గత ఎన్నికల్లో 151 సీట్లు సాధించి కనీవినీ ఎరుగని ఘన విజయాన్ని సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అంతకుమించిన విజయాన్ని ఆశిస్తున్నది. వై నాట్ 175 అని ముఖ్యమంత్రి జగన్ పిలుపునిస్తున్నారు. రాష్ట్రం మొత్తం స్వీప్ చేయాలనేది జగన్ పట్టుదల. ఇదే సమయంలో టీడీపీ కూడా ఏమీ తగ్గడం లేదు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తమ పార్టీకి 150 సీట్లు వస్తాయని టీడీపీ నేతలు బల్ల గుద్ది మరీ చెప్తున్నారు. అసలు ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏ పార్టీని ఎన్ని సీట్లు వస్తాయనేది చెప్పడం ఎవరి తరమూ కాదు.
కాకపోతే నియోజకవర్గాల వారీగా పరిస్థితి చూస్తే జగన్ ప్రచారం చేయకపోయినా సుమారు 50 సీట్లలో వైసీపీ ఘన విజయం సాధించనుంది. మిగతా 125 సీట్లలోనే వైసీపీ – టీడీపీ మధ్య పోటీ ఉంది. ఈ 50 సీట్లలో అసలు వైసీపీకి పోటీనే లేదు. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కచ్చితంగా ఈ 50 సీట్లు వైసీపీ ఖాతాలో పడతాయి. ఈ 50 సీట్లే రానున్న ఎన్నికల్లోనూ వైసీపీని మళ్లీ అధికారంలోకి తేవడంలో కీలకంగా మారతాయి.
ముందుగా శ్రీకాకుళం జిల్లా చూసుకుంటే నరసన్నపేట, శ్రీకాకుళం, పాలకొండ, పలాసలో వైసీపీకి పెద్దగా పోటీ లేదు. విజయనగరం జిల్లలో కురుపాం, చీపురుపల్లి, నెల్లిమర్ల నియోజకవర్గాల్లో వైసీపీకి ఎదురే లేదు. విశాఖపట్నం రూరల్‌లోని అరకు, పాడేరు నియోజకవర్గాల్లో మూడోసారి వైసీపీ ఘన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. తూర్పు గోదావరి జిల్లాలో తుని, అనపర్తి, రాజానగరం, రంపచోడవరంలో వైసీపీకి సరైన పోటీ ఇచ్చే నేతలే లేరు.
పశ్చిమ గోదావరి జిల్లాలో కొవ్వూరు, పోలవరం, గోపాలపురం, చింతలపూడిలో వైసీపీ సునాయసంగా విజయం సాదించే అవకాశం ఉంది. కృష్ణ జిల్లాలో గుడివాడ, గన్నవరం, పామర్రు, విజయవాడ ఈస్ట్, మచిలీపట్నంలో వైసీపీ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది. గుంటూరు జిల్లాలో నరసరావుపేట, మాచర్ల, చిలుకలూరిపేట నియోజకవర్గాలు ఈజీగా వైసీపీ అకౌంట్‌లో పడే ఛాన్స్ ఉంది. ప్రకాశం జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ ఓడిన పర్చూరు ఈసారి పక్కా వైసీపీ గెలిచే అవకాశం ఉంది. దర్శి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరిలోనూ వైసీపీకి భారీ మెజారిటీ దక్కవచ్చు.
నెల్లూరు జిల్లాలో సూళ్లూరుపేట, గూడురు, కొవూరు నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు ఖాయమే. కడప జిల్లాలో పులివెందుల, కడప, రాయచోటి, బద్వేల్, రైల్వే కోడూరు, జమ్మలమడుగులో వైసీపీ సునాయసంగా గెలవబోతోంది. కర్నూలు జిల్లాలో నందికొట్కూరు, పాణ్యం, డోన్, ఆళ్లగడ్డ, నంద్యాలలో వైసీపీ గెలవడం లాంఛనంగానే కనిపిస్తోంది. అనంతపురం జిల్లాలో శింగనమల, గుంతకల్, ధర్మవరం నియోజకవర్గాలు సులువుగా వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది. చిత్తూరు జిల్లాలో పుంగనూరు, తంబళ్లపల్లె, గంగాధర నెల్లూరు నియోజవకర్గాల్లో వైసీపీకి ఎదురే లేదన్నట్లుగా పరిస్థితి ఉంది.
ఈ 50 నియోజకవర్గాలు కచ్చితంగా వైసీపీవే అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఇక, పోటీ అంతా మిగతా 125 సీట్లలోనే జరుగుతుంది. ఈ సీట్లలోనూ టీడీపీ బలంగా ఉందా అంటే కాదనే చెప్పాలి. ఈ సీట్లలో కూడా దాదాపు 100కు పైగా సీట్లలో వైసీపీకే ఎడ్జ్ కనిపిస్తోంది. ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో వైసీపీ క్లీయర్‌కట్ ఎడ్జ్ ఉంది. ఇదే పరిస్థితి ఎన్నికల నాటికి కొనసాగితే వైసీపీ భారీ విజయాన్ని నమోదు చేసుకుంటుంది. ఒకవేళ పరిస్థితి పూర్తిగా మారిపోయి టీడీపీ – జనసేన కూటమికి విపరీతమైన ఆదరణ పెరిగినా ఈ 50 సీట్లతో పాటు సునాయసంగా ఇంకో 50 సీట్లు గెలిచి వైసీపీనే మళ్లీ అధికారం చేపట్టే అవకాశం ఉంటుంది.