Sunday, March 16, 2025

వైసిపి లోకి ఆ ముగ్గురు.. మారనున్న ఏపీ రాజకీయాలు

- Advertisement -

వైసీపీలోకి భారీగా చేరికలు పెరగనున్నాయా? వైయస్ రాజశేఖర్ రెడ్డితో పనిచేసిన నేతలు చేరనున్నారా? జగన్ తో కలిసి నడిచేందుకు వారు సిద్ధపడ్డారా? నేడు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వారు వైసీపీలో చేరనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఏపీలో విచిత్ర రాజకీయాలు నెలకొన్నాయి. వైసీపీని టార్గెట్ చేస్తూ కూటమి పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఆ పార్టీకి చెందిన కీలక నేతలు రాజకీయాల నుంచి గుడ్ బై చెప్పేలా ప్రణాళిక రూపొందించాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ద్వారా రకరకాల ఒత్తిళ్లకు పాల్పడుతున్నాయి. అందులో భాగంగా వైసిపి కీలక నేత విజయసాయిరెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పారు. అదే బాటలో మరికొందరు నేతలు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. సరిగ్గా అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి తన ప్లాన్ మార్చారు. పెద్ద ఎత్తున ఇతర పార్టీల నుంచి నాయకులును చేర్చుకోవడం ద్వారా గట్టి సవాల్ విసరడానికి సిద్ధపడ్డారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి సమక్షంలో కీలకమైన ముగ్గురు నేతలు చేరేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తయినట్లు సమాచారం.

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా సేవలందించిన సాకే శైలజానాథ్ వైసీపీలో చేరతారని తెలుస్తోంది. గత కొద్ది రోజులుగా ఇదే ప్రచారం నడుస్తోంది.. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఆయన వైసీపీ గూటికి చేరడం ఖాయమని తెలుస్తోంది. 2004లో కాంగ్రెస్ పార్టీలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు సాకే శైలజానాథ్. దివంగత మహానేత వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో తొలిసారిగా సింగనమల నియోజకవర్గం నుంచి 2004లో బరిలో దిగారు. ఆ ఎన్నికల్లో గెలిచారు శైలజా నాథ్. 2009లో రెండోసారి శైలజానాథ్ కు టికెట్ ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి. ఆ ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలిచారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ గా కూడా పనిచేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టిన నేపథ్యంలో ఆయన బయటకు వెళ్లిపోయారు. సొంతంగా వైసీపీని ఏర్పాటు చేశారు.

అయితే సాకే శైలజా నాథ్ కాంగ్రెస్ భావజాలం ఉన్న నేత. ఆపై రాజశేఖర్ రెడ్డి అంటే విపరీతమైన అభిమానం. 2014లో రాష్ట్ర విభజన ఒకవైపు, వైసిపి ఆవిర్భావం మరోవైపు.. కాంగ్రెస్ పార్టీని ఏపీలో కోలుకోలేని దెబ్బతీసింది. ఆ సమయంలో శైలజానాథ్ కు కాంగ్రెస్ నాయకత్వం పిసిసి బాధ్యతలు అప్పగించింది. దీంతో శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీలో ఉండి పోవాల్సి వచ్చింది. అది మొదలు ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీలోనే ఆయన గడుపుతూ వచ్చారు. కానీ ఇప్పుడు మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శైలజానాథ్ వైసీపీలో చేరేందుకు సిద్ధపడినట్లు సమాచారం.

మరోవైపు ఉభయగోదావరి జిల్లాలకు చెందిన కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజుతోపాటు మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ సైతం వైసీపీలో చేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలు సైతం రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఎంపీలుగా గెలిచారు. కాంగ్రెస్ పార్టీతో ఉన్న అనుబంధాన్ని వీడ లేక ఇన్ని రోజులు పాటు అదే పార్టీలో కొనసాగారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీలో చేరేందుకు దాదాపు సిద్ధపడ్డారు. పిసిసి అధ్యక్షురాలు షర్మిల తీరు నచ్చక వీరు జగన్ గూటికి చేరుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఒకప్పటి వైయస్ రాజశేఖర్ రెడ్డి సమకాలీకులు కుమారుడు జగన్ మోహన్ రెడ్డి పార్టీలో చేరుతుండడం నిజంగా గర్వించదగ్గ విషయం

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!