Wednesday, March 19, 2025

కాంగ్రెస్ పార్టీ ఆస్తులను తాకట్టు పెడుతున్న షర్మిల!

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ ఆస్తులను షర్మిల తాకట్టు పెట్టారా? అందులో నిజం ఎంత? కర్నూలు జిల్లా పార్టీ ఆఫీసును అలానే సొసైటీ పరిధిలోకి మార్చారా? తాకట్టు పెట్టేందుకే ఆ ప్లాన్ చేశారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎక్కడికక్కడే ఆ పార్టీ నాయకులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తుండటంతో ఈ విషయం బయటపడింది. మరోవైపు సోషల్ మీడియాలో సైతం దీనిపై పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. కాంగ్రెస్ పార్టీలో షర్మిలకు వ్యతిరేక వర్గం రోజురోజుకు ఎక్కువవుతోంది. ముఖ్యంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పని చేసిన వారు, పార్టీ ఉపాధ్యక్షులు, వివిధ విభాగాల్లో పని చేసిన సీనియర్లను ఆమె పక్కన పెట్టారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఆస్తులపై కన్నేసి ఈ నిర్ణయానికి వచ్చారని పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది.

2004లో రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అంతవరకు పార్టీకి కార్యాలయాలంటూ లేవు. కానీ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి రాష్ట్రంలో.. ప్రతి ఉమ్మడి జిల్లాలో పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. అయితే అవేవో ఆశామాషి కార్యాలయాలు కాదు. కార్పొరేట్ తరహాలో నిర్మించారు వాటిని. కొన్ని చోట్ల అయితే కార్యాలయాలకు అనుసంధానంగా ఫంక్షన్ హాల్స్ తో పాటు వాణిజ్య సముదాయాలను సైతం ఏర్పాటు చేశారు. అప్పట్లో నగరాలకు మధ్యలో కార్యాలయాలు ఏర్పాటు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. వాటికి ఇప్పుడు పుష్కలంగా ఆదాయం లభిస్తోంది. అయితే ఇప్పుడు ఆ ఆస్తులను షర్మిల తాకట్టు పెడుతున్నారు అన్నది ప్రధాన ఆరోపణ.

గతంతో పోల్చితే వైయస్ షర్మిలకు ఆదాయ మార్గాలు తక్కువ అయ్యాయి అన్నది ఒక కామెంట్ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి నుంచి ప్రతినెల ఇంత మొత్తంలో ఆమెకు వెళ్లేదని తెలుస్తోంది. కానీ సోదరుడిని రాజకీయంగా విభేదించడం, ఆస్తి కోసం పట్టు పడడం వంటి కారణాలతో జగన్మోహన్ రెడ్డి నుంచి వెళ్లాల్సిన మొత్తం నిలిచిపోయినట్లు సమాచారం. మరోవైపు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి సైతం గతం కంటే ఫండింగ్ తక్కువ అయినట్లు తెలుస్తోంది. జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రభావం తగ్గుతుండడం, ఏపీలో కనీస స్థాయిలో ఉనికి చాటుకోకపోవడంతో కాంగ్రెస్ పెద్దలు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వనట్లు తెలుస్తోంది. ఆశించిన స్థాయిలో పెద్దగా ఫండింగ్ రావడం లేదు. దీంతో పార్టీని నడపడానికి షర్మిల ఇబ్బంది పడుతున్నారు. అందుకే విలువైన ఆస్తులను తాకట్టు పెట్టే పనిలో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం అదే పనిగా ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా కర్నూలు లో ఉన్న పార్టీ కార్యాలయం సొసైటీ పరిధిలోకి మార్చి తాకట్టుగా పెట్టారని తెలుస్తోంది. ఆ జిల్లాకు చెందిన చాలామంది కాంగ్రెస్ పార్టీ నేతలు ఇదే విషయంపై హై కమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

పార్టీలో ఒక పదిమంది వరకు సీనియర్లు ఉన్నారు. కెవిపి రామచంద్రరావు నుంచి సాకే శైలజానాధ్ వరకు.. పల్లం రాజు నుంచి జీవి హర్ష కుమార్ వరకు చాలామంది నేతలు ఉన్నారు. కానీ వారిని సైతం షర్మిల పట్టించుకోవడం లేదు. అటు ద్వితీయ శ్రేణి నాయకులు చాలామంది ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే వారికి టిక్కెట్లు ఇచ్చేందుకు కూడా షర్మిల డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణ పార్టీ నేతల నుంచి వినిపించింది. ఇప్పుడు ఏకంగా పార్టీ ఆస్తులను తాకట్టు పెడుతున్నారన్న ఆరోపణ సైతం రావడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇది ఉత్త ప్రచారమా? లేకుంటే నిజంగా చేస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!