బొత్స సత్యనారాయణ.. తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. అనుచరులు ముద్దుగా సత్తిబాబు అని పిలుచుకుంటారు.. మీడియా, పొలిటికల్ సర్కిల్స్‌లో బొత్సా అంటుంటారు..
వినోదం పంచుతూ విశ్లేషణ చేస్తుండే ఆయన శైలికి, చిలిపిగా సున్నితంగా విమర్శించే ఆయన భాషకి పార్టీలకు అతీతంగా ఫ్యాన్స్ బోలెడు మంది..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో బీసీ సామాజికవర్గం నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాద్యతలు చేపట్టడం మామూలు విషయం కాదు. అది కూడా వెనుకబడిన ఉత్తరాంధ్ర నుంచి కావడం మరీ ప్రత్యేకం..
ఎవర్నయినా పేరు పెట్టి పిలవగల చనువు ఆయనకే సొంతం. బలమైన శరీర సౌష్టవం, ఆకట్టుకునే ఆహార్యంతో ఎవర్నయినా ఇట్టే ఆకర్షించగల రూపు బొత్స సత్యనారాయణ గారిది. ఎంత బిజీ రాజకీయాల్లోనూ కుటుంబానికి ఆయన ఇచ్చే ప్రాధాన్యం, ప్రోత్సాహం ఇంకొకరు ఇవ్వలేరు. అందుకే ఆయన బలం ఆయన కుటుంబం అని చెప్పకతప్పదు. నేదురుమల్లి శిష్యుడిగా రాజకీయ ప్రవేశం చేసినా తర్వాత కాలంలో దివంగత వైఎస్సార్ కి అత్యంత ఆప్తుడిగా మారారు. ఇప్పుడు వైఎస్సార్సీపీలో సీఎం వైఎస్ జగన్ కి కూడా అంతే ఆప్తుడిగా ఉండటం చూస్తే ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ఆయన స్నేహపూర్వక వ్యవహారశైలే ఆయనకు పదవులు తెచ్చిపెడుతూ ఉంటుంది..
ఆనాడు దివంగత వైఎస్సార్, నేడు ఆయన తనయుడు వైఎస్ జగన్ లు ఆయన మీదున్న నమ్మకంతో విజయనగరం జిల్లా బాధ్యతను ఆయనకు అప్పగించారు. వారి అంచనాలను నిలబెడుతూ మొన్న 2019 ఎన్నికల్లో జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసి సత్తా చాటారు.. ఎంత పెద్ద పదవిలో కొనసాగుతున్నా నిబద్ధత గల కార్యకర్తగా పార్టీకి విధేయుడిగా ఉండటం ఆయనకు తెలిసిన రాజకీయం.. అవసరం కోసం వచ్చిన కార్యకర్తలకు అండగా నిలబడి ఆదుకోవడం ఆయన శైలి..
బొత్స సత్యనారాయణ విజయనగరంలో బొత్స గురునాయుడు ఈశ్వరమ్మ దంపతులకు 1958లో జన్మించారు. ఈయన మహారాజా కళాశాలలో బీఏ డిగ్రీ పూర్తి చేశాడు. 1985లో బొత్స ఝాన్సీ లక్ష్మి గారితో ఆయన వివాహం జరిగింది. ఝాన్సీ లక్ష్మి గారు బొబ్బిలి నుండి 2006 లో, విజయనగరం నుండి 2009 లో కాంగ్రెస్ తరపున ఎంపీగా విజయం సాధించారు. సత్యనారాయణ సోదరుడు బొత్స అప్పల నరసయ్య వైఎస్ఆర్సీపీ నాయకుడు.
బొత్స సత్యనారాయణ 1999లో బొబ్బిలి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా విజయం సాధించారు. నాటి వాజ్‌పేయి హవాలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ నుండి కేవలం ఐదుగురు ఎంపీలుగా విజయం సాదించగా అందులో బొత్స ఒకరు. 2004, 2009 లలో చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు. వైఎస్సార్ ప్రభుత్వంలో భారీ పరిశ్రమల శాఖ, పంచాయతీ రాజ్ గృహ నిర్మాణ శాఖ, రవాణా, మార్కెటింగ్ శాఖలకు మంత్రిగా పని చేశారు. వైఎస్సార్ మరణం తర్వాత ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు.
రోశయ్య తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆ సమయంలో బొత్స పేరు కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారంలోకి వచ్చింది.
2015 లో, బొత్స ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి బొత్స తన కుటుంబం, మద్దతుదారులతో కలిసి వైయస్ఆర్ కాంగ్రెస్ లో చేరారు. 2019 చీపురుపల్లి నియోజకవర్గం నుండి మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పురపాలక శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.
బొత్స సోదరుడు అప్పల నరసయ్య రెండోసారి గజపతినగరం నియోజకవర్గం నుంచి వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.