జగన్‌మోహన్ రెడ్డిని టచ్ చేసే దమ్ము ఎవరికి లేదు వైఎస్ విజయమ్మ
ఏపీలో వైసీపీ అధినేత , సీఎం జగన్‌ను టచ్ చూసే దమ్ము ఎవరికైనా ఉందా అని వైఎస్ విజయమ్మ వ్యాఖ్యనించడం ఇప్పుడు రెండు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఏపీలో జగన్ బాబుకు తిరుగులేదని విజయమ్మ చెప్పుకొచ్చారు. ఆ మాటల ద్వారా జగన్‌తో మాకు ఎటువంటి విభేదాలు లేవని విజయమ్మ చెప్పకనే చెప్పినట్లు అయింది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..అన్న జగన్‌ను కాదని తెలంగాణలో వైఎస్ షర్మిల సొంతంగా వైఎస్ఆర్‌టీపీ అనే పార్టీని స్థాపించిన సంగతి అందరికి తెలిసిందే. పార్టీ బలోపేతం చేస్తూ… కేసీఆర్ ప్రభుత్వ విధానాలను ఎండగడుతూ షర్మిల తెలంగాణ రాష్ట్రం అంతటా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అయితే ఈక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తు షర్మిల చేసిన విమర్శలు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీశాయి.
టీఆర్ఎస్ శ్రేణులు షర్మిల వాహనాలకు నిప్పు పెట్టడంతో.. పరిస్థుతులు చేయి దాటి పోయాయి. వైఎస్ఆర్‌టీపీ , టీఆర్ఎస్ కార్యకర్తలు బహబహీకి దిగడంతో… పోలీసులు రంగంలోకి దిగి.. షర్మిలను అరెస్ట్ చేసి.. కోర్టుకు తరలించారు. కోర్టు షర్మిలకు బెయిల్ మంజురు చేయడంతో..ఆమె తిరిగి తన పాదయాత్రను కొనసాగించడానికి ప్రయత్నించారు. కాని షర్మిల పాదయాత్రకు పర్మిషన్ లేదని.. పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో.. లోటస్ పాండ్ లో నిరాహార దీక్ష చేస్తున్నారు. షర్మిలకు మద్దతుగా తల్లి వైఎస్ విజయమ్మ కూడా అక్కడకు చేరుకున్నారు. ఈక్రమంలో మీడియాతో మాట్లాడిన విజయమ్మ… తెలంగాణ ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తుందని విమర్శించారు. మహిళ నేతలను కూడా ఆరుగంటలకు పైగానే పోలీస్ స్టేషన్ లో ఉంచడం ఏ చట్టంలో ఉందని పోలీసులు బీఆర్ఎస్ నేతల ఏజెంట్లలా మారారని ఆమె ఆరోపించారు.
వైఎస్ఆర్‌టీపీ కార్యకర్తలను విడుదల చేయడంతో పాటు, పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చే వరకు షర్మిలమ్మ ఇక్కడే ఆమరణ దీక్షను కొనసాగిస్తారని వైఎస్ విజయమ్మ తెలిపారు. ఈ సమయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానాలు ఇచ్చారు. టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్‌గా మారి దేశం అంతటా పోటీ చేస్తామని అంటున్నారు .. దీనిపై మీరు ఏమాంటారు అని అడిగిన ప్రశ్నకు.. ముందు ఇక్కడ గెలవమనండి తరువాత దేశంలో పోటీ చేయాలా లేదా అనేది ఆలోచిద్దాం అంటూ విజయమ్మ కేసీఆర్‌కు హితవు పలికారు. బీఆర్ఎస్ ఏపీలో కూడా పోటీ చేస్తుందని అంటున్నారు అనే ప్రశ్నకు..ఏపీలో జగన్‌మోహన్ రెడ్డిని టచ్ చేసే దమ్ము ఎవరికి లేదని.. వచ్చే ఎన్నికల్లో కూడా జగనే సీఎం అని విజయమ్మ చెప్పుకొచ్చారు. ఈ మాటల ద్వారా తమ కుటుబంలో ఎటువంటి విభేదాలు లేవని.. కాని తన కొడుకు , కూతురు, రెండు రాష్ట్రాలకు ప్రతినిధ్యం వహిస్తున్నారు కాబట్టే.. తాను షర్మిలమ్మతో ఉన్నానని వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు.