Wednesday, March 19, 2025

కేంద్రంతో వైసిపి తాడోపేడో.. ఎంపీలకు జగన్ కీలక ఆదేశాలు

- Advertisement -

వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంతో తాడోపేడో తెలుసుకోవాలని పార్టీ ఎంపీలకు హితబోధ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గళం ఎత్తాలని ఆదేశించారు. ప్రధానంగా పోలవరం ఎత్తును తగ్గించే ప్రయత్నం జరుగుతోందని.. ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే అంశమని.. అందుకే గట్టిగా అడగాలని సూచించినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత బిజెపి పెద్దల ప్రాపకం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గవద్దని జగన్మోహన్ రెడ్డి తాజాగా ఎంపీలకు ఆదేశాలు ఇవ్వడం విశేషం.

ప్రస్తుతం ఎన్డీఏలో కీలక భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ ఉంది. టోటల్గా ఎన్డీఏ తరఫున 21 మంది ఎంపీలు ఉన్నారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కేవలం నలుగురే ఉన్నారు. అందుకే ఏపీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీయాలని జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇచ్చారు.

ప్రధానంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశాన్ని పదేపదే ప్రస్తావించాలని.. ప్రైవేటీకరణకు నో చెప్పాలని.. ప్రభుత్వ రంగంలో స్టీల్ ప్లాంట్ కొనసాగేలా ఒత్తిడి తేవాలని పార్టీ ఎంపీలకు ఆదేశించారు జగన్మోహన్ రెడ్డి.

నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని సైతం ప్రస్తావించారు. దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గిపోతాయని.. ఉత్తరాది రాష్ట్రాల్లో పెరుగుతాయని వస్తున్న వార్తలపై కూడా స్పందించారు. ఆ విషయంలో అన్యాయం జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టవద్దని.. కేంద్రాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరించాలని కూడా ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఏపీ వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీ ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వాటి నిర్మాణాలను సైతం ప్రారంభించారు. కానీ వాటి విషయంలో ఏపీ ప్రభుత్వం అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. దీనిపై కూడా పార్లమెంట్లో ప్రస్తావించాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం.

ఏపీలో మిర్చి రైతులకు మద్దతు ధర విషయంలో సైతం గట్టిగానే వాదనలు వినిపించాలని.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందించిన తర్వాతనే కూటమి స్పందించిన విషయాన్ని పార్లమెంట్లో ప్రస్తావించాలని ఆదేశించారు జగన్.

ఒకవేళ జమిలి ఎన్నికలు వస్తే ఆహ్వానించాలని.. కానీ ఈవీఎంలు బదులు బ్యాలెట్ వినియోగించాలని డిమాండ్ చేయాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి చేసే బాధ్యత మీదేనంటూ పార్టీ ఎంపీలకు హితబోధ చేశారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!