ఆ వైసీపీ ఎమ్మెల్యే పై కుట్ర జరుగుతోందా? పార్టీ నుంచి బయటకు పంపించేందుకు ప్రయత్నిస్తున్నారా? ఓ మాజీ మంత్రి తెరవెనుక కథ నడుపుతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. అయితే ఆయన విషయంలో ఇటీవల నెగిటివ్ ప్రచారం నడుస్తోంది.
2024 ఎన్నికలకు ముందు అనూహ్య పరిణామాలు జరిగాయి. ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా ఆదిమూలపు సురేష్ ఉండేవారు. అయితే అభ్యర్థుల మార్పులో భాగంగా ఆయనను జగన్మోహన్ రెడ్డి కొండేపి పంపించారు. అప్పటివరకు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఎర్రగొండపాలెం కు అభ్యర్థిగా తాటిపర్తి చంద్రశేఖర్ కు అవకాశం ఇచ్చారు. అయితే కూటమి ప్రభంజనంలో సైతం తాటిపర్తి చంద్రశేఖర్ గెలిచారు.
ప్రకాశం జిల్లాలో హేమహేమీలంతా ఓడిపోయారు. అటువంటి తరుణంలో ఎర్రగొండపాలెం నుంచి చంద్రశేఖర్ గెలవడం విశేషం. గెలిచిన నాటి నుంచి పార్టీ వాయిస్ గట్టిగానే వినిపిస్తున్నారు చంద్రశేఖర్. నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక అనుచర గణాన్ని ఏర్పాటు చేసుకున్నారు. క్యాడర్ కు సైతం అందుబాటులో ఉంటున్నారు. కానీ ఎందుకో ఆయనపై సోషల్ మీడియాలో నెగిటివ్ ప్రచారం నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం చేసే ప్రయత్నం జరుగుతోంది.
మొన్న ఆ మధ్యన అసెంబ్లీకి హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి. ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోయినా సంగతి తెలిసిందే. అయితే మొన్నటి బడ్జెట్ సమావేశాలు కావడంతో సెషన్స్ కు వైసిపి ఎమ్మెల్యేలతో కలిసి హాజరయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఆ సమయంలో తాటిపర్తి చంద్రశేఖర్ పార్టీ కండువా వేసుకోకపోవడంపై జగన్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ప్రచారం జరిగింది. అది మొదలు తాటిపర్తి చంద్రశేఖర్ పై అదే పనిగా సోషల్ మీడియాలో వ్యతిరేక ప్రచారం ప్రారంభం అయింది.
అయితే రాజకీయ కారణాలతో సొంత పార్టీ వారే ఈ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారని తాటిపర్తి చంద్రశేఖర్ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా మాజీమంత్రి ఆదిమూలపు సురేష్ దీని వెనుక ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. సురేష్ సుదీర్ఘకాలం ఎర్రగొండపాలెం నియోజకవర్గ నుంచి రాజకీయాలు చేశారు. కానీ ఇప్పుడు ఆ నియోజకవర్గం తాటిపర్తి చంద్రశేఖర్ చేతుల్లో ఉంది. అక్కడ ఆయన పట్టు బిగించడం ఖాయం. అందుకే ఆదిమూలపు సురేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే అదే సమయంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ బాధ్యతలు తనకు ఇవ్వకుంటే మాత్రం ఆదిమూలపు సురేష్ బయటకు వెళ్లిపోతారని ప్రచారం నడుస్తోంది. మొత్తానికి అయితే ఒక కమిట్మెంట్ ఉన్న ఎమ్మెల్యేను వదులుకుంటే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరమే.