తెలుగుదేశం పార్టీ అధినేత తీసుకున్న ఓ నిర్ణయం ఆయనకే తలనొప్పి తెచ్చి పెడుతోంది. ఏదో చేద్దాం అనుకుంటుంటే ఇంకేదో అయ్యేలా కనిపిస్తోంది. సీనియర్ నేతల నుంచి బాబుకు సమస్యలు వచ్చి పడుతున్నాయి. అనంతపురం జిల్లాలో తీసుకున్న ఓ నిర్ణయం విశాఖపట్నం జిల్లాలో సమస్యకు కారణమైంది. అనంతపురం జిల్లాలో ధర్మవరం నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి కొరత ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడ పోటీ చేసిన వరదాపురం సూరి ఎన్నికల్లో ఓడిన తర్వాత టీడీపీకి గుడ్‌బై చెప్పి బీజేపీలో చేరారు.
దీంతో ధర్మవరం నుంచి ఎవరిని నిలబెట్టాలో చంద్రబాబు చాలా రోజులు తేల్చుకోలేకపోయారు. దీంతో చివరకు పరిటాల కుటుంబం నుంచి పరిటాల శ్రీరామ్‌ను బరిలో దింపాలని నిర్ణయించారు. నిజానికి గత ఎన్నికల్లో ఒక కుటుంబానికి ఒకే టిక్కెట్ ఫార్ములాను చంద్రబాబు అవలంభించారు. అందుకే, పరిటాల కుటుంబం స్వంత నియోజకవర్గమైన రాప్తాడులో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న పరిటాల సునితను తప్పించి మరీ శ్రీరామ్‌తో పోటీ చేయించారు. శ్రీరామ్ అక్కడ ఓడిపోయారు. అయితే, ఈ ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గానికి అభ్యర్థి లేకపోవడంతో తన ఒక ఫ్యామిలీకి ఒకే టిక్కెట్ ఫార్ములాను చంద్రబాబు పక్కన పెట్టేశారు.
రాప్తాడు నుంచి పరిటాల సునితను మళ్లీ పోటీ చేయించాలని నిర్ణయించారు. ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్‌ను అభ్యర్థిగా ఖరారు చేశారు. ధర్మవరం పరిటాల కుటుంబానికి పాత నియోజకవర్గం కావడంతో కొంత క్యాడర్ ఉంది. శ్రీరామ్ తప్ప ఇక్కడ టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ఎవరూ లేరు. దీంతో తప్పని పరిస్థితుల్లో శ్రీరామ్‌కు ధర్మవరం బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు ఇదే నిర్ణయం కొందరు టీడీపీ సీనియర్ నేతల అసంతృప్తికి కారణమవుతోంది.
పరిటాల కుటుంబానికి రెండు టిక్కెట్లు ఇస్తున్నందున తమ కుటుంబానికి కూడా రెండు టిక్కెట్లు అడుగుతున్నారు పలువురు నేతలు. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో టీడీపీకి కీలక నేతలుగా ఉన్న మాజీ మంత్రులు అయ్యన్నపాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి ఇద్దరు వారి కుటుంబాల్లో వారసులకు కూడా టిక్కెట్లు అడుగుతున్నారు. పరిటాల కుటుంబానికి వర్తించని వన్ ఫ్యామిలీ – వన్ సీట్ ఫార్ములా తమ కుటుంబానికి ఎందుకు వర్తిస్తుందని వారు ప్రశ్నించబోతున్నారు.
అయ్యన్నపాత్రుడు స్వంత నియోజకవర్గం నర్సీపట్నం. ఇక్కడ తాను పోటీ చేసి తన కుమారుడు, ఐటీడీపీలో కీలక వ్యక్తిగా ఉన్న చింతకాయల విజయ్‌కు మాడుగుల సీటు ఇవ్వాలని అయ్యన్నపాత్రుడు అడుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇదే సీటుపై బండారు సత్యనారాయణమూర్తి కూడా కన్నేశారు. ఆయనకు పెందుర్తి సీటుతో పాటు ఆయన కుమారుడు అప్పలనాయుడుకు మాడుగుల సీటు ఇవ్వాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఒకే సీటుపై ఇప్పుడు ఇద్దరు సీనియర్ నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు.
మరోవైపు ఇప్పటికే ఇక్కడ టీడీపీ నుంచి గవిరెడ్డి రామానాయుడు కీలక నేతగా ఉన్నారు. ఆయన 2009లో ఎమ్మెల్యేగా ఇక్కడి నుంచి గెలిచారు. 2014, 2019లో వైసీపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడు చేతిలో ఓడిపోయారు. ఇప్పుడు మరోసారి పోటీ చేసేందుకు రామానాయుడు సిద్ధంగా ఉన్నారు. ఈ సమయంలో సీనియర్ నేతలు వారి వారసులకు మాడుగుల సీటు అడుగుతుండటం చంద్రబాబుకు తలనొప్పిగా తయారైంది. అనవసరంగా పరిటాల కుటుంబానికి రెండు టిక్కెట్లు ప్రకటించి తలనొప్పులు చంద్రబాబు తలనొప్పులు తెచ్చుకునారని తెలుగు తమ్ముళ్లే గుసగుసలాడుకుంటున్నారు. వీరు మాత్రమే కాదు మరో నలుగురైదుగురు నేతలు కూడా తమతో పాటు తమ వారసులకు కూడా టిక్కెట్లు కావాలని అడుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పరిటాల కుటుంబం చంద్రబాబుకు కొత్త పరేషాన్ తెచ్చి పెట్టింది.