YS Jagan: వైఎస్సార్సీపీని మళ్లీ రాజకీయంగా బలోపేతం చేయడానికి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడానికి, వచ్చే ఎన్నికల్లో మళ్లీ విజయ దుందుభి మోగించడానికి వైసీపీ కార్యాచరణలు మొదలుపెట్టింది. ఈ మేరకు పార్టీలో సంస్థాగత మార్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు పదవుల భర్తీలో భాగంగా కీలక నియామకాలు జరిగాయి. వైసీపీని గ్రామ స్థాయి నుంచే బలపరచడానికి కొన్ని జిల్లాలకు పార్టీ అధ్యక్షులను కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజా రాజకీయ పరిణామాలను చర్చించడంతో పాటు జిల్లాల అధ్యక్షుల ఎంపిక కోసం అధినేత వైఎస్ జగన్ వరుస భేటీల నిర్వహణలో బిజీగా ఉంటున్నారు.
నేడు కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల నేతలతో తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ భేటీ అయ్యారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు కూడా వచ్చే పరిమాణాలు ఏర్పడుతుండడంతో దీనిపై కూడా ఈ సమావేశంలో జగన్ అధికారులకు కీలక బాధ్యతలు ఇవ్వనున్నట్లు సమాచారం. వైసీపీని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలనే అంశంపై సుదీర్ఘ చర్చ సాగే అవకాశం ఉంది. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం లోపు పలు జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తూ పేర్లు ప్రకటించే అవకాశం ఉంది.