తెలుగుదేశం పార్టీలో ఒక వెలుగు వెలిగారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఎన్టీఆర్ పెద్ద అల్లుడిగా పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఒక విధంగా చెప్పాలంటే పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ వెంట నడిచింది కూడా ఆయనే. వెంకటేశ్వర తో పోల్చుకుంటే చంద్రబాబు జూనియర్. కానీ టిడిపి సంక్షోభ సమయంలో వెంకటేశ్వరరావు తో పాటు ఎన్టీఆర్ కుటుంబాన్ని పావుగా వాడుకున్నారు చంద్రబాబు. అయితే అలా చంద్రబాబు సీఎం అయిన తర్వాత కొద్దిరోజుల పాటు మాత్రమే దగ్గుబాటి వెంకటేశ్వరరావు టిడిపిలో కొనసాగగలిగారు. అటు తరువాత విభేదించి మూడు దశాబ్దాల పాటు దూరంగా ఉండిపోయారు. ఏ పార్టీలో కూడా ఇమడలేకపోయారు. చివరకు రాజకీయాలను విడిచిపెట్టారు. ఎప్పుడైతే రాజకీయాలకు వెంకటేశ్వరరావు గుడ్ బై చెప్పారో అప్పుడే చంద్రబాబు సైతం దగ్గర చేర్చుకున్నారు. తోడల్లుడు వెంకటేశ్వరరావు పై ఎనలేని ప్రేమ చూపిస్తున్నారు.
దగ్గుబాటి పురందేశ్వరి ఏపీ బీజేపీ చీఫ్ గా ఉన్నారు. రాజమండ్రి ఎంపీగా కూడా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో బిజెపి పొత్తు వెనుక ఆమె ఉన్నారు. యాక్టివ్ రోల్ ప్లే చేశారు. అయితే దగ్గుపాటి వెంకటేశ్వరరావు కుమారుడు పొలిటికల్ ఎంట్రీ త్వరలో తెలుగుదేశం పార్టీ ద్వారా చేయాలని భావిస్తున్నారు. దానికి చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆ రెండు కుటుంబాలు మరింత సన్నిహితంగా మారిపోయాయి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో నందమూరి హరికృష్ణ కుటుంబం మాత్రమే ఇబ్బంది పడుతోంది. నందమూరి హరికృష్ణ కుమారులు ఇద్దరిని కుటుంబం దూరం పెట్టినట్టు ప్రచారం నడుస్తోంది.
ఇంకోవైపు చంద్రబాబు ఇప్పుడు కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యమిస్తున్నారు. నందమూరి కుటుంబంతో పాటు సమీప బంధువులకు ఎనలేని ప్రియారిటి ఇస్తున్నారు. ఇదంతా లోకేష్ భవిష్యత్తు కోసమేనని టాక్ నడుస్తోంది. అయితే దగ్గుబాటి వెంకటేశ్వరరావు కోసం ఢిల్లీ నుంచి చంద్రబాబు ప్రత్యేక విమానంలో రావడం విశేషం. ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు చంద్రబాబు. రేపు ఉదయం దగ్గుబాటి వెంకటేశ్వరరావు రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం విశాఖకు వస్తారు చంద్రబాబు. రాత్రికి టిడిపి కార్యాలయంలో బస చేస్తారు. రేపు ఉదయం పుస్తకావిష్కరణ అనంతరం మిగిలిన పనులను చక్కబెట్టేందుకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్తారు. మొత్తానికి అయితే తోడల్లుడు కోసం ప్రత్యేక విమానంలో వస్తుండడం గమనార్హం. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు ఎలాంటి ఆలోచన చేస్తున్నారో.