లోకేష్ విషయంలో చంద్రబాబు బిగ్ ప్లాన్ వేశారా? పార్టీలో పట్టాభిషేకం చేయాలని భావిస్తున్నారా? మహానాడు వేదికగా కీలక ప్రకటన చేయనున్నారా? పార్టీలో ఇక లోకేష్ మాట ఫైనల్ కానుందా? ముందుగా పార్టీ పదవి, తరువాత ప్రభుత్వంలో ప్రమోషన్ ఇవ్వనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు నారా లోకేష్. జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నారు. రెండు రాష్ట్రాలకు అధ్యక్షులు కొనసాగుతూ వచ్చారు. అయితే ఎంతమంది ఉన్నా.. చంద్రబాబు తర్వాత లోకేష్ మాట పార్టీలో చెల్లుబాటు అవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే లోకేష్ కనుసన్నల్లో పార్టీ నడుస్తోంది. పార్టీకి ఆయనే సుప్రీం గా కూడా ఉన్నారు.
చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీలో ఎవరు అంటే చిన్నపిల్లాడిని అడిగిన చెప్పేస్తారు లోకేష్ అని. ఎందుకంటే పార్టీ కోసం లోకేష్ కష్టపడ్డారు. పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు పాదయాత్ర చేశారు. తనను తాను ప్రూవ్ చేసుకున్నారు. అయితే లోకేష్ కు అర్జెంటుగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. మహానాడు వేదికగా ఈ విషయాన్ని ప్రకటిస్తారని విశ్వసనీయ సమాచారం.
కడప జిల్లాలో మహానాడు ను ఘనంగా నిర్వహించాలని టిడిపి హై కమాండ్ భావిస్తోంది. నిర్వహణకు సంబంధించి వేదికను త్వరలో ప్రకటించనుంది. ప్రధానంగా పులివెందుల పేరు వినిపిస్తోంది. కడప జిల్లాలో పట్టు నిలుపుకోవాలన్న ఆలోచనతో టిడిపి నాయకత్వం ఉంది.
తెలంగాణలో కేటీఆర్ మాదిరిగా ఏపీలో తెలుగుదేశం పార్టీకి లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలన్నది చాలా రోజులుగా వినిపిస్తున్న మాట. అది కార్యరూపం దాల్చే సమయం ఆసన్నమైంది. మహానాడు వేదికగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి లోకేష్ పేరు ప్రకటనకు చంద్రబాబు సిద్ధపడుతున్నట్లు సమాచారం. మొత్తానికైతే ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీని సుదీర్ఘకాలం నడిపారు చంద్రబాబు. ఇప్పుడు తన తర్వాత కుమారుడు లోకేష్ కు ఆ బాధ్యతలు కట్టబెట్టనున్నారు అన్నమాట.