వైయస్ జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు. రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో దూకుడుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఆయన కాంగ్రెస్ పార్టీపై టార్గెట్ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో మిగిలిన పదిమంది వరకు సీనియర్లను వైసీపీలో చేర్చుకునేందుకు సిద్ధపడుతున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తో పనిచేసిన చాలామంది నేతలు కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు. వారిని ఇప్పుడు వైసీపీలోకి తేవడం ద్వారా కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇంకోవైపు తనను ఇబ్బంది పెడుతున్న సోదరి షర్మిల నాయకత్వాన్ని సైతం నిర్వీర్యం చేయాలని చూస్తున్నారు. ఏకకాలంలో అటు కాంగ్రెస్ పార్టీతో పాటు ఇటు షర్మిలకు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయ్యారు.
వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు బయటకు వెళ్తున్నారు. అయితే వారిపై కేసులు, అరెస్టులు భయం చూపి వైసీపీని వీడేలా చేస్తున్నారు. అందులో భాగంగానే పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పారు. అదే బాటలో చాలామంది నాయకులు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి అలెర్ట్ అయ్యారు. పార్టీ నుంచి వెళ్లిపోతున్న నేతల స్థానంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్లను వైసీపీలోకి తెస్తున్నారు. దీంతో వైసీపీలో ఒక రకమైన ధైర్యం కనిపిస్తోంది. నేతలు మారినంత మాత్రాన పార్టీకి వచ్చే నష్టం ఏమాత్రం లేదన్న ధీమా కనిపిస్తోంది.
కాంగ్రెస్ పార్టీలో చాలామంది మంచి నాయకులు ఉండిపోయారు. అందులో సాకే శైలజానాథ్, జీవి హర్ష కుమార్, పల్లం రాజు లాంటి నేతలు ఉన్నారు. రాష్ట్ర విభజన సమయంలో కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా వారు అదే పార్టీలో కొనసాగారు. గత మూడు ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చవి చూశారు. అయితే వారంతా జనాల్లో ఫేమ్ ఉన్న నాయకులు. గ్రౌండ్ లెవెల్ లో పట్టు ఉన్నవారు. పైగా ఆత్మాభిమానం ఎక్కువ. అటువంటివారు జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి ఇప్పుడు జై కొడుతుండడం విశేషం.
మొన్నటి ఎన్నికల్లో వైసిపి దారుణంగా దెబ్బ తినడానికి కాంగ్రెస్ పార్టీ ఒక కారణం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ షర్మిల వ్యవహార శైలి ఇబ్బందికరంగా మారింది. సోదరుడు అన్న విషయాన్ని మరిచి జగన్మోహన్ రెడ్డిని ఆమె టార్గెట్ చేసుకున్నారు. ఎన్ని రకాల ఆరోపణలు చేయాలో అన్ని రకాలుగా చేసి డ్యామేజ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులతో చేయి కలిపి నష్టం చేకూర్చారు. అందుకే జగన్మోహన్ రెడ్డి రివర్స్ లో వచ్చారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లను వైసీపీలో చేర్చుకునే పనిలో పడ్డారు.
ఇంకోవైపు వామపక్షాలతో స్నేహం చేయాలని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లు తెలుస్తోంది. వామపక్షాలకు ఓటు బ్యాంకు లేకపోయినా.. కొన్ని ప్రత్యేక వర్గాలపై వారు ప్రభావితం చూపగలరు. ముఖ్యంగా ఉద్యోగ కార్మిక వర్గాల్లో ప్రజా సంఘాలు కీలక పాత్ర పోషిస్తాయి. అందుకే వామపక్షాలను దగ్గర చేర్చుకోవాలని జగన్ చూస్తున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో జనసేన, బిజెపి జతకట్టడంతో.. జగన్మోహన్ రెడ్డికి సైతం సరైన భాగస్వామ్యం అవసరం. కాంగ్రెస్ పార్టీతో అది కుదిరే పని కాదు. అందుకే వామపక్షాలతో జతకట్టాలని జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం