వైసీపీలో అసంతృప్తి గళం పెరుగుతోందా? ఒకరిద్దరు నేతల తీరుతోనే ఓడిపోయామన్న అభిప్రాయం ఉందా? అటువంటి వారిని అధినేత దూరం పెట్టాలని సూచిస్తున్నారా? వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అసలు ఏం జరుగుతోంది? అసంతృప్తి నేతల పయనం ఎటు? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే ఆసక్తికర చర్చ. మొన్నటికి మొన్న కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తన అసంతృప్తి స్వరం వినిపించారు. తాజాగా విశాఖకు చెందిన వాసుపల్లి గణేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా లాంటి నేతల తీరుతోనే పార్టీకి భారీ డ్యామేజ్ జరిగిందని.. వారందరినీ పార్టీ నుంచి బయటకు పంపించడమే మేలని అర్థం వచ్చేలా వీరు మాట్లాడడం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఇటీవల చాలా సందర్భాల్లో కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలపై గట్టిగానే మాట్లాడుతున్నారు. ఒకరిద్దరి నేతల వ్యవహార శైలి తోనే వైసీపీకి డ్యామేజ్ జరిగిందని విశ్లేషించారు. ముఖ్యంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి పై అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలుగుదేశం పార్టీకి వరంగా మారింది అన్నారు. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీ నేతలను కంట్రోల్ చేయలేకపోయారని వెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు కూడా పార్టీకి నష్టం చేకూర్చాయని గుర్తు చేశారు. అయితే కేతిరెడ్డి పదే పదే పార్టీ వైఫల్యాలను గుర్తు చేస్తూ విశ్లేషణలు చేయడం మాత్రం కొన్ని రకాల అనుమానాలకు తావిచ్చింది.
వల్లభనేని వంశీ మోహన్ అరెస్టు అక్రమమని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కానీ దీనికి భిన్నంగా స్పందించారు విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. అసలు కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీని పార్టీ నుంచి బయటకు పంపించడం బెటర్ అని అభిప్రాయపడ్డారు. వారిద్దరి వ్యవహార శైలితోనే వైసీపీకి డామేజ్ జరిగిందని చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి రోజా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని అభిప్రాయపడ్డారు. విజయసాయిరెడ్డి మాదిరిగా వీరందరిని పార్టీ నుంచి బయటకు పంపేయడమే ఉత్తమమని చెప్పుకొచ్చారు. విజయసాయిరెడ్డి తీరుతోనే ఉత్తరాంధ్రలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని కూడా ఆరోపించారు. ఆయన ఇచ్చిన తప్పుడు నివేదికల వల్లే తప్పులు జరిగాయన్నారు. మొత్తానికైతే వల్లభనేని వంశీ అరెస్టు సమయంలో వాసుపల్లి గణేష్ కుమార్ బాంబు పేల్చినట్టు సంచలన ఆరోపణలు చేశారు.
అయితే గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు.. సరైన గుర్తింపు లభించలేదని భావిస్తున్న వారు ఇప్పుడు కొత్తగా అసంతృప్తి స్వరం వినిపిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వాసుపల్లి గణేష్ కుమార్ టిడిపి తరఫున గెలిచారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. కానీ పార్టీలో తనకు సరైన గౌరవం దక్కలేదని ఆయన బాధతో ఉండేవారు.. దానికి విజయసాయిరెడ్డి తీరు కారణమని తరచు ఆరోపణలు చేసేవారు. ఇప్పుడు బిజెపిలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే కూటమి పట్ల సానుకూలత చూపుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి వినిపించారని తెలుస్తోంది.
మరోవైపు కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మాటలు చూస్తుంటే ఆయన జనసేన వైపు చూస్తున్నట్టు కనిపిస్తున్నారు. అందుకే పార్టీ నుంచి ఒక వ్యూహం ప్రకారం పక్కకు వెళ్లేలా మాట్లాడుతున్నారు. పార్టీని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఈ ఇద్దరే కాదు మున్ముందు చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇలానే సొంత పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది