ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి మంచి ట్రాక్ రికార్డు ఉంది. మంచి వాగ్దాటి కలిగిన నేతగా గుర్తింపు ఉంది. తన మాటలతో ప్రత్యర్థులను తిమ్మిని బమ్మిని చేయగల సమర్థుడు ఆయన. తాను చెప్పిందే నిజం అని నమ్మించగలరు కూడా. తనపై చిన్నపాటి విమర్శ వచ్చినా ఇట్టే స్పందిస్తారు. దీటైన సమాధానం ఇస్తారు. అయితే అది అన్నివేళలా పనిచేయదు కదా. ఒక్కోసారి ఆ మాటలు తనతో పాటు సొంత వారిని కూడా ఇబ్బందులు తెచ్చి పెడతాయి. అయితే ఇప్పుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వ్యవహార శైలి తో వైసీపీ నేతలు భయపడుతున్నారు. తాను సమర్థవంతంగా మాట్లాడుతున్నానని చెప్పి.. లైన్ దాటి కొన్ని వ్యాఖ్యలు చేస్తుంటారు. వాటితో ఇబ్బందులు తప్పడం లేదు. అయితే తాజాగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో అవినీతిపై ఆయన తరచూ మాట్లాడుతున్నారు. తనపై వచ్చిన విమర్శలపై ఏ విచారణకైనా సిద్ధమంటూ సవాళ్లు విసురుతున్నారు. అయితే గత ఐదేళ్లలో ప్రొద్దుటూరులో రాచమల్లు అనేక అక్రమాలకు పాల్పడ్డారు అన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయన ఓటమికి అదే కారణమన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. వాస్తవానికి ప్రొద్దుటూరు వైసీపీకి కంచుకోట. కానీ అనవసరంగా వివాదాల్లోకి దూరడం, వివాదాలు కొని తెచ్చుకోవడం, అవినీతి ఆరోపణలు రావడంతో ఇక్కడ వైసిపి అభ్యర్థిగా బరిలో దిగిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఓడిపోయారు అన్నది బహిరంగ రహస్యం. అయితే ఓడిన తర్వాత కూడా ఆయన తీరు మార్చుకో లేదన్న విమర్శ ఉంది. సొంత పార్టీ నేతల నుంచి ఈ తరహా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి పనుల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని.. జగనన్న కాలనీల కోసం తీసుకున్న భూమి కొనుగోళ్లలో కూడా రాచమల్లు చేతివాటం ప్రదర్శించారన్న ఆరోపణలు వినిపించాయి. అయితే వైసిపి అధికారంలో ఉన్న సమయంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ చేయాలంటూ ఆయనే స్వయంగా సిబిఐ కి ఫిర్యాదు చేయడం అప్పట్లో సంచలనంగా మారింది.
గతంలో వైయస్ వివేకానంద రెడ్డి కేసులో కూడా సంచలన కామెంట్స్ చేశారు. పార్టీని అనవసరంగా ఇరుకున పెట్టారు. హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రమేయం ఉన్నట్టు నిరూపిస్తే కడప జిల్లాలోని పదిమంది వైసీపీ ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తారని సవాల్ చేశారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు పెను దుమారానికి దారి తీసాయి. అయితే దాని ఫలితంగా తప్పు చేస్తే సీఎం జగన్ రాజీనామా చేస్తారా అంటూ అప్పట్లో సోషల్ మీడియాలో కామెంట్స్ కారణమయ్యారు రాచమల్లు. తీరా ఆఫీసులో అవినాష్ రెడ్డి ముద్దాయి అయ్యారు. కానీ వెంటనే స్వరం మార్చిన రాచమల్లు.. నేరం రుజువైతే రాజీనామా చేస్తామని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆయన తీరుపై వైసీపీలో అభ్యంతరాలు ఉన్నాయి. రాచమల్లు లాంటి నేతల తీరుతోనే కడప జిల్లాలో ఓటమి ఎదురైందన్న విశ్లేషణలు ఉన్నాయి. అయినా సరే తన తీరు మార్చుకోవడం లేదు.
అయితే సాధారణంగా అధికారంలో ఉన్నవారు తమ అవినీతిపై విచారణకు సిద్ధం అంటూ సవాల్ చేస్తారు. ఎందుకంటే తమ ప్రభుత్వమే ఉంటుంది కనుక. కానీ రాచమల్లు మాత్రం కూటమి ప్రభుత్వం దూకుడు మీద ఉన్న సమయంలో కెలుకుతున్నారు. ఏ విచారణకైనా సిద్ధం అంటూ సవాల్ చేస్తున్నారు. దీనిని అధికార పార్టీ ఏమాత్రం సీరియస్ గా తీసుకున్న అసలుకి ఎసరు వస్తుందన్న విషయాన్ని గ్రహించలేకపోతున్నారు. రాచమల్లును కంట్రోల్ చేయకపోతే కడప జిల్లాలో వైసీపీకి మరింత డ్యామేజ్ తప్పదని తోటి మాజీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు. రాచమల్లు వ్యవహార శైలితో తాము ఎక్కడ ఇరుక్కుంటామేనని భయంతో మిగతా మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారని టాక్ వినిపిస్తోంది. కేవలం మీడియాలో ఫోకస్ కోసం రాచమల్లు తన అభిప్రాయాన్ని అందరి అభిప్రాయంగా చెప్పడం తగదు అంటున్నారు. అయితే ఇప్పటికే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదులు వెళ్లినట్లు కూడా తెలుస్తోంది. రాచమల్లు మంచి లీడర్. బాగా మాట్లాడతారు. అంతవరకు ఓకే కానీ.. అయిన దానికి కాని దానికి అడ్డగోలుగా స్పందిస్తే వైసిపికి ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. మరి పార్టీ నాయకత్వం ఎలాంటి దిద్దుబాటులకు దిగుతుందో చూడాలి.