Congress: అసలు మంత్రివర్గాన్ని విస్తరిస్తారా? లేదా? తెలంగాణ కాంగ్రెస్ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట ఇది. మరి రెండు నెలల్లో ఏడాది పాలన పూర్తవుతుంది. కానీ ఇంతవరకూ మంత్రివర్గ విస్తరణ చేపట్టకపోవడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గత నాలుగు నెలలుగా మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని పదే పదే పెద్ద ఎత్తున ప్రచారం జరగుతుంది తప్పా..అది వాస్తవ రూపం దాల్చడం లేదు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని చాలా మంది అనుకున్నారు. కానీ పార్లమెంట్ ఎన్నికలు ముగిసి 5 నెలలు అవుతున్నా ..మంత్రి వర్గ విస్తరణకు ముందడగు పడలేదు. నెలల కొద్ది సమయం గడుస్తున్నా మంత్రివర్గ విస్తరణలో మాత్రం ఒక స్పష్టత రావడం లేదు. రేవంత్ భయపడుతున్నారా? లేకుంటే హైకమాండ్ మొకాలడ్డు వేస్తోందా? అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.
అదిగో విస్తరణ..ఇదిగో విస్తరణ అంటూ కాలయాపన తప్పించి..చేసి చూపించలేకపోతున్నారు రేవంత్ రెడ్డి. జులైలో మంచి రోజులు లేవని శ్రావణ మాసంలో ఖచ్చితంగా మంత్రి వర్గ విస్తరణ జరగుతుందని కాంగ్రెస్ నేతలు తెగ ఊహించుకున్నారు. కానీ శ్రావణ మాసం కూడా వెళ్లిపోయి నెలరోజులు గడుస్తున్నా మంత్రి వర్గ విస్తరణ జరగలేదు. దీంతో నేతలు తెగ బాధపడిపోతున్నారు. అసలే మంత్రి వర్గ విస్తరణపై నేతలు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. ఈ సారి తమకు మంత్రి పదవి దక్కడం ఖాయం అని తమ అనచరులతో తెగ చెప్పుకుంటున్నారట. అంతే కాదు కొంత మంది ఐతే ఏకంగా అమ అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారట. తమకు మంత్రి పదవి ఖాయమైందని ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి అన్నట్లు తెగ చెప్పుకుంటున్నారట.
సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతి సారి ఇక తమకు మంత్రి పదవి ఖాయం అన్నట్లుగా నేతలు తెగ ఫీలవుతున్నారట. సీఎం ఢిల్లీ పర్యటనకు సంబంధించి వివరాలు ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారట. మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం ఏదైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా అన్న సమాచారాన్ని తెలుసుకుంటున్నారట. ఇలా రేవంత్ ఢిల్లీ వెళ్లిన ప్రతి సారి మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న నేతల పరిస్థితి ఇలానే ఉంటుందంట. కొందరు నైతలైతే ఇప్పటికే ఆ జిల్లాలో మంత్రులుగా చెలామణి అవుతున్నారట. తమకు మంత్రి పదవి వచ్చిందన్నట్లుగా ఆ నేతల తీరు ఉంటుందంట. నేతల అంగు ఆర్భాటంపై జిల్లాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందంట. ఏంటీ ఈయనకు మంత్రి పదవి ఖరారైందా అని చెవులు కొరుక్కుంటున్నారట. ఎందుకు ఆ నేతలు అంతా హడావుడి చేస్తున్నారని కాంగ్రెస్ నేతలే చర్చించుకుంటున్నారట.
ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ పేరును కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించారు. దీంతో నేతల్లో మరోసారి ఆశలు చిగురించాయి. పిసిసి అధ్యక్షుడిని ప్రకటించారంటే త్వరలో మంత్రి వర్గ విస్తరణ కూడా ఉంటుందని నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక తమకు మంత్రి పదవి ఖాయం అని కలలు కంటున్నారు. ఈ సారి దసరాలోపు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని తాజాగా కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. దీంతో నేతలు మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దపడుతున్నారు. ఒక వైపు తమకు అనుకూలంగా ఉన్న వర్గాల ద్వారా ఢిల్లీ పెద్దలతో రాయబారం నడుపుతున్నారట. మంత్రి పదవిని దక్కించుకోవడానికి ఉన్న అన్ని అవకాశాలను నేతలు పరిశీలిస్తున్నారట. ఒక వైపు సీఎం రేవంత్ రెడ్డితో టచ్ లో ఉంటూనే మరోవైపు ఢిల్లీ పెద్దలను కలిసే ప్రయత్నం చేస్తున్నారట. మంత్రివర్గంలో ఎలాగైనా ఈ సారి తమ పేరు ఉండాల్సిందే అని కొందరు సీనియర్లు పట్టుదలతో ఉన్నారట. అందుకు తగినట్లుగానే ఆ నేతలు పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారట.
మరోవైపు అసలు మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కావడానికి కారణాలు మాత్రం ఎవరికీ అంతు పట్టడం లేదు. ఎందకు కాంగ్రెస్ అధిష్టానం మంత్రి వర్గ విస్తరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదనే చర్చ కూడా గాంధీ భవన్ లో జోరుగా జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే అధిష్టానం పెద్దలతో పలు మార్లు సంప్రదింపులు జరిపారు. ఐనా మంత్రివర్గ విస్తరణ జరగకపోవడంపై కాంగ్రెస్ లో తీవ్ర చర్చ జరుగుతుంది. మంత్రివర్గ విస్తరణలో పేర్లపై అధిష్టానం ఆమోద ముద్ర వేయడం లేదా లేకుంటే అధిష్టానం చెప్పిన పేర్లకు రేవంత్ సహా సీనియర్లు ఒప్పుకోవడం లేదా అన్న చర్చ కూడా పార్టీలో ఉంది.ఈ పరిస్థితుల నేపథ్యంలనే మంత్రివర్గ విస్తరణ ఆలస్యం అవుతుందనేది కొందరి నేతల అభిప్రాయం. అయితే ఈ గందరగోళం పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన అయోమయానికి కారణమవుతోంది.