Wednesday, March 19, 2025

వైయస్సార్ కాంగ్రెస్ లో మార్పులు.. జగన్ గూటికి ఆ నేతలు

- Advertisement -

పాత నీరు పోతే కొత్తనీరు చేరుతుంది అంటారు. ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జరగనున్నది అదే. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరు అంటే ముందుగా గుర్తుకు వచ్చే పేరు విజయసాయిరెడ్డి. అటు తరువాత సజ్జల రామకృష్ణారెడ్డి తో పాటు వైవి సుబ్బారెడ్డి పేరు వినిపిస్తుంది. ఇప్పుడిప్పుడే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా యాక్టివ్ అవుతున్నారు. అయితే వీరెవరు ప్రజాక్షేత్రంలో అనుభవం ఉన్న నాయకులు కాదు. వీళ్లకు సరైన అనుభవం కూడా లేదు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి వీరికి ప్రాధాన్యమిస్తూ వచ్చారు.. అయితే రాజశేఖర్ రెడ్డి కుమారుడిగా జగన్మోహన్ రెడ్డి పై చాలామందికి అభిమానం ఉంది. కానీ తమకంటే జూనియర్లకు పెత్తనం ఇస్తుండడంతో ఎక్కువమంది దూరంగా జరిగిపోయారు. వైసీపీలో ఉన్నవారు సైతం అధినేత వద్దకు చేరే వారు కాదు. అలాగే బయట పార్టీల్లో ఉన్న రాజశేఖర్ రెడ్డి కుటుంబ విధేయ నేతలు సైతం అటువైపుగా వచ్చేందుకు ఇష్టపడేవారు కాదు. అయితే ఈ ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్మోహన్ రెడ్డిలో స్పష్టమైన మార్పు కనిపించింది. గతంలో తన చుట్టూ చేరిన కోటరిని దూరం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి తో పనిచేసేందుకు కొత్త టీం సిద్ధంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.

వైయస్ రాజశేఖర్ రెడ్డి కి అత్యంత విధేయుడు కేవీపీ రామచంద్రరావు. వైయస్సార్ ఆత్మగా ఆయనను పేర్కొంటారు. అంతలా ఉండేది వారి మధ్య బంధం. బలమైన కుటుంబం ఉన్న రాజశేఖర్ రెడ్డి కెవిపి రామచంద్ర రావుకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. అటు కేవీపీ సైతం రాజశేఖర్ రెడ్డి కోసం మాత్రమే పనిచేసేవారు. రెడ్డి సామాజిక వర్గం నేతలు ఎంతమంది ఉన్నా రాజశేఖరరెడ్డి మాత్రం కెవిపి రామచంద్రరావుకు కీలక బాధ్యతలు అప్పగించేవారు. అదే సమయంలో రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కెవిపి మరో అధికార కేంద్రం కాలేదు. కేవలం రాజశేఖర్ రెడ్డికి విధేయుడు గానే కొనసాగారు. ఇప్పుడు అదే రాజశేఖరరెడ్డి కుమారుడికి కెవిపి దూరంగా ఉండడానికి కారణం వైసీపీలో జరుగుతున్న పరిణామాలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి లాంటి నేతలను బయటకు పంపించేయడంతో కేవీపీ రామచందర్రావు లాంటివారు ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.

ఉండవెల్లి అరుణ్ కుమార్ ఏనాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలి. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు ఆయనకు ఆలోచనలో పెట్టేసాయి. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చిన ఉండవల్లిని సరైన స్థితిలో ఎంకరేజ్ చేసేవారు. ఆయన సేవలను వినియోగించుకునేవారు. అయితే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న నేతలతో తమకు గుర్తింపు ఉండదని ఉండవల్లి భావించారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న నేతలు ఒక్కొక్కరుగా బయటకు వెళ్తున్నారు. తమలాంటి వారికి ప్రాధాన్యం దక్కుతుందని ఉండవెల్లి తాజాగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. రాజశేఖర్ రెడ్డి తో మంచి సంబంధాలు ఉండేవి. రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతోనే ఆయనకు కేంద్ర మంత్రి పదవి దక్కింది. అయితే అదే చనువుతో జగన్మోహన్ రెడ్డి వెంట నడవాలని భావించారు. కానీ అక్కడ ఉన్న పరిస్థితులు ఆయనకు ఆలోచనలో పెట్టేసాయి. రాజశేఖర్ రెడ్డి మాదిరిగా తనను జగన్మోహన్ రెడ్డి గుర్తిస్తారో లేదో అని పల్లం రాజు వెనక్కి తగ్గారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి లాంటి నేతలు బయటకు వెళ్లిపోవడంతో పల్లంరాజు వంటి వారు వైసీపీలో చేరేందుకు మార్గం సుగమం అయింది. త్వరలో ఆయన సైతం పార్టీలో చేరుతారని ప్రచారం నడుస్తోంది.

జీవి హర్ష కుమార్ అమలాపురం నుంచి ఎంపీగా గెలిచారు. రెండుసార్లు పార్లమెంట్ స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన హర్ష కుమార్ స్వతంత్రంగా వ్యవహరిస్తుంటారు. ఆయన వ్యవహార శైలిని తెలిసిన రాజశేఖర్ రెడ్డి ఎన్నడు ఆయనకు ఇబ్బంది పెట్టలేదు. అది తెలిసి హర్ష కుమార్ సైతం రాజశేఖర్ రెడ్డి విషయంలో గౌరవభావంతో మెలిగేవారు. అయితే ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి వద్ద ఉంటుందా అన్నది హర్ష కుమార్ అనుమానం. అందుకే వైసీపీలో చేరేందుకు చాలా అనుమానం పడ్డారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మునుపట్టి పరిస్థితి లేదని తెలుసుకొని ఆయన సైతం జగన్ గూటికి వెళ్లేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. మొత్తానికైతే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలతో.. జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉన్న రాజశేఖరరెడ్డి విధేయ నేతలు.. దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుండడం విశేషం.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!