తెలుగుదేశం పార్టీ నేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన రాజకీయం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించారు. ఈసారి తన శిష్యుడు, తెలంగాణలో తన మనిషిగా ముద్రపడిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఈ నవంబరు లేదా డిసెంబర్‌లో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబుపై గంపెడు ఆశలు పెట్టుకున్న రేవంత్ రెడ్డిని కోలుకోలేని దెబ్బ కొట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో తన ప్రయోజనాలు, తాను కేసుల బారిన పడకుండా ఉండకుండా రేవంత్ రెడ్డిని, తెలంగాణలో తనను నమ్ముకున్న వారి బలిచ్చేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు.
నాలుగేళ్లుగా బీజేపీ పెద్దలకు చంద్రబాబు విసురుతున్న వల ఇప్పటికి ఫలించింది. బీజేపీ పెద్దల అపాయింట్‌మెంట్ దొరికితే చాలు.. దేహీ అనాలని ఆయన చేసిన ప్రయత్నాలు మొన్న ఫలించాయి. ఎట్టకేలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను చంద్రబాబు నాయుడు కలిశారు. వీరి మధ్య తెలంగాణ రాజకీయాలకు సంబంధించిన చర్చలు ప్రధానంగా జరిగాయని తెలుస్తోంది. తెలంగాణలో ఈసారి కచ్చితంగా అధికారంలోకి రావాలని బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందున దక్షిణ భారత్‌లో తమ ఉనికిని కాపాడుకోవాలంటే బీజేపీ తెలంగాణలో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుకు బీజేపీ పెద్దల అపాయింట్‌మెంట్ ఖరారైనట్టు తెలుస్తోంది. తెలంగాణలో బీఆర్ఎస్‌ను ఓడించేందుకు చంద్రబాబు మద్దతు కోసం బీజేపీ ప్రయత్నిస్తుంది. అయితే, నేరుగా పొత్తు పెట్టుకుంటే మాత్రం బీజేపీకి చాలా నష్టం. చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం వల్ల బీజేపీకి నష్టమే తప్ప లాభం ఉండదు. బీజేపీకి రావల్సిన ఓట్లు కూడా దూరమవుతాయి.
కాబట్టి, చంద్రబాబుతో ప్రత్యక్షంగా పొత్తు లేకుండా పరోక్షంగా మద్దతు తీసుకునే ఆలోచనలో బీజేపీ ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పటికే చరిత్రలో కలిసిపోయింది. ఆ పార్టీకి లీడర్లు, క్యాడర్ రెండూ లేవు. అయితే, చంద్రబాబుకు అనుకూలంగా పని చేసే యెల్లో మీడియా ఉంది. అలాగే, చంద్రబాబు వెంట నడిచే ఓ సామాజకవర్గం ఉంది. హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సెటిలర్ల ఓట్లు బలంగానే ఉన్నాయి.
ఈ మూడు అంశాలు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు చంద్రబాబును బీజేపీ ఉపయోగించుకోనుంది. తాను కేసుల ఊబిలో చిక్కుకోకుండా కాపాడుకునేందుకు ఇప్పుడు చంద్రబాబుకు బీజేపీ సహకారం అవసరం. అందుకే, బీజేపీ ఏది అడిగినా కాదని అనే పరిస్థితిలో ఆయన లేరు. కచ్చితంగా తెలంగాణ ఎన్నికల్లో తన మీడియా, తన సామాజకవర్గం, తనకు మద్దతుదారులైన సెటిలర్లను బీజేపీ వైపు మళ్లించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తారు.
అయితే, చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి కూడా వీటిపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆయన కాంగ్రెస్‌లో ఉన్నా చంద్రబాబు మనిషిగానే ముద్రపడి ఉన్నారు. యెల్లో మీడియా కూడా తెలంగాణ వరకు రేవంత్ రెడ్డిలోనే చంద్రబాబును చూసుకుంటూ మద్దతు ఇస్తోంది. బాబు సామాజకవర్గం, సెటిలర్లలోని చంద్రబాబు మద్దతుదారులు కూడా రేవంత్ రెడ్డిని తమ మనిషిగా భావిస్తున్నారు. ఇవి తనకు కలిసి వస్తాయని, చంద్రబాబు మద్దతుతో తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపిస్తానని రేవంత్ రెడ్డి వెయ్యి ఆశలు పెట్టుకున్నారు. వీటన్నింటిపై చంద్రబాబు ఒక్కసారిగా నీళ్లు కుమ్మరించారు. బీజేపీకి తన బలాలను చంద్రబాబు తాకట్టు పెట్టేందుకు సిద్ధమయ్యారు. చంద్రబాబుని నమ్ముకున్న రేవంత్ రెడ్డికి ఇది వెన్నుపోటు లాంటిదే. మరి, అట్లుంటది చంద్రబాబు తోని.