Wednesday, March 19, 2025

జనసేనలో తీవ్ర అంతర్మధనంలో ఆ ముగ్గురు నేతలు.. అనవసరంగా వైసీపీని వీడారా!

- Advertisement -

జనసేనలో చేరిన నేతలు డిఫెన్స్ లో పడుతున్నారా? అనవసరంగా చేరామని భావిస్తున్నారా? ఏదో ఊహించుకుంటే.. ఏదో జరిగిందని బాధపడుతున్నారా? సరైన గుర్తింపు లభించడం లేదని అసంతృప్తితో ఉన్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఆ నేతల సన్నిహిత వర్గాలు అదే చెబుతున్నాయి. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురయింది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కేవలం 11 స్థానాలకు మాత్రమే ఆ పార్టీ పరిమితం అయింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో పార్టీ దెబ్బతింది. అయితే పార్టీకి భవిష్యత్తు లేదని భావించిన నేతలు ఒక్కొక్కరు బయటకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కీలక నేతలు సైతం పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. అయితే ఇలా వెళ్లి కూటమి పార్టీలో చేరిన చాలామంది నేతలకు ఇప్పుడు మింగుడు పడడం లేదు. ముఖ్యంగా వైసీపీ నుంచి జనసేనలో చేరిన నేతల పరిస్థితి నానాటికి తీసుకట్టుగా మారుతోంది.

వైసీపీ నుంచి చాలామంది నేతలు జనసేనలో చేరారు. తెలుగుదేశం పార్టీలో అవకాశం లేకపోవడంతో పవన్ కళ్యాణ్ చెంతకు వీరంతా చేరారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య లాంటి నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరారు. అక్కడ జనసేనలో తమ పరిస్థితి బాగుంటుందని భావించారు. తమకు తిరుగు లేదని ఏవేవో ఆశలు పెట్టుకున్నారు. కానీ జనసేనలో తాము అనుకున్నది ఒక్కటి సాధించలేకపోయారు. కనీస స్థాయిలో కూడా పార్టీలో ముద్ర చూపలేకపోతున్నారు. దీంతో జనసేనలోకి ఎందుకు వచ్చామా? అని బాధపడుతున్నారు. వెనక్కి వెళ్లలేక.. పార్టీలో ఉండలేక సతమతమవుతున్నారు.

వైసీపీలో ఒక వెలుగు వెలిగారు బాలినేని శ్రీనివాస్ రెడ్డి. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు. యూత్ కాంగ్రెస్ లో అడుగుపెట్టిన బాలినేనికి 2004లో టికెట్ ఇచ్చి ప్రోత్సహించారు రాజశేఖర్ రెడ్డి. ఆ ఎన్నికల్లో బాలినేని ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009లో రెండోసారి అవకాశం ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి. ఎమ్మెల్యేగా విజయం సాధించడంతో ఏకంగా తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. అయితే రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్ వెంట అడుగులు వేశారు. తన మంత్రి పదవిని సైతం వదులుకొని వైసీపీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి సైతం బాలినేనికి ఎంతో అవకాశం ఇచ్చారు. 2014లో ఓడిపోయిన బాలినేని 2019లో మాత్రం గెలిచారు. మంత్రిగా క్యాబినెట్ లోకి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. విస్తరణలో బాలినేనిని తొలగించేసరికి మనస్థాపానికి గురయ్యారు. అయిష్టంగానే పార్టీలో కొనసాగుతూ 2024 ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఓడిపోయేసరికి జనసేనలోకి చేరిపోయారు. కానీ అక్కడ కనీస స్థాయిలో నేతగా కూడా అక్కడ పార్టీ శ్రేణులు గుర్తించడం లేదు.

ఉమ్మడి కృష్ణాజిల్లాలోని సీనియర్ నేతగా గుర్తింపు పొందారు సామినేని ఉదయభాను. ఈ ఎన్నికల్లో జగ్గయ్యపేట నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఎన్నికల ఫలితాల అనంతరం సైలెంట్ గా ఉన్నారు. తరువాత జనసేన లో చేరారు. 1999 ఎన్నికల్లో రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ అభ్యర్థిగా తొలిసారిగా పోటీ చేసి గెలిచారు. 2004 ఎన్నికల్లో సైతం విజయం సాధించారు. కానీ 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. రాజశేఖర్ రెడ్డి మరణంతో జగన్ వెంట అడుగులు వేశారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. వివిధ సమీకరణలో భాగంగా జగన్మోహన్ రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేకపోయారు. ప్రభుత్వ విప్ పదవి ఇచ్చి ప్రోత్సహించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మూడోసారి పోటీ చేసి ఓడిపోయారు. వైసిపి తో ఉన్న సంబంధాలను తెంచుకొని జనసేనలో చేరారు. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కడం లేదని అసంతృప్తితో ఉన్నారు.

మరో సీనియర్ మోస్ట్ లీడర్ కిలారు రోశయ్య జనసేనలో చేరారు. 2019 ఎన్నికల్లో పొన్నూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు రోశయ్య. ఈ ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఓడిపోయేసరికి పార్టీకి దూరమయ్యారు. జనసేనలో చేరారు. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో గుర్తింపు లేకుండా పోయింది. దీంతో జనసేనలో అనవసరంగా చేరామా అని రోశయ్య బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరిన నేతల పరిస్థితి తారుమారు అయింది. కానీ ఇప్పటికే సొంత పార్టీని ద్వేషించి వెళ్లిపోవడంతో వారు తిరిగి రాలేని పరిస్థితి. అయితే మున్ముందు ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం వారు రీబ్యాక్ కావడం ఖాయమని తెలుస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!