Tirupati laddu: తిరుపతి లడ్డు కల్తీ విషయం చినికి చినికి గాలివానగా మారింది. ఈ కల్తీపై విచారణ జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘సిట్’ వేసింది. విచారణ జరిపించాలని దేశ ప్రధానికి జగన్ మోహన్ రెడ్డి ఉత్తరం రాశారు. ముఖ్యమంత్రి ఆరోపణలపై బిజెపి మాజీ ఎంపీ సుబ్రమణ్య స్వామి, టిటిడి మాజీ ఛైర్మన్ వై.వి. సుబ్బారెడ్డి లతో సహా అనేకమంది విడివిడిగా సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఈలోపు పాలక, ప్రతిపక్ష పార్టీల పరస్పర విమర్శలు, ప్రమాణాల సవాళ్ళు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష, వైసీపీ కేంద్ర కార్యాలయంపై బిజెపి అనుబంధ యువజన సంఘం కార్యకర్తల దాడి ఒకదాని తర్వాత ఒకటి శరవేగంగా జరిగిపోతున్నాయి. కల్తీ జరిగిన లడ్డూ తిన్నామా ఇన్ని రోజులు అని తిరుమల భక్తులు తీవ్ర ఆందోళనకు, ఆవేదనకు గురవుతున్నారు. లడ్డులో కల్తీ జరిగివుంటే కచ్చితంగా చర్యలు తీసుకోవాలి, దోషులపై కేసులు పెట్టాలి, కఠిన శిక్షలు విధించాలి కానీ పాలకులు ఇతర మతాలను రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ మత సామరస్యంను దెబ్బ తీస్తున్నారు.
జులై 23న వచ్చిన నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు రిపోర్టును సుమారు రెండు నెలలు ఎందుకు దాచిపెట్టారని ప్రజలకి నిజం తెలియజేయాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి లేదా అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. లడ్డుతో పాటు టిటిడిలో జరుగుతున్న అనేక అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి. టిటిడిలో అనేక అక్రమాలు జరుగుతుంటే ఆ బోర్డులో సభ్యులుగా వున్న బిజెపి నాయకులు ఏం చేస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం దేశంలోనే అత్యంత ధనిక దేవాలయాల్లో ఒకటి. ప్రతి సంవత్సరం ఐదు వేల కోట్ల బడ్జెట్, 18 వేల కోట్ల డిపాజిట్లు, వెయ్యి కిలోల బంగారం కలిగివుంది. ఇక్కడికి వచ్చిన భక్తులు లడ్డు తీసుకోకుండా తిరిగి వెళ్లడమనేది ఉండదు. అందుకే తిరుమలలో ప్రతిరోజు సగటున 15 వేల కిలోల నెయ్యితో సుమారు మూడున్నర లక్షల లడ్లు తయారు చేస్తుంటారు. సరుకుల నాణ్యతను పరీక్షించడానికి టిటిడి చాలా సంవత్సరాల క్రితమే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. ఏడు ఎనిమిది దశల్లో తనిఖీలు చేస్తారు.
తమిళనాడుకు చెందిన ఎ.ఆర్ డెయిరీ ఫుడ్స్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ జులై 6న, జులై 12న నాలుగు ట్యాంకర్ల నెయ్యిని తిరుమలకు పంపింది. ఈ నెయ్యే ఇప్పటి వివాదానికి కేంద్రంగా ఉంది. ఎ.ఆర్ డెయిరీ ఫుడ్స్ సరఫరా చేసిన నెయ్యి నుండి నాలుగు నమూనాలు గుజరాత్ లోని నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డుకు చెందిన సి.ఎ.ఎల్.ఎఫ్ కు పంపారు. అనేక ల్యాబ్‌లు అందుబాటులో ఉండగా, ఎప్పుడూ పంపని ఈ గుజరాత్ ల్యాబ్‌కు శ్యాంపిళ్లు ఎందుకు పంపారనే అనుమానాలు ఉన్నాయి. గుజరాత్ ల్యాబ్ పరీక్షించి ఈ నెయ్యి వెజిటబుల్ ఆయిల్, జంతువుల కొవ్వు, చేప నూనె, ఇతర పదార్థాల వల్ల కల్తీ అయినట్లు ఎన్.డి.డి.బి రిపోర్టు ఇచ్చారని తెలుగుదేశం నాయకులు, ఆ తర్వాత టిటిడి ఈవో సెప్టెంబర్ 20న, ఆ వెంటనే ముఖ్యమంత్రి చెప్పడంతో దేశమంతటా సంచలనమైంది. కేంద్ర హోంమంత్రి సిఫారసుతో ఏడు సంవత్సరాలుగా టిటిడి బోర్డు మెంబర్‌గా వున్న ప్రముఖునికి తెలియకుండా ఏదీ కొనుగోలు కాదన్నది జగమెరిగిన సత్యమని ప్రఖ్యాత ది హిందూ పత్రిక ప్రచురించింది. బీజేపీ తెలియకుండా ఏమీ జరగలేదని అంటే కూటమి ప్రభుత్వానికి కూడా అంతా తెలుసని వారు ప్రచురించారు.