ఉత్తరాంధ్రలో పార్టీని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గా కురసాల కన్నబాబును నియమించారు. గతంలో కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డి, వై వి సుబ్బారెడ్డి లాంటివారు ఉండేవారు. ఇప్పుడు మాజీమంత్రి కన్నబాబుకు ఛాన్స్ ఇచ్చారు. దీంతో ఆయన యాక్షన్ లోకి దిగిపోయారు. ఉత్తరాంధ్ర కోఆర్డినేటర్ గా తొలి సమావేశం నిర్వహించారు. మూడు జిల్లాల నుంచి నాయకుల హాజరయ్యారు. అన్ని నియోజకవర్గాల ఇన్చార్జులు పాల్గొన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఉత్తరాంధ్ర ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. 2014 ఎన్నికల్లో 9 నియోజకవర్గాల్లో సత్తా చాటింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే టిడిపి ఆవిర్భావం తర్వాత ఉత్తరాంధ్ర మొత్తం ఆ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సమయంలో సైతం టిడిపి హవా ఉండేది ఉత్తరాంధ్రలో. అటువంటిది 2019 ఎన్నికల్లో టిడిపి ఆరు స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. విజయనగరంలో అయితే క్లీన్ స్వీప్ చేసింది. శ్రీకాకుళంలో రెండు స్థానాలు మినహా.. మొత్తం ఊర్చేసింది. విశాఖలో అయితే నగరంలోని నాలుగు నియోజకవర్గాలు తప్ప.. గ్రామీణ ప్రాంతంలోని అన్ని నియోజకవర్గాల్లోనూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా పాతేసింది.
అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి పూర్తిగా సీన్ మారింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కేవలం రెండు స్థానాలకు మాత్రమే పరిమితం అయింది. 34 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 32 చోట్ల టిడిపి కూటమి పాగావేసింది. ఇటువంటి సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. వీటిని అధిగమించేందుకుగాను సమర్థమైన నేతగా పేరుపొందిన కన్నబాబుకు ఉత్తరాంధ్ర రీజనల్ బాధ్యతలు అప్పగించారు జగన్మోహన్ రెడ్డి.
కన్నబాబు రంగంలోకి దిగారు. ఇప్పుడిప్పుడే ఓటమి బాధ నుంచి చేరుకుంటున్న పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. ఉత్తరాంధ్ర ప్రాంతీయ సమావేశాన్ని నిర్వహించారు. ఓ ఇద్దరు నేతలు తప్ప అంత హాజరయ్యారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం గైర్హాజరయ్యారు. అయితే పార్టీ శ్రేణులకు కురసాల కన్నబాబు దిశా నిర్దేశం చేశారు. అందరం సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుదాం అని.. 2029 ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో సత్తా చాటుదామని పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర నేతలంతా ఏకతాటిపైకి వచ్చి.. ప్రజా సమస్యల పోరాటానికి నడుం బిగించడం మాత్రం పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన ధైర్యం వస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర నుంచి జిల్లాల పర్యటనలకు శ్రీకారం చుట్టనుండడంతో విజయవంతం చేయాలని కన్నబాబు పిలుపునిచ్చారు. అదే సమయంలో సీనియర్లు తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు వైఖరిపై హై కమాండ్ కు కన్నబాబు నివేదిక ఇచ్చినట్లు సమాచారం.