బిజెపి ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఏపీ వైపు చూస్తున్నారా? కూటమి ప్రభుత్వంపై సరికొత్త యుద్ధం ప్రకటించనున్నారా? కేసులతో ఉక్కిరి బిక్కిరి చేయనున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది ఆయన వ్యవహార శైలి. బిజెపికి చెందిన సుబ్రహ్మణ్యస్వామి తమిళనాడుకు చెందిన నేత. లాజిక్కులతో కొట్టగల నేర్పరి ఆయన. న్యాయపరమైన అంశాల్లో దిట్ట. కోర్టుల్లో కేసుల వేయడంలోనూ ఘనాపాటి. అయితే పేరుకే బిజెపి కానీ ఆయన ఆ పార్టీతో అంతగా సంబంధాలు లేవు. అప్పుడెప్పుడో 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు మోడీకి ఫుల్ సపోర్ట్ గా నిలిచారు. అప్పట్లో మోడీ క్యాబినెట్లో ఆర్థిక మంత్రి కావాలని కోరుకున్నారు. కానీ మోడీ ఆయనను పక్కనపెట్టి అరుణ్ జైట్లీకి అవకాశం ఇచ్చారు. ఆయన మరణం తరువాత నిర్మల సీతారామన్ కు ఛాన్స్ కల్పించారు. అప్పటినుంచి మోడీపై ఆగ్రహం గా ఉన్నారు సుబ్రహ్మణ్యస్వామి. బిజెపి ఆర్థిక విధానాలను గట్టిగా ప్రశ్నిస్తూ వచ్చారు.
అయితే ఆది నుంచి ఏపీలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని బలంగా మద్దతు తెలుపుతున్నారు సుబ్రహ్మణ్యస్వామి. చంద్రబాబు విషయంలో మాత్రం మొదటి నుంచి ఆగ్రహం గానే ఉంటున్నారు. 2024 ఎన్నికల సమయంలో కూడా బిజెపితో పొత్తు పెట్టుకోవద్దు అని గట్టిగానే వాదించారు. కానీ ఆయన మాట ఎవరూ వినలేదు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది. అందుకే ఏపీ ఫై ఫుల్ ఫోకస్ పెట్టాలని సుబ్రహ్మణ్యస్వామి నిర్ణయం తీసుకున్నారు.
ఏపీలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ వచ్చింది. స్వామి కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నారు. కానీ ఆ మధ్యన తిరుమలలో వివాద సమయంలో గట్టిగానే మాట్లాడారు సుబ్రహ్మణ్యస్వామి. చంద్రబాబు తప్పుడు మాటలు చెబుతున్నారని.. ఆయన వ్యాఖ్యలు నిరాధారం అని కొట్టిపారేశారు. శ్రీవారి విషయంలో చంద్రబాబు మహాపచారం చేశారని.. చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లపాటు కొనసాగడం డౌటే అని సంచలన కామెంట్స్ చేశారు స్వామి. అయితే తిరుమల లడ్డు వివాదంలో న్యాయపరంగా పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఏపీలో చంద్రబాబు, కేంద్రంలో మోడీ సుబ్రహ్మణ్యస్వామి వ్యతిరేకులుగా ఉన్నారు. అందుకే స్వామి కార్యం స్వకార్యం అన్నట్లుగా సుబ్రహ్మణ్యస్వామి వైఖరి ఉందని అంటున్నారు. అయితే బిజెపి నేత హోదాలో ఏపీ విషయంలో సుబ్రహ్మణ్యస్వామి ఇరకాటంలో పెడుతున్నారు. ఈయనపై వైసీపీ అనుకూలముద్ర ఉంది. అలాగని ఎదురు వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదు. మొత్తానికైతే స్వామి ఏపీలో ఎంట్రీ తర్వాత సీన్ మారుతోంది.