YS Jagan: 2023–24 దేశ ఆర్థిక వ్యవస్థ గణాంకాలతో గత పదేళ్లలో వివిధ రాష్ట్రాల్లో తలసరి ఆదాయం పెరుగుదల వివరాలను ఆర్‌బీఐ తాజాగా హ్యాండ్ బుక్‌లో వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం ఇందుకు సంబంధించిన వివరాలతో ఓ కీలక ప్రకటన విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల జగన్ పాలనలో తలసరి ఆదాయం భారీగా పెరిగినట్లు రుజువులతో కూడిన సమాచారం అందించింది. ఈ లెక్కన చూసుకుంటే మునుపు చంద్రబాబు పాలనలో కన్నా వైఎస్ జగన్ పాలనలోనే రాష్ట్ర తలసరి ఆదాయం ఎక్కువగా పెరిగినట్లు ఆర్‌బీఐ స్ఫష్టం చేసింది. కాగా.. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొన్నా రాష్ట్రాన్ని తనదైన శైలి సుపరిపాలనతో ముందుకు నడిపించిన ఘనత ఖచ్చితంగా వైఎస్ జగన్‌దే అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రాన్ని కరోనా పట్టి పీడించినా విపత్కర పరిస్థితుల్లో సైతం ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రవేశపెట్టిన నవరత్నాల పథకాల అమలుతో ప్రజలకు అండగా నిలిచి రాష్ట్ర ఆదాయం పెరగడానికి నాటి వైసీపీ ప్రభుత్వం విశేష కృషి చేసింది.
అయితే.. ఇందుకు సంబంధించిన గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే.. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నారా చంద్రబాబు నాయుడు పరిపాలించారు. ఆ కాలంలో రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 60,128 మాత్రమే పెరిగింది. ఆ తర్వాత 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన అనంతరం 2023–24 ఆర్థిక సంవత్సరం వరకు తలసరి ఆదాయం ఏకంగా రూ. 88,448 పెరిగిందని ఆర్‌బీఐ గణాంకాలు స్ఫష్టం చేస్తున్నాయి. ఇంతే కాకుండా జగన్ పాలన కాలంలో ఏటా జాతీయ సగటు తలసరి ఆదాయాన్ని మించి రాష్ట్ర తలసరి ఆదాయంలో పెరుగుదల నమోదవడం ఇక్కడ గమనార్హం. కరోనా విపత్కర పరిస్థితుల్లో వ్యవసాయంతో పాటు చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, వాణిజ్య కార్యకలాపాలు నిలిచిపోకుండా జగన్ సర్కారు పటిష్టమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఆయా రంగాల్లో ఆర్థిక కార్యకలాపాలు సజావుగా సాగేందుకు సైతం వైసీపీ ప్రభుత్వం అండగా నిలిచింది