ఏపీలో అత్యంత దురదృష్టవంతమైన నేత ఎవరంటే పిఠాపురం వర్మ. 2024 ఎన్నికల్లో టిడిపి గెలిచే సీటు కూడా పిఠాపురం. అటువంటి నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేశారు వర్మ. కానీ ఆ త్యాగానికి తగ్గ ఫలితం ఇంతవరకు దక్కలేదు. త్యాగానికి విలువ లేకపోగా అడుగడుగునా ఆయనకు అవమానాలు ఎదురవుతున్నాయి. దీంతో టీడీపీలో ఉండలేక.. తన పరిస్థితి చంద్రబాబుకు చెప్పుకోలేక చాలా బాధపడుతున్నారట. వాస్తవానికి పిఠాపురంలో వర్మకు తిరుగులేదు. ఎదురులేని నేతగా ఉన్నారు. ఇండిపెండెంట్గా పోటీ చేసిన రికార్డు మేరిజారిటీ సాధించిన చరిత్ర ఆయనది. అటువంటి నేత పవన్ కళ్యాణ్ కోసం తప్పుకుంటే ఆయన కు కనీసం గౌరవం దక్కడం లేదు.
ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. కీలక మంత్రిత్వ శాఖలను నిర్వర్తిస్తున్నారు. ఆయన నియోజకవర్గానికి అందుబాటులో ఉండరు. ఆ సమయంలో సైతం వర్మకు ఎటువంటి బాధ్యతలు అప్పగించడం లేదు. పవన్ కళ్యాణ్ తన సొంత వ్యక్తులను ఏర్పాటు చేసుకున్నారు. అదే సమయంలో జనసేన నేతలు వర్మ అంటే లెక్కచేయడం లేదు. పైగా తక్కువ చేసి మాట్లాడుతున్నారు.
పోనీ ఎమ్మెల్సీ లాంటి పదవి ఇస్తే గౌరవం ఉంటుందని వర్మ భావిస్తున్నారు. కానీ ఇప్పట్లో వర్మకు ఎమ్మెల్సీ పదవివచ్చే అవకాశం లేదు. వివిధ సమీకరణలో భాగంగా ఈసారి కూడా వర్మ పేరు తప్పిస్తారని ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యేల కోటా కింద ఈ నెల 20న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో ఒక పదవి తనకు వస్తుందని భావించారు వర్మ. కానీ కాపు సామాజిక వర్గ సమీకరణల పేరు చెప్పి వర్మను తప్పిస్తారని ప్రచారం సాగుతోంది.
ఇంకోవైపు తాజాగా వర్మను టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయం తీసుకున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాజీ ఎమ్మెల్యే దొరబాబును జనసేన లోకి రప్పిస్తున్నారు. ఇటీవల ఆయన పవన్ కళ్యాణ్ ను కలిశారు. పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. ఇంకోవైపు మాజీ ఎంపీ వంగా గీత సైతం జనసేన లోకి వస్తారని ప్రచారం సాగుతోంది. ఆ నేతలంతా వస్తే వర్మకు ఇక చెక్ పడినట్టే. తన వల్లే పవన్ కళ్యాణ్ విజయం సాధించారని అర్థం వచ్చేలా మాట్లాడుతున్నారు వర్మ. అందుకే భవిష్యత్తును ఆలోచించి పవన్ కళ్యాణ్ వర్మకు ఇలా చెక్ చెపుతూ వస్తున్నారు.