Monday, February 10, 2025

పులివెందులకు ఉప ఎన్నిక.. వైసిపి కోరుతోంది అదే!

- Advertisement -

పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందా? జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవి పై వేటు వేయడం ఖాయమా? ఆ దిశగా కూటమి ప్రయత్నాలు మొదలు పెట్టిందా? పొలిటికల్ వర్గాల్లో ఇదే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు ఇదే విషయాన్ని చెప్పుకొచ్చారు. శాసనసభ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి హాజరు కాకపోతే పులివెందులకు ఉప ఎన్నిక వస్తుందని బాంబు పేల్చారు. అయితే ఆయన ఏ వ్యూహంతో అన్నారో తెలియదు కానీ.. వైసీపీ శ్రేణులు మాత్రం దీనిని ఆహ్వానిస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవి పై వేటు వేయాలని కోరుతున్నాయి. పులివెందులకు ఉప ఎన్నిక రావాలని కోరుకుంటున్నాయి. అప్పుడే ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని అభిప్రాయపడుతున్నాయి. రఘురామకృష్ణం రాజు లాజిక్ గా మాట్లాడారు. అసెంబ్లీ నిబంధనలు తెరపైకి తెచ్చారు. వరుసగా అనుమతి లేకుండా 60 రోజులపాటు అసెంబ్లీ కి రాకుంటే వేటు వేయవచ్చని చెప్పుకొచ్చారు. కానీ ఆ నిబంధన గత కొన్నేళ్లుగా అమలవుతుందా? లేదా? అని మాత్రం ఆలోచించడం లేదు.

పులివెందులకు ఉప ఎన్నిక రావాలని కూటమి పార్టీలు ఎట్టి పరిస్థితుల్లో కోరుకోవు. అలా కోరుకుంటే అది ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. చంద్రబాబుకు సైతం ఈ విషయం తెలుసు. కేవలం రఘురామకృష్ణంరాజు ప్రకటన వెనుక ఒక వ్యూహం ఉంది. జగన్మోహన్ రెడ్డిని అర్జెంటుగా అసెంబ్లీకి రప్పించాలి. దారుణంగా అవమానించాలి. పాత పగలు తీర్చుకోవాలి. అంతకుమించి వ్యూహం అంటూ లేదు. తన ముందు అయ్యన్నపాత్రుడు ఉంటాడు. అవసరమైతే రఘురామకృష్ణం రాజు స్పీకర్ పాత్ర పోషిస్తారు. అచ్చెనాయుడు లాంటి మంత్రులతో ఆరోపణలు చేయిస్తారు. ఇది ప్లాను. దానికి రెచ్చగొట్టేందుకు గాను సస్పెన్షన్ వేటు అనే అంశాన్ని తెరపైకి తెచ్చారు. అంతకుమించి ఇందులో ఏమీ కనిపించడం లేదు. అయితే వైసీపీ శ్రేణులు మాత్రం రఘురామకృష్ణంరాజు చెప్పినట్టు మాదిరిగా జరగాలని కోరుకుంటున్నారు.

పులివెందుల అంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి అడ్డా. అంతెందుకు కడప జిల్లాలో సైతం ఆ కుటుంబానికి పట్టు ఎక్కువ. ఉమ్మడి రాష్ట్రంలోనే కడప జిల్లా విషయంలో మిగతా రాజకీయ పార్టీలు పట్టు సాధించలేకపోయాయి. అప్పట్లో రాజశేఖర్ రెడ్డి.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. కానీ మొన్నటి ఎన్నికల్లో ప్రత్యేక పరిస్థితులు ఎదురయ్యాయి. కడప జిల్లా ప్రజలు కూటమి వైపు వెళ్లారు. అయితే అది శాశ్వతంగా కాదు. కేవలం తాత్కాలికమే. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. అందునా పులివెందులలో జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తామని టిడిపి కూటమి నేతలు ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. రాష్ట్రంలో అధికారంలో ఉంది. కానీ కడప పార్లమెంట్ స్థానంతో పాటు పులివెందుల ఉప ఎన్నికల్లో ఊచ కోత కోశారు జగన్ . కడప పార్లమెంట్ స్థానం నుంచి ఐదున్నర లక్షల ఓట్లతో గెలిచారు. పులివెందుల గురించి చెప్పనవసరం లేదు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో పులివెందులకు ఉప ఎన్నిక రాకూడదు అన్నది చంద్రబాబు వ్యూహం. కానీ రఘురామకృష్ణం రాజు మాత్రం లాజిక్కుగా 60 రోజుల హాజరు నిబంధనను తెచ్చారు.

2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. 67 సీట్లతో గౌరవప్రదమైన ప్రతిపక్షంగా వైసిపి ఉంది. ఆ సమయంలో శాసనసభలో టిడిపికి దీటుగా ఉండేది వైసిపి. కానీ అదే వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు టిడిపిలోకి ఫిరాయించారు. ఆ సమయంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి స్పీకర్ మైక్ ఇచ్చేందుకు అంగీకరించలేదు. ప్రతిపక్ష గొంతును నొక్కుతున్న ఈ అసెంబ్లీ తమకు అవసరం లేదంటూ సమావేశాల నుంచి బాయ్ కట్ చేశారు జగన్ మోహన్ రెడ్డి. అంతటితో ఆగకుండా మొత్తం శాసనసభకు హాజరు కాకూడదని భావించారు. ఓ రెండు సంవత్సరాల పాటు అసెంబ్లీ ముఖం కూడా చూడలేదు. 2019లో కూడా సేమ్ సీన్ జరిగింది. అధికారంలోకి వచ్చిన వైసిపి దూకుడుగా వ్యవహరించింది. 2021 సెప్టెంబర్ లో శాసనసభలోనే చంద్రబాబు కుటుంబ సభ్యులపై కొంతమంది వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై తీవ్ర మనస్థాపానికి గురైన చంద్రబాబు అసెంబ్లీని బాయ్ కట్ చేశారు. మళ్లీ సీఎంగానే అడుగు పెడతానని.. అప్పటివరకు అసెంబ్లీకి రానని శపధం చేశారు. మూడేళ్ల పాటు శాసనసభకు దూరంగా ఉన్నారు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి.. ఆ తరువాత చంద్రబాబు శాసనసభకు హాజరు కాకపోయినా వారి ఎమ్మెల్యే పదవులపై వేటుపడలేదే? ఇప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి పై వేటు పడుతుందా? అన్న ప్రశ్న ఎదురవుతోంది. అంతటి సాహసానికి ప్రభుత్వం దిగే అవకాశం లేదని.. ఇదంతా ఉత్త ప్రచారమేనని తేలుతోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!