టీడీపీ కంచుకోటలలో హిందుపురం నియోజకవర్గం కూడా ఒకటి అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. హిందుపురం నియోజకవర్గం ఏర్పడిన దగ్గర నుంచి కూడా అక్కడ టీడీపీ తప్ప మరొ పార్టీ గెలవలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ వ్యవస్థపకుడు ఎన్టీఆర్ గుడివాడలో ఓడిపోయిన తరువాత హిందుపురం వెళ్లి అక్కడ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎన్టీఆర్ తరువాత ఆయన పెద్ద కుమారుడు హరికృష్ణ సైతం హిందుపురం నుంచే పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వీరిద్దరు తరువాత మరో నందమూరి వారసుడు అయిన బాలకృష్ణ కూడా తన రాజకీయ ఎంట్రీ హిందుపురం నుంచే మొదలుపెట్టారు. ఆయన 2014,2019 వరుస ఎన్నికలలో హిందుపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు.
2024లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు బాలకృష్ణ. కాని హిందుపురంలో మూడోసారి విజయం సాధించడం చాలా కష్టమనే తెలుస్తోంది. తొలిసారి టీడీపీకి వ్యతిరేకంగా అక్కడ ప్రజలు ఉన్నారని సమాచారం అందుతుంది. హిందుపురం ఎమ్మెల్యేగా బాలకృష్ణ నియోజకవర్గానికి ఏం చేయలేదని అక్కడ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. దీనితో పాటు సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితి హిందుపురంలో నెలకొంది. బాలకృష్ణ నియోజకవర్గానికి చుట్టపు చూపు వచ్చినట్లుగా వెళ్తున్నారు. దీంతో ఎక్కడ సమస్యలు అక్కడ ఉండిపోయాయి. దీనికి తోడు బాలకృష్ణ పీఏ అక్కడ దందాలకు పాల్పడటం కూడా టీడీపీకి మైనస్‌గా మారిందని తెలుస్తోంది. దీనిపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినప్పటికి కూడా ఎవరు పట్టించుకోవడం లేదని బాధితులు చెబుతున్నారు.
తాజాగా పరిస్థుతులను చూస్తుంటే ..హిందూపురం నియోజకవర్గంలో సమీకరణాలు మారాయి. ఈ నేపథ్యంలో హిందూపురం నియోజకవర్గంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పెషల్ ఫోకస్ పెట్టారు.అక్కడ వైసీపీ బలంగా ఉన్నప్పటికి కూడా పార్టీలోని గ్రూపు తగదాల వల్లే హిందుపురంలో పార్టీ వెనుకపడుతుందని జగన్ అంచనాకు వచ్చారు.ఈ క్రమంలోనే అతి త్వరలో హిందూపురం వైసీపీ విషయమై అధినాయకత్వం ఓ ప్రత్యేక సమావేశాన్ని స్థానిక నాయకత్వంతో ఏర్పాటు చేయబోతోందట. త్వరలో హిందూపురంలో జగన్ సైతం పర్యటించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. వైసీపీలో స్థానిక గొడవలు చల్లార్చగలిగితే మాత్రం జగన్‌కు, హిందూపురంలో వైసీపీని గెలిపించడం పెద్ద కష్టమేమీ కాదు.