Wednesday, March 19, 2025

వైసీపీలోకి రాజశేఖర్ రెడ్డి సన్నిహిత నేత

- Advertisement -

వైసీపీలో మరో కీలక నేత చేరనున్నారా? కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగిన నాయకుడు మనసు మార్చుకున్నారా? జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలనుకుంటున్నారా? ఇంతకీ ఎవరా నేత? ఏంటా కథ?.. కాంగ్రెస్ పార్టీ హయాంలో రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో చాలామంది ప్రజాప్రతినిధులుగా ఎదిగారు. ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా సైతం అవకాశాలు దక్కించుకున్నారు. అటువంటి వారిలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఒకరు. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రెండుసార్లు రాజమండ్రి ఎంపీగా టికెట్ దక్కించుకొని విజయం సాధించారు. ఇప్పటికీ అదే అభిమానాన్ని కనబరుస్తుంటారు. తన రాజకీయ ఉన్నతికి వైయస్ రాజశేఖర్ రెడ్డి కారణమని చెబుతుంటారు. అయితే గత పది ఏళ్లలో ఆయన రాజకీయాలను విడిచిపెట్టి రాజకీయ విశ్లేషకుడిగా మారారు. ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన వైసీపీలో చేరేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది.

ఉండవల్లి అరుణ్ కుమార్ వాగ్దాటి కలిగిన నాయకుడు. ప్రతి అంశం పైన ఆయనకు అవగాహన ఉంది. సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషించగలరు. అయితే 2004లో తొలిసారిగా రాజమండ్రి పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు ఉండవెల్లి. 2009లో సైతం రెండోసారి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణం సమయంలో తీవ్ర విషాదానికి గురయ్యారు. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ జగన్మోహన రెడ్డిని ఇబ్బంది పెడుతున్న క్రమంలో చాలా రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే జగన్ వైసీపీ ఏర్పాటు చేశారు. కానీ కాంగ్రెస్ పార్టీ పట్ల విధేయతతో అదే పార్టీలో కొనసాగారు ఉండవల్లి అరుణ్ కుమార్. 2014లో రాష్ట్ర విభజన తీరు నచ్చక ఉండవల్లి అరుణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్ను విభేదించిన తాను మరో పార్టీలో చేరనని కూడా తేల్చి చెప్పారు. అప్పటినుంచి రాజకీయ విశ్లేషణలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుపడుతున్నారు ఉండవెల్లి. అందుకే వైసీపీలో చేరి జగన్మోహన్ రెడ్డికి అండగా నిలుస్తారని సమాచారం.

ఆది నుంచి మార్గదర్శి విషయంలో పోరాడుతున్నది ఉండవెల్లి అరుణ్ కుమార్. రామోజీరావు మార్గదర్శి విషయంలో డిపాజిటర్లకు మోసం చేస్తున్నారని ఆరోపిస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్ పోరాట బాట పట్టారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఈ కేసు బలపడింది. కానీ 2014లో టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత మరుగున పడింది. 2019లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక మళ్ళీ కదలిక వచ్చింది. ఒకానొక దశలో అరెస్టుల పర్వం కూడా ప్రారంభం అయింది. అయితే ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రావడంతో ఈ కేసు నీరు గారి పోయే అవకాశం ఉంది. తన ఇన్నేళ్ల పోరాటానికి ఫలితం దక్కకుండా పోయిందన్న ఆవేదన ఉండవల్లి లో ఉంది. అందుకే ఆయన వైసీపీలో చేరి ఈ అంశంపై పోరాటానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.

గత పదేళ్లుగా ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ఉండవల్లి అరుణ్ కుమార్ ఉన్నారు. అయితే రాజశేఖర్ రెడ్డి తో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని ప్రతిసారి గుర్తు చేసుకుంటున్నారు ఉండవల్లి. తాను అభిమానించే నేత కుమారుడు కష్టాల్లో ఉండగా చలించిపోతున్నారట. అయితే జగన్ అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో చేరితే అది లాభాపేక్ష అవుతుందని.. అందుకే ఇప్పుడు రాజకీయ ఇబ్బందుల్లో ఉండగా చేరితే మంచిదని భావిస్తున్నారు. పిసిసి మాజీ చీఫ్ సాకే శైలజనాథ్ ఇప్పటికే వైసీపీలో చేరారు. ఇప్పుడు తర్వాత పేరు ప్రముఖంగా ఉండవల్లి అరుణ్ కుమార్ అంటూ ప్రచారం నడుస్తోంది. ఉండవల్లి అరుణ్ కుమార్ వైసీపీలో చేరితే ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!