Wednesday, March 19, 2025

అనవసరంగా ఆదివాసీలను కెలికిన అయ్యన్నపాత్రుడు!

- Advertisement -

స్పీకర్ అయ్యన్నపాత్రుడు కూటమి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు. అనవసర వ్యాఖ్యలతో గిరిజనుల మనోభావాలను దెబ్బతీశారు. దీంతో ఆదివాసీలు రోడ్డెక్కారు. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంత జరుగుతున్న స్పీకర్ అయ్యన్నపాత్రుడు దిద్దుబాటు చర్యలకు దిగడం లేదు. ఫలితంగా కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. మూడు పార్టీల నేతలు దీనిపై ఆందోళనతో ఉన్నారు. అనవసర వ్యాఖ్యలతో అయ్యన్నపాత్రుడు ప్రభుత్వానికి ఇరుకున పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్ముందు ఆయనను కట్టడి చేయాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నారు. స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఎంపిక సమయంలోనే కూటమిలోనే సహచరులు కీలక సూచనలు చేశారు. వివాదాలకు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కానీ అయ్యన్నపాత్రుడు అవేవీ పరిగణలోకి తీసుకోవడం లేదు. లేనిపోని కామెంట్స్ తో అనవసర ఇబ్బందులు తెచ్చి పెడుతున్నారు.

ఆ మధ్యన విశాఖలో జరిగిన పర్యాటక రంగ కార్యక్రమానికి స్పీకర్ అయ్యన్నపాత్రుడు హాజరయ్యారు. తన ప్రసంగంలో పర్యాటక రంగ అభివృద్ధి గురించి మాట్లాడారు. అంతవరకు బాగుంది కానీ.. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే క్రమంలో అవసరం అయితే గిరిజనుల భూములను సైతం వెనక్కి తీసుకోవాలన్న అర్థం వచ్చేలా మాట్లాడారు. వన్ బై 70 చట్టాన్ని సవరించడం అంటే అటవీ భూములను ఇతరులకు విక్రయించడానికి వేసులుబాటు కల్పించాలని అర్థం వచ్చేలా మాట్లాడారు. దీంతో ఒక్కసారిగా గిరిజనులు ఆగ్రహానికి గురయ్యారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అయ్యన్నపాత్రుడు ఆ ప్రకటన చేయడంతో.. ప్రభుత్వం ఆ దిశగా ఆలోచిస్తుందన్న సంకేతాలు వచ్చాయి. దీంతో గిరిజన సంఘాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. రెండు రోజులపాటు నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి.

అయితే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంధ్యారాణి ప్రత్యేక ప్రకటన చేశారు. ప్రభుత్వానికి అటువంటి ఆలోచన లేదని చెప్పుకొచ్చారు. అయినా సరే గిరిజనులు వినలేదు. మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి రోడ్డు ఎక్కారు. బుధవారం సైతం ఆందోళన కొనసాగిస్తామని.. రవాణా వ్యవస్థను స్తంభింప చేస్తామని.. విద్యాసంస్థలను మూసివేస్తామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వంపై ఆదివాసీలు ఆగ్రహంగా ఉన్నారు.

అయితే అనవసరంగా గిరిజనుల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత తేవడంలో అయ్యన్నపాత్రుడు కారణమయ్యారన్న ఆగ్రహం కూటమి పార్టీల్లో ఉంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న నేత ఎంతో జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందని నేతలు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో చంద్రబాబు చొరవ తీసుకోవాలని.. స్పష్టమైన సూచనలు చేయాలని కోరుతున్నారు. అనవసర విషయాల్లో స్పీకర్ అయ్యన్నపాత్రుడు జోక్యం తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!