Subrahmanyam Swamy: తిరుమల లడ్డు వివాదం మరింత ముదురుతోంది. ఈ లడ్డు కల్తీ వ్యవహారంలో ఒక వైపు సిట్ దూకుడు పెంచగా, మరో వైపు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు అవుతున్నాయి. లడ్డు కేసులో నిజానిజాలు బయటకు తీయాలని డిమాండ్ పెరుగుతోంది. అటు అధికార పార్టీ కుటమి ప్రభుత్వం మరియు ఇటు వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధాలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే నేడు సుప్రీం కోర్టులో తిరుమల లడ్డు వివాదం కేసు విచారణకు రానుంది. దీనిపై జస్టిస్ బి.ఆర్ గవాయి, కె.వి విశ్వనాథన్ ధర్మాసనం విచారణ జరపనుంది. కోర్టు నంబర్ 3 లో ఐటం నెంబర్ 63గా తిరుమల లడ్డు కేసు నమోదైంది. తిరుమల లడ్డు ప్రసాద కల్తీ వివాదంలో నిజా నిజాలు నిగ్గు తేల్చేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో కమిటీ ఏర్పాటు చేయాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి.
ప్రసాద కల్తీపై చంద్రబాబు వ్యాఖ్యలపై వాస్తవాలు తేల్చేందుకు సుప్రీం కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి పిటిషన్ వేశారు. అంతేకాదు ఈ లడ్డు ప్రసాద కల్తీపై రచయిత విక్రమ్ సంపత్ సహా పలువురు కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. దాఖలు చేసిన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం నేడు విచారణ జరపనుంది. వైఎస్ఆర్సీపీ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మరియు బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి వేసిన రెండు పిటీషన్లను సుప్రీమ్ కోర్ట్ ఇవాళ ఒకేసారి విచారించనున్నది. హైదరాబాద్ లాంటి దగ్గర ఉన్న ల్యాబ్ లకి కాకుండా ఎక్కడో గుజరాత్ లో ఉన్న ల్యాబ్ కే ఎందుకు పంపించారు టెస్టింగ్ కోసం? వచ్చిన రిపోర్టుని రెండు నెలల తరువాత ప్రపంచానికి చెప్పడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి అని వారు పిటీషన్ లో పేర్కొన్నారు. సర్వోన్నత న్యాయస్థాన పర్యవేక్షణలో ఉండే కమిటీని నియమించేందుకు ‘రిట్ ఆఫ్ మాండమస్’ లేకపోతే అవసరమైన ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్‌లో సుప్రీం కోర్టుకు సుబ్రహ్మణ్య స్వామి విజ్ఞప్తి చేశారు. ఇది ప్రజారోగ్యంతో పాటు వేంకటేశ్వర స్వామి వారికి సమర్పించే నైవేద్యాలకు సంబంధి౦చిన అంశమని చెప్పారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ప్రకారం ప్రజా ప్రయోజనాలను సమర్థిస్తూ ఈ విషయంలో న్యాయం జరిగేలా చూసేందుకు కోర్టు జోక్యం చేసుకోవాలని వారు పిటిషన్ కోరారు.
లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యి మూలం, నాణ్యతతో సహా ల్యాబ్ పరీక్షలపై దృష్టి సారించి సంబంధిత అధికారుల నుంచి వివరణాత్మక ఫోరెన్సిక్ నివేదిక పొందేందుకు మధ్యంతర ఆదేశాలు జారీ చేయాలని బీజేపీ నేత కోరారు. లడ్డూ వ్యవహారంలో చంద్రబాబు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని అవి భక్తులను గందరగోళానికి గురి చేస్తున్నాయన్నారు. సమగ్ర విచారణ కోసం కమిటీ వేయాలని నిజానిజాలు బయటకు రావాలనే ఉద్దేశంతో అత్యున్నత న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చానన్నారు. ఈరోజు విచారంలో NDDB అక్రమాలు మరియు చంద్రబాబు చేసిన ఆరోపణలు బయట పడనున్నాయని ప్రతిపక్షాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.