YS Jagan : వైసీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల్లో ఉండే ఆ అభిమానాన్ని ఎవరూ మార్చలేరు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గదు. ఇదే సరిగ్గా ఇటీవల మరోసారి నిరూపితమైంది. వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భరోసా కల్పించేందుకు, ఎప్పటికీ తమ పార్టీ అండగా ఉంటుందని తెలిపేందుకు జగన్ కదిలి రావడంతో మరోసారి అభిమానం ఉప్పొంగింది. గత ప్రభుత్వంలో వరదలు వచ్చినప్పుడు ఆదుకుని అండగా నిలిచిన జగన్ సాయాన్ని మరోసారి గుర్తు చేసుకుని కృతఙ్ఞతలు తెలిపారు. కృష్ణలంక ఏరియాలో రిటైనింగ్ వాల్ దగ్గర నదీ ప్రవాహాన్ని పరిశీలించి బాధిత ప్రజలతో మాట్లాడారు. జగన్ హయాంలో కట్టించిన రిటైనింగ్ వాల్ వల్లే తాము ఈ రోజు ప్రాణాలతో ఉన్నామంటూ బాధిత ప్రజలు కన్నీళ్లు పెట్టడం కలిచివేసింది. ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే వాళ్ల దగ్గరికి వెళ్లి వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకోవాలి. తమ బాధ్యతగా ప్రభుత్వాల్ని నిలదీయాలి. అవసరమైతే అండగా ఉండాలి. ఇదే ఫార్మూలా జగన్ అనుసరించారు. అధికారం ఉన్నప్పుడు ఒకలా.. లేనప్పుడు మరొకలా నటించడం జగన్‌కు చేతకాదు. గత ఐదేళ్లు రాష్ట్ర ప్రజల ముఖాల్లో ఆనందం ఉండేలా ప్రతి క్షణం పాటుపడిన జగన్.. అధికారంలో లేకపోయినా అదే పంథాలో కొనసాగారు.
జనం మెచ్చిన నేతగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత వైఎస్ జగన్‌కు ఉన్న భారీ ఫాలోయింగ్ చెప్పక్కర్లేదు. రాజకీయాలను అవసరాలకు తగ్గట్లు వాడుకోవడం తెలియదు కాబట్టే జనాల్లో జగన్ అంటే అంత అభిమానం. అవసరం వచ్చినప్పుడు ఆర్భాటంగా వ్యవహరించడం, ఫోటోలకు పోజులివ్వడం తెలియని పేదల పక్షపాతి. అందుకే జగన్ వస్తున్నారంటేనే జనం ఆటోమేటిక్‌గా తరలివస్తారు. అది తాజాగా విజయవాడ వరదల వ్యవహారంలో మరోసారి స్పష్టమైంది. కష్టాల్లో ఉండి ఎప్పుడు గట్టెక్కుతామని బిక్కుబిక్కుమంటూ నెట్టుకొచ్చిన బాధిత ప్రజలకు జగన్ ఆకస్మికంగా పర్యటించి బాగోగులు అడగడం ఒకింత ఊరట కల్పించింది. అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవడం లేదని.. తినడానికి సరైన తిండి కూడా లభించడం లేదని, ఎలాగైనా తమను ఈ గండం నుంచి గట్టెక్కించాలని బాధిత ప్రజలు స్వయంగా జగన్‌ను కోరడం చూస్తే ప్రజల్లో ఎలాంటి అభిమానం, ప్రేమ ఉందో తెలుస్తుంది.