Sunday, March 16, 2025

కిరణ్ రాయల్ వివాదంలో ట్విస్ట్.. బాధితురాలి వెనుక ఆ జనసేన నేత!

- Advertisement -

జనసేన కిరణ్ రాయల్ వివాదంలో సరికొత్త ట్విస్ట్. ఇప్పటివరకు ఇందులో రాజకీయ కుట్ర కోణం ఉందని ఆరోపణలు వచ్చాయి. కానీ కుట్ర చేసింది సొంత పార్టీ నేతలేనని తెలుస్తోంది. ఈ ఘటన వెనుక జనసేన నేతల హస్తం ఉందని ప్రచారం ప్రారంభమైంది. కిరణ్ రాయల్ చర్యలతో విసిగి వేసారి పోయిన ఓ సీనియర్ నేత ఈ వివాదాన్ని అడ్డం పెట్టుకొని సోషల్ మీడియాలో ఆ వీడియోలు పోస్ట్ చేసినట్లు తేలింది. కొద్దిరోజుల కిందట కిరణ్ రాయల్ తనను మోసం చేశాడంటూ లక్ష్మీరెడ్డి అనే మహిళ ఆరోపించిన సంగతి తెలిసిందే. తన వద్ద రెండు కోట్లకు పైగా తీసుకొని మోసం చేశాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. అదే క్రమంలో కొన్ని వీడియోలు కూడా వైరల్ అయ్యాయి.

అయితే లక్ష్మీరెడ్డి బ్లాక్మెయిల్ చేస్తున్నారని.. ఆమె వ్యక్తిగత జీవితం గురించి కూడా కిరణ్ రాయల్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఈ వివాదం నేపథ్యంలో జనసేన నాయకత్వం కొద్దిరోజులపాటు కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయల్ కు ఆదేశించింది. అదే సమయంలో బాధితురాలు లక్ష్మీరెడ్డి మీడియా ముందుకు వచ్చి అనేక రకాలుగా ఆరోపణలు కూడా కొనసాగించారు. ఇటువంటి తరుణంలో కిరణ్ రాయల్ కొద్దిరోజుల పాటు సైలెంట్ అయ్యారు. అటు బాధితురాలు లక్ష్మీరెడ్డి సైతం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఉన్నట్టుండి ఆమె నిన్ననే తెరపైకి వచ్చారు. మీడియాతో మాట్లాడారు. కిరణ్ రాయల్ వివాదంతో తన కుటుంబం వీధిన పడిందని.. కుటుంబ సభ్యుల విన్నపం మేరకు ఈ వివాదాన్ని ఇంతటితో ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు ఆమె ప్రకటించారు. పనిలో పనిగా కిరణ్ రాయల్ వీడియోలు తాను విడుదల చేయలేదని.. ఏడాది కిందట సమస్య పరిష్కరిస్తానంటే ఆ వీడియోలు జనసేన నేతకు ఇచ్చానని చెప్పారు బాధితురాలు లక్ష్మీరెడ్డి.

అయితే జనసేన కీలక నేతగా ఉన్న హరిప్రసాద్ ఈ మొత్తం ఎపిసోడ్ కు కారణం అని అర్థం వచ్చేలా మాట్లాడారు లక్ష్మిరెడ్డి. అప్పట్లో ఆయనకు ఆ వీడియోలు ఇచ్చానని గుర్తు చేశారు. ఆ వీడియోలు సోషల్ మీడియాలో రావడం వెనుక తన పాత్ర లేదని.. హరిప్రసాద్ ఈ పని చేసి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదం జనసేనలో ప్రకంపనలు రేపుతోంది.

కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న కిరణ్ రాయల్ తన పొలిటికల్ కెరీర్ గురించి బాధితురాలు లక్ష్మీరెడ్డితో రాజీ కుదుర్చుకున్నట్లు సమాచారం. ఆమెతోపాటు ఆమె పిల్లల కాళ్ళ వేళ్ళ పడి తనను ఇబ్బంది పెట్టవద్దని కోరినట్లు సమాచారం. ఇందులో జనసేన నేత ప్రమేయం ఉన్నట్టు చెప్పాలని వారిని కోరినట్లు తెలుస్తోంది. ప్రెస్ మీట్ పెట్టి ఆ జనసేన నేత పేరు బయట పెట్టాలని కోరినట్లు సమాచారం. అందుకే బాధితురాలు లక్ష్మీరెడ్డి మీడియా ముందుకు వచ్చి జనసేన నేత ఇదంతా చేశారని అర్థం వచ్చేలా మాట్లాడారు. మొత్తానికి అయితే అటు తిరిగి ఇటు తిరిగి ఈ వివాదం జనసేన మేడకు చుట్టుకుంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!