Wednesday, March 19, 2025

వైసీపీలోకి రఘువీరారెడ్డి?

- Advertisement -

ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పరిస్థితులు కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మొన్నటి ఎన్నికల్లో దారుణ పరాజయం ఎదురైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న నేతలంతా ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారు. కీలక నేతలు సైతం గుడ్ బై చెబుతున్నారు. ఇటువంటి సమయంలో అధినేత జగన్మోహన్ రెడ్డి అలర్ట్ అయ్యారు. రివర్స్ గేమ్ మొదలుపెట్టారు. అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లను తన వైపు తిప్పుకుంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ క్యాడర్ను పూర్తిస్థాయిలో తన వైపు తిప్పుకున్న జగన్మోహన్ రెడ్డి.. వైసీపీని వీడుతున్న నేతల స్థానంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లను తీసుకుంటున్నారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ఆనందం కనిపిస్తోంది. ఆత్మస్థైర్యం పెరుగుతోంది. అందులో భాగంగా అనంతపురం జిల్లాకు చెందిన పిసిసి మాజీ చీఫ్ సాకే శైలజానాథ్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇప్పుడు మరో పిసిసి మాజీ చీఫ్ రఘువీరారెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన సైతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని ప్రచారం నడుస్తోంది. అయితే ఈ ఇద్దరు నేతలు ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన వారు కావడం విశేషం.

నీలకంఠాపురం రఘువీరారెడ్డి.. ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ మోస్ట్ పొలిటికల్ లీడర్. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్నారు. 1985లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1989లో మడకశిర నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గంలో పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేశారు. 1994 ఎన్నికల్లో మాత్రం ఓటమి చవిచూశారు. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ సంక్లిష్ట పరిస్థితుల్లో. వరుస పదేళ్లపాటు అధికారానికి దూరమైంది. అయినా సరే 1999 ఎన్నికల్లో అదే మడకశిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రఘువీరారెడ్డి.

2003లో ఉమ్మడి రాష్ట్రంలో సుదీర్ఘ పాదయాత్ర చేశారు రాజశేఖర్ రెడ్డి. ఆ సమయంలో అనంతపురం జిల్లాలో అన్ని తానై వ్యవహరించారు రఘువీరారెడ్డి. పాదయాత్ర సక్సెస్ చేయడంలో కీలక పాత్ర పోషించారు. 2004 ఎన్నికల్లో మడకశిర నియోజకవర్గం నుంచి మరోసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు రఘువీరారెడ్డి. ఘన విజయం సాధించడంతో వైయస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. కీలకమైన వ్యవసాయ శాఖను అప్పగించారు రాజశేఖర్ రెడ్డి. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. దీంతో మడకశిర నుంచి కళ్యాణదుర్గం మారాల్సి వచ్చింది. 2009 ఎన్నికల్లో సైతం రఘువీరారెడ్డి గెలిచారు. రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో మళ్లీ వ్యవసాయ శాఖను తీసుకున్నారు. రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో సైతం క్యాబినెట్ మంత్రిగా కొనసాగారు రఘువీరారెడ్డి. అయితే కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో కీలకమైన రెవెన్యూ శాఖను దక్కించుకున్నారు.

2014లో రాష్ట్ర విభజన జరిగింది. చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలు వైసీపీలో చేరిపోయారు. మరికొందరు టిడిపిలో చేరారు. రఘువీరారెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. పార్టీ హై కమాండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమించింది. అయితే గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్నా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. 2023 ఆగస్టు 20న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు రఘువీరారెడ్డి. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రఘువీరారెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతారని బలమైన ప్రచారం నడుస్తోంది. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పుంజుకోకపోవడం.. ఏపీలో కనీస స్థాయిలో కూడా ఉనికి చాటుకోకపోవడంతో రఘువీరారెడ్డి పునరాలోచనలో పడ్డారు.

రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో రఘువీరారెడ్డికి మంచి అనుబంధం ఉంది. మహానేత ప్రోత్సాహంతోనే తాను రాజకీయాల్లో రాణించిన విషయాన్ని పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు రఘువీరారెడ్డి. అయితే ఇప్పుడు వరుసగా కాంగ్రెస్ పార్టీ నేతలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతుండడంతో.. రఘువీరా రెడ్డి పై ఒత్తిడి పెరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి సైతం ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ సమాచారం ఇవ్వడంతో.. రఘువీరారెడ్డి వైసీపీలో చేరేందుకు సిద్ధపడినట్లు సమాచారం. త్వరలో ఆయన చేరిక తప్పదని అనుచరులు సైతం చెబుతున్నారు. అదే జరిగితే ఉమ్మడి అనంతపురం తో పాటు రాయలసీమలో సైతం రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!