కోర్ట్.
వాస్తవానికి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తాను రాజకీయాలనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు పోసాని కృష్ణ మురళి. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని కూడా చెప్పుకొచ్చారు. అయితే పోసాని గత వ్యాఖ్యలు చూస్తే మాత్రం అభ్యంతరకరంగా ఉండేవి. పోసాని కృష్ణ మురళి ఇలాంటి వారిని విడిచి పెడితే చేతకానితనం అవుతుందని కూటమి ప్రభుత్వం భావించినట్లు తెలుస్తోంది. అయితే తనకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయని కృష్ణ మురళి సైతం బాధపడ్డారు. కానీ ఆయన గతంలో చేసిన కామెంట్స్ పాపాలు వెంటాడాయి.
అయితే తాజాగా దీనిపై మాట్లాడారు సినీ నటుడు శివాజీ. రాజకీయ నాయకుడిగా కంటే ఇటీవల విశ్లేషకుడు పాత్ర పోషిస్తున్నారు శివాజీ. పోసాని కృష్ణ మురళి ఎపిసోడ్లో ప్రభుత్వం తగ్గిపోవాలని విజ్ఞప్తి చేశారు. పోసాని లో రియలైజేషన్ కనిపిస్తోందని.. అందుకే ఆయన విషయంలో ఉపశమనం కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తద్వారా సినీ ప్రముఖులు రంగంలోకి దిగినట్టు అర్థం అవుతోంది. మరి పోసాని విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందో? లేదో? అన్నది చూడాలి.