ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వచ్చి రాజకీయాలు చేయాలని చూస్తోంది. మరోవైపు తెలుగుదేశం, జనసేన మధ్య గ్యాప్ పెరుగుతోంది. భారతీయ జనతా పార్టీ ప్రేక్షక పాత్ర పోషిస్తుంది. కాంగ్రెస్ తో పాటు వామపక్షాలు ఉనికి చాటుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు రాజకీయాలు మాట్లాడకపోవడమే ఉత్తమం. కానీ అధికార పార్టీల మధ్య ఉన్న విభేదాలతో రాజకీయాలు రక్తి కట్టిస్తున్నాయి.
ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి కట్టి అద్భుత విజయం సొంతం చేసుకుంది. జనసేనతో పాటు బిజెపితో భాగస్వామ్యం అయింది. అయితే ఈ కూటమి కట్టడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్. టిడిపి కి క్షేత్రస్థాయిలో ఉన్న బలానికి తోడు జనసేన అండగా నిలవడంతో సూపర్ విక్టరీ సాధించింది కూటమి. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సహకారం కూడా సంపూర్ణంగా లభించింది. దీంతో గ్రాండ్ విక్టరీ కొట్టింది కూటమి.
అయితే కూటమి కట్టడం వరకు ఓకే. చంద్రబాబుతో పాటు పవన్ మధ్య సన్నిహిత సంబంధాలు ఓకే. కానీ గ్రౌండ్ లెవెల్ లో మాత్రం ఆ రెండు పార్టీల మధ్య గ్యాప్ రోజురోజుకు పెరుగుతోంది. రెండు పార్టీల సోషల్ మీడియా యాక్టివిస్టుల మధ్య గట్టి యుద్ధమే నడుస్తోంది. ఇప్పటివరకు జాగ్రత్తగా మాట్లాడుతూ వచ్చిన పవన్ కొంచెం నోరు జారడంతో టిడిపి శ్రేణులు మండిపడుతున్నాయి.
జనసేన ప్లీనరీ వేదికగా మెగా బ్రదర్ నాగబాబు చేసిన కామెంట్స్ పుండు మీద కారం చల్లినట్టుగా మారాయి. మూడు పార్టీల మధ్య ఓటు శాతం షేర్ కావడంతోనే విజయం సాధించింది కూటమి. కానీ నాగబాబు మాత్రం ఈ విజయాన్ని జనసేనకు మాత్రమే కట్టబెట్టారు. మరి ఎవరు కారణం కాదని తేల్చేశారు. దీంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అయితే మండిపడుతున్నాయి. దీనికి తోడు పవన్ నాలుగు దశాబ్దాల తెలుగుదేశం పార్టీని నిలబెట్టినట్లు ప్రకటించారు. దీంతో ఆ రెండు పార్టీల మధ్య స్పష్టమైన విభజన రేఖ కనిపిస్తోంది.
గ్రౌండ్ లెవెల్ లో సోషల్ మీడియా యాక్టివిస్టుల మధ్య పెద్ద యుద్ధమే జరుగుతోంది. మరోవైపు రాజకీయ ప్రత్యర్థులకు సైతం ప్రచార అస్త్రంగా మారింది. అందుకే ఈ గ్యాప్ తగ్గించుకునేందుకు అటు చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. శాసనసభలో సీఎం చాంబర్ కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. ఏకాంతంగా చర్చలు జరిపారు. అయితే క్షేత్రస్థాయిలో ఉన్న గ్యాప్ మా మధ్య లేదని.. నిరూపించేందుకే చంద్రబాబు వద్దకు పవన్ కళ్యాణ్ వెళ్లినట్లు ప్రచారం నడుస్తోంది. మొత్తానికి అయితే రెండు పార్టీల మధ్య గ్యాప్ అగాదానికి దారి తీసే అవకాశం ఉండడంతో కొంత బ్రేక్ వేసే పనిలో పడ్డారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్.