వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. పార్టీకి ఘోర పరాజయం ఎదురయింది. ఇక పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న వారు గుడ్ బై చెబుతున్నారు. కేసులకు భయపడిన వారు రాజీనామాలు చేస్తున్నారు. ఇంకా అధికారాన్ని వెతుక్కుంటూ వెళ్లిన వారు ఉన్నారు. పార్టీలో నెంబర్ 2 గా ఎదిగిన విజయసాయి రెడ్డి లాంటి వారు కూడా అస్త్ర సన్యాసం చేశారు. ఉన్నవారితోనే రాజకీయాలు చేసుకుంటానని జగన్మోహన్ రెడ్డి చెబుతున్నారు. ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలు ఎండగడతానని చెప్పుకొస్తున్నారు. అంతవరకు ఓకే. కానీ క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు ఆత్మస్థైర్యం అవసరం. తాను ఒక్కడినే కాదు గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో లబ్ధి పొందిన నేతలు, వివిధ వర్గాల ప్రతినిధులతో పని చేయిస్తేనే ఫలితాలు వస్తాయి. ఈ విషయాన్ని జగన్ మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోవాలి.
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 151 మందికి ఎమ్మెల్యేలుగాను, రెండుసార్లతో కలుపుకుంటే ఓ 50 మంది వరకు మంత్రులుగాను, రాజ్యసభ సభ్యులతో కలుపుకుంటే మరో 40 మంది వరకు ఎంపీలుగాను, మరో 40 మంది ఎమ్మెల్సీలు గాను, ఓ 13 మంది జిల్లా పరిషత్ చైర్మన్ల గాను, వందల సంఖ్యలో మున్సిపల్ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, మేయర్లు, డిప్యూటీ మేయర్లు గాను చేశారు. వేలాదిమందిని ఎంపీపీలుగా కూడా చేశారు. జడ్పిటిసిలుగా కూడా అవకాశం ఇచ్చారు. పదివేల మందికి పైగా ఎంపీటీసీలను, సర్పంచులను చేశారు. వేలాదిమందికి నామినేటెడ్ పోస్టులు కట్టబెట్టారు. కానీ ఇందులో 10 శాతం మంది కూడా ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం లేదు. కేవలం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. ముందు వీరితో పని చేయించుకోవడం జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆవశ్యం.
పార్టీకి పనికొచ్చారని.. పనికొస్తారని చాలా రకాల నియామకాలు చేపట్టారు. అందులో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఒకరు. గతంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన చాలామంది న్యాయవాదులకు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారు. కింది స్థాయి కోర్టులనుంచి హైకోర్టు వరకు వందలాదిమందికి ఛాన్స్ కల్పించారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇలా ప్రాసిక్యూటర్లుగా పదవులు పొందిన వారు కనీసం న్యాయ సహాయం చేయడం లేదు. కనీసం న్యాయ సూచనలు చేయడానికి కూడా ముందుకు రావడం లేదు. పైగా ఏదైనా కేసు నిమిత్తం వెళితే డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇలా పదవులు పొందిన వారు సైతం పార్టీ శ్రేణులకు అండగా నిలిచేలా జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపట్టాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ముందుగా వారిలో మార్పు తెస్తే.. పార్టీ కోసం వారు పని చేస్తే సత్ఫలితాలు వస్తాయని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన నేతలను కార్యోన్ముఖులు చేస్తేనే జగన్మోహన్ రెడ్డి పోరాటానికి సరైన ఫలితం వస్తుందని అభిప్రాయపడుతున్నారు. ఇక తేల్చుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి.