Wednesday, March 19, 2025

ఏపీ బిజెపి చీఫ్ రేసులో ఆ నలుగురు.. 8 తరువాతే క్లారిటీ!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ బిజెపి చీఫ్ ఎంపికలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రస్తుత అధ్యక్షురాలు దగ్గుపాటి పురందేశ్వరి పదవీకాలం ముగుస్తుండడంతో కొత్త అధ్యక్ష నియామకం అనివార్యంగా మారింది. ఇప్పటికే జిల్లాల అధ్యక్షులను ఎంపిక చేశారు. వారు బాధ్యతలు కూడా స్వీకరించారు. ఇక రాష్ట్ర అధ్యక్షుడి పేరు ప్రకటనే తరువాయి అన్నట్టు ప్రచారం నడిచింది. కానీ బిజెపి హై కమాండ్ ఈ ప్రకటనను వాయిదా వేస్తూ వచ్చింది. అయితే ఢిల్లీ ఫలితాలు వచ్చిన తరువాతే బిజెపి జాతీయ అధ్యక్షుడు మార్పు ఉంటుందని టాక్ నడుస్తోంది. అదే సమయంలోనే వివిధ రాష్ట్రాలకు అధ్యక్షులను నియమిస్తారని తెలుస్తోంది. అందులో భాగంగా తెలుగు రాష్ట్రాల కు అధ్యక్షులను ప్రకటిస్తారని సమాచారం.

ప్రస్తుత అధ్యక్షురాలు పురందేశ్వరిని కొనసాగించడం దాదాపు అసాధ్యం. అయితే అధ్యక్ష పదవిని వదులుకుంటున్న ఆమెకు కేంద్రమంత్రిగా పదోన్నతి కల్పిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఏపీ నుంచి బిజెపి ఎంపీ శ్రీనివాస వర్మ కు కేంద్ర క్యాబినెట్ లో చోటు దక్కింది. అయితే ఏపీ విషయంలో ప్రత్యేకంగా ఫోకస్ పెట్టిన బిజెపి మరో మంత్రి పదవి ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అది పురందేశ్వరికేనని తెలుస్తోంది. ఈ మేరకు చంద్రబాబు సైతం లాబీయింగ్ చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఏపీకి కొత్త బిజెపి అధ్యక్షుడు ఎవరు అన్నది ఇప్పుడు ప్రశ్న. అయితే ఓ నలుగురు మధ్య పోటీ ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రధానంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ముందు వరుసలో ఉన్నారు. ఆయన పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఢిల్లీ రాజకీయాల్లో ఉన్న ఆయన రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కుతుందని భావించి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత సమీకరణలు ఒక్కసారిగా మారిపోయాయి. ఆయనకు పదవి ఇచ్చేందుకు అవకాశం లేకుండా పోయింది. అయితే మంత్రి పదవి పై ఆశలు పెట్టుకున్న ఆయనకు.. ఆ చాన్స్ దక్కకపోయేసరికి అసంతృప్తికి గురయ్యారు. అందుకే ఆయనకు బిజెపి చీఫ్ పదవి ఇచ్చి సంతృప్తి పరుస్తారని సమాచారం.

మరోవైపు ఉత్తరాంధ్ర పట్టభద్రుల మాజీ ఎమ్మెల్సీ మాధవ్ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఈయన బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. గతంలో ఎమ్మెల్సీగా ఉన్నారు. చాలా రోజులుగా పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీలోని అన్ని విభాగాల్లో పని చేశారు. అందుకే తనకు అవకాశం ఇవ్వాలని మాధవ్ కోరుతున్నారు. ఈయన విషయంలో బిజెపి హై కమాండ్ సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

ఇంకోవైపు మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి బిజెపి పగ్గాలు అప్పగిస్తే రాయలసీమలో పార్టీ బలపడుతుంది అన్నది ఒక అభిప్రాయం. ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా వ్యవహరించారు కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర విభజనకు పూనుకోవడంతో కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి సమైక్యాంధ్ర పార్టీని ఏర్పాటు చేశారు. కానీ ప్రజల ఆదరణ లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఎన్నికలకు ముందు బిజెపిలో చేరారు. పొత్తులో భాగంగా ఏపీలోని రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఈయనకు బిజెపి రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తే పార్టీకి ప్రయోజనమని హై కమాండ్ కు నివేదికలు వెళ్లినట్లు తెలుస్తోంది. ఒకవేళ పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వకపోతే కిరణ్ కుమార్ కు రాజ్యసభ పదవి ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది.

ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి బిజెపి రాష్ట్ర అధ్యక్ష పదవిని ఆశిస్తున్నారు. ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఆయన బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టిన పార్థసారధికి కమలం పెద్దల ఆశీర్వాదం ఉన్నట్లు సమాచారం. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి పేరు వినిపిస్తున్న.. అది ఉత్త ప్రచారమేనని తేలిపోతోంది. ప్రధానంగా నలుగురు మధ్య అధ్యక్ష పదవి కోసం విపరీతమైన పోటీ ఉన్నట్లు తెలుస్తోంది. ఈనెల 8న ఢిల్లీ ఫలితాలు వచ్చిన తర్వాత దీనిపై క్లారిటీ రానుంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!