ఆమె గిరిజన మహిళ. చిన్నప్పటినుంచి ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని నిలబడ్డారు. తనకిష్టమైన రంగంలో రాణిస్తున్నారు. అటువంటి ఆమె రాజకీయ చక్రబంధంలో చిక్కుకున్నారు. తాను నమ్ముకున్న రంగంలో ఇబ్బందుల్లో పడ్డారు. తనను విడిచి పెట్టాలని.. రాజకీయాలతో ముడి పెట్టవద్దని ఆమె ప్రార్థిస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరంటే సినీ నేపథ్యగాయని మంగ్లీ. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వేధింపులు తాళలేక ఆమె ప్రత్యేక ప్రకటన ఇచ్చుకోవాల్సి వచ్చింది.
ప్రతి అంశాన్ని రాజకీయాలతో ముడిపెట్టడం దారుణం. ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో జరుగుతోంది అదే. తమకు నచ్చని వాళ్ళు ఉండకూడదని.. తమకు మద్దతు ఇవ్వనివారు ఈ రంగంలో రాణించకూడదు అన్నది టిడిపి శ్రేణుల అభిప్రాయం. ఇప్పుడు సినీ నేపథ్యగాయని మంగ్లీపై అదే భావనతో ఉన్నారు. ఆమె చేసిన తప్పేంటి అంటే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పాట పాడడం. వైయస్సార్ పార్టీకి ప్రచారం చేయడం. దానిని సహించుకోలేక ఆమె ఎదుగుదలకు అడ్డంకిగా మారుతున్నారు. సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. వివాదాస్పద ముద్ర వేసి సినీ పరిశ్రమలో అవకాశాలు లేకుండా చేస్తున్నారు.
2019 ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పాట పాడారు మంగ్లీ. విశేష ఆదరణ పొందింది ఆ పాట. ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. ప్రజల మనసును చూరగొంది. జగన్మోహన్ రెడ్డి గెలుపులో ఒక భాగం అయింది ఆ పాట. అది మొదలు మంగ్లీ అంటే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేక భావం ఏర్పడింది. అప్పటినుంచి ఆమె టార్గెట్ అయ్యారు. ఈ ఎన్నికల్లో కూటమి గెలవడంతో మరింత రెచ్చిపోయారు. మొన్న ఆమధ్య రథసప్తమి వేడుకలకు శ్రీకాకుళం వెళ్లారు మంగ్లీ. ఓ ఈవెంట్ కు హాజరయ్యే క్రమంలో వెళ్లిన ఆమె అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అదే సమయంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కుటుంబ సమేతంగా వచ్చారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన మంగ్లీని దర్శనానికి తీసుకెళ్తారా అంటూ రామ్మోహన్ నాయుడు పై చిందులేసింది టిడిపి సోషల్ మీడియా. రాష్ట్రస్థాయిలో అదో ఆసక్తికర వార్తగా మారింది.
అయితే తాజాగా దీనిపై స్పందించారు గాయని మంగ్లీ. తన మనసులో ఉన్న ఆవేదనను బయటపెట్టారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని చెప్పుకొచ్చారు. కేవలం ఆ పాట పాడడంతో తన కెరీర్ను సైతం నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి మద్దతుగా పాట పాడలేదన్నారు. తాను ఎవరికీ వ్యక్తిగతంగా విమర్శలు చేయలేదన్నారు. అయితే మంగ్లీ బాధ చూస్తుంటే మాత్రం సినీ పరిశ్రమలు ఆమెకు అవకాశాలు లేకుండా చేశారని అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీకి సినీ పరిశ్రమ మద్దతు పుష్కలం. కానీ గత ఐదేళ్లలో వారి జోలికి పోలేదు జగన్మోహన్ రెడ్డి. కానీ ఇప్పుడు మాత్రం గిరిజన మహిళ విషయంలో మాత్రం తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అతిగా వ్యవహరిస్తోంది. అంతకుమించి ఆ పార్టీ అంతర్గత శక్తులు ఆమెకు అవకాశాలు దక్కకుండా చేస్తున్నాయని అర్థమవుతోంది.