ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే విశాఖపట్నం నుంచి పరిపాలన సాగించనున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన విదేశీ ప్రతినిధుల సమావేశంలో స్వయంగా జగనే ఈ విషయాన్ని ప్రకటించారు. త్వరలోనే తాను విశాఖకు వెళ్తున్నట్లు ఆయన ప్రకటించేశారు. పలువురు మంత్రులు కూడా ఇదే రకమైన కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు, జగన్ విశాఖకు రావడానికి అన్ని ఏర్పాట్లూ పూర్తవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. మార్చి చివరి వారం నాటికి ఆయన విశాఖపట్నానికి మారడం దాదాపు ఖాయమైందని తెలుస్తోంది.
ఇప్పటికే అధికారులు ముఖ్యమంత్రి జగన్ నివాసానికి అనువైన భవనాన్ని వెతికారని తెలుస్తోంది. దాదాపుగా బీచ్ రోడ్డుకు దగ్గర్లో జగన్ కొత్త నివాసం ఉండబోతున్నదని ప్రాథమికంగా అందుతున్న సమాచారం. మార్చి 22 లేదా 23న జగన్ ఈ ఇంట్లోకి గృహప్రవేశం చేస్తారని తెలుస్తోంది. ఇందుకు తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారని సమాచారం. విశాఖలోని ఎంవీపీ న్యాయ విద్యా పరిషత్ సమీపంలో జగన్ నివాసం ఉండనుందని, అందుకే ఇక్కడ రోడ్డు విస్తరణ కూడా చేపడుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
కేవలం జగన్ మాత్రమే కాదు మంత్రులు, వివిధ శాఖల్లో కీలకంగా ఉన్న ఐఏఎస్ అధికారులు సైతం విశాఖపట్నంలో స్థిరపడటానికి సిద్ధమవుతున్నారని తెలుస్తున్నది. మంత్రులు, ఐఏఎస్ అధికారులు సైతం తమకు అనువుగా ఉండేలా ఇళ్లు వెతుకుతున్నారని, ఇప్పటికే కొందరు ఇళ్లు అద్దెకు తీసుకున్నారని తెలుస్తోంది. వీరు కూడా దాదాపుగా మార్చి లేదా ఏప్రిల్ మొదటి వారంలో విశాఖపట్నంకు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
విశాఖపట్నాన్ని రాజధానిగా చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గట్టి సంకల్పంతో ఉన్నారు. విశాఖ నగరం ఇప్పటికే మెట్రో నగరంగా ఉంది. దేశంలోని టాప్ 10 నగరాల్లో విశాఖపట్నం ఒకటి. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు విశాఖపట్నంలో స్థిరపడటంతో ఈ నగరంలో కాస్మోపాలిటన్ కల్చర్ ఉంటుంది. ఇప్పటికే పారిశ్రామికంగా, ఐటీ పరంతో అభివృద్ది చెందింది. బీచ్, పోర్ట్ విశాఖకు అదనపు బలం. ఇన్ని సానుకూలాంశాలు ఉన్న విశాఖపట్నాన్ని రాజధానిని చేస్తే కచ్చితంగా కొన్నేళ్లలోనే అది హైదరాబాద్, బెంగళూరు, చెన్నైకు పోటీ పడేలా తయారవుతుందని సీఎం జగన్ నమ్మకంగా ఉన్నారు.
త్వరలోనే విశాఖపట్నంలో ఇన్‌వెస్ట్‌మెంట్ సమ్మిట్ కూడా జరగబోతున్నది. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌కు వేసిన మొదటి వందే భారత్ రైలును కూడా విశాఖపట్నానికే వేశారు. ఇవన్నీ కూడా విశాఖపట్నం రాజధాని కాబోతోందనే వాదనను సమర్థించేలా ఉన్నాయి. నిజానికి ఇలాంటి సమ్మిట్‌లు చేయడానికి ఏపీలో అనువైన ప్రాంతం విశాఖపట్నమే. ఈ విషయం తెలుగుదేశం పార్టీకి కూడా తెలుసు. గతంలో టీడీపీ హయాంలోనూ విశాఖలోనే ఇలాంటి కార్యక్రమాలు జరిగాయి.
కానీ, తమ ప్రయోజనాలు కాపాడుకునేందుకు విశాఖపట్నాన్ని తక్కువ చేసి అమరావతిని రాజధానిని ఉంచాలని తెలుగుదేశం పార్టీ వాధిస్తోంది. త్వరలోనే రాజధాని విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా రాబోతోంది. తీర్పు ఎలా ఉండబోతోంది అనే అంశంపైనే విశాఖపట్నంతో పాటు రాష్ట్ర భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా జగన్ మాత్రం విశాఖకు రాజధానిని తీసుకెళ్లడానికి పట్టుదలగా ఉన్నారనేది స్పష్టమవుతున్నది. అందుకే, ఆయన నివాసాన్ని కూడా చూసుకున్నట్లు కనిపిస్తున్నది.