Chandrababu: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిసినంతగా కక్షపూరిత రాజకీయాలు మరెవరికీ తెలియదేమో. తాజాగా దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదంలో చంద్రబాబు వైఖరే ఇందుకు ఉదాహరణ. రాజకీయ లబ్ధి కోసం వివాదం చేయడం, ఆపై వైసీపీని దిగజార్చేలా వ్యాఖ్యలు చేయడం.. ఈ క్రమంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటన రద్దు లాంటి పరిణామాలు చూస్తుంటే దీని వెనక టీడీపీ కూటమి ప్రభుత్వ కుట్ర దాగుందని స్పష్టమవుతూనే ఉంది. పర్యటన రద్దు అనంతరం నిన్న తాడేపల్లిలో ప్రెస్‌మీట్ పెట్టి వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబు చేస్తున్న విష రాజకీయాలను ఎండగట్టారు. సెప్టెంబర్ 18న సీఎం చంద్రబాబు తిరుమల లడ్డూలో‘యానిమల్ ఫ్యాట్ కలిసిందంటూ వివాదానికి తెరలేపిన విషయాన్ని వీడియో రూపంలో జగన్ ప్రస్తావించారు. సెప్టెంబర్ 22న తిరుమలకు నాలుగు నెయ్యి ట్యాంకర్లు వచ్చాయని, దానిని వాడారని చంద్రబాబు చెప్పడాన్ని జగన్ తీవ్రంగా తప్పుబట్టారు. ఆ ట్యాంకర్లను వాడలేదని స్వయానా ఈవో చెబుతుంటే.. సీఎం హోదాలో ఉన్న చంద్రబాబు దుష్ప్రచారాలు చేయడాన్ని వీడియో చూపించి మీడియా ముఖంగా నిరూపించారు జగన్.
తాను చేసిన తప్పుడు ఆరోపణలు ఎక్కడ బయటపడతాయేమో అనే భయంతో కేసును సీబీఐ వరకూ వెళ్లనివ్వకుండా సొంత అధికారులతో ఏర్పాటు చేసిన సిట్‌కి అప్పగించడం కూడా ఇందులో ఒక డ్రామానే. మరి ఏఆర్ డెయిరీ సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని గుర్తిస్తే చర్యలు తీసుకోవాలి కదా? ఎందుకు తీసుకోలేదు? కల్తీ జరిగిందని గుర్తించక వాటిని వాడేశామని టీటీడీ అధికారులు స్పష్టం చేస్తున్నప్పటికీ ఎందుకు చర్యలకు ప్రభుత్వం వెనకడుగు వేస్తోంది? గత వైసీపీ హయాంలో మాత్రం అవకతవకలు జరిగాయని ప్రూఫ్ లేకుండా ఆరోపించడం, పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసం? ప్రజల్లో వైసీపీపై ఉన్న అభిమానాన్ని చెరపలేక దిక్కుమాలిన రిపోర్టులు తయారుచేస్తూ ప్రజలను మోసం చేయాలని టీడీపీ కూటమి చూస్తోంది. అసలు కల్తీ అనేది జరిగి ఉంటే ఆ వాసనను కూడా భరించడం కష్టం. ఇంతకన్నా మంచి ఉదాహరణ ఇంకేముంటుంది? ఏది ఏమైనా తిమ్మిని బమ్మిని చేయడంలో, లేనిది ఉన్నట్లుగా కల్పించి రాజకీయం చేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని వైఎస్సార్సీపీ తీవ్ర విమర్శలు చేస్తోంది.