రాజకీయాల్లో అవసరాలతో పాటు కృతజ్ఞతా భావం కూడా చాలా పని చేస్తుంది. తమకోసం, అధికారంలోకి రావడం కోసం చాలామంది నేతలు కష్టపడతారు. అటువంటి వారిని గుర్తించి పదవులు ఇవ్వడం అధినేతకు ప్రధాన కర్తవ్యం. ఈ విషయంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి ముందుండేవారు. ఆపద అని వచ్చిన ప్రత్యర్థిని సైతం ఆతిథ్యం ఇచ్చి సాయం చేసే గొప్ప మనసున్న నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి. అదే పరంపరను కొనసాగించారు ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి. అయితే ఇద్దరేనా అంటే చంద్రబాబు సైతం తాను నమ్ముకున్న వారికి పదవులు ఇచ్చారు. అయితే ఆ ఇద్దరితో చూసుకుంటే మాత్రం తక్కువే.
ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. ఈ నెల 20న ఎమ్మెల్యేల కోట కింద 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు పేరు ఖరారు అయింది. మిగతా నాలుగు స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. రకరకాల పేర్లు తెరపైకి వస్తున్నాయి. కానీ ఓ ముగ్గురికి మాత్రం చంద్రబాబు తప్పకుండా పదవి ఇవ్వాలి కూడా. ఎందుకంటే చంద్రబాబు కోసం వారు ఎంత దాకైనా తెగించేందుకు సిద్ధపడ్డారు. అటువంటి వారిని గుర్తించాల్సిన అవసరం ఉంది.
సీనియర్ మోస్ట్ లీడర్ యనమల రామకృష్ణుడు కు మరోసారి ఎమ్మెల్సీ అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు కోసం చాలా కష్టపడ్డారు యనమల. 1995 టీడీపీ సంక్షోభ సమయంలో స్పీకర్ గా ఉన్న యనమల పాత్ర ఎనలేనిది. నాడు పార్టీ అధినేత ఎన్టీఆర్ను కాదని చంద్రబాబుకు మద్దతు తెలిపారు. స్పీకర్ గా ఉన్న విచక్షణ అధికారాలతో చంద్రబాబును బయటపడేశారు. ఎన్టీఆర్ ను పదవి నుంచి దించేయడంలో యనమల పాత్ర కీలకం. కనీసం శాసనసభలో మాట్లాడే అవకాశం ఎన్టీఆర్ కు ఇవ్వలేదు. అంతటి ప్రయోజనం కల్పించిన యనమలకు చంద్రబాబు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పడిన ప్రతిసారి మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి గౌరవిస్తారా లేదా అన్నది చూడాలి.
వంగవీటి రాధాకృష్ణను సైతం గౌరవించాల్సిన అవసరం చంద్రబాబుపై ఉంది. దివంగత వంగవీటి మోహన్ రంగ కుమారుడు రాధాకృష్ణ. ఒక విధంగా చెప్పాలంటే రాధాకృష్ణ టిడిపిలోకి రాకూడదు. ఎందుకంటే టిడిపి ప్రభుత్వ హయాంలోనే మోహన్ రంగా హత్య జరిగింది. దీని వెనుక టిడిపి ప్రమేయం ఉందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. 1989 ఎన్నికల్లో టిడిపి ఓడిపోవడానికి మోహన్ రంగా హత్య కారణం. అయితే చంద్రబాబుపై ఉన్న నమ్మకంతోనే 2019 ఎన్నికలకు ముందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి టిడిపిలో చేరారు రాధాకృష్ణ. ఆ ఎన్నికల్లో టిడిపికి మద్దతుగా ప్రచారం చేశారు. కానీ పార్టీ ఓడిపోయింది. 2024 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టికెట్ ఆశించారు. దక్కకపోయినా కూటమి తరుపున ప్రచారం చేశారు. అందుకే రాధాకృష్ణ సేవలకు గుర్తింపు గా ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సిన అవసరం చంద్రబాబుపై ఉంది.
పులివెందులలో జగన్మోహన్ రెడ్డిని తట్టుకుని నిలబడ్డారు బీటెక్ రవి. ఆయనకు సైతం ఎమ్మెల్సీ పదవి ఇవ్వాల్సిన అవసరం చంద్రబాబుకు ఉంది. పులివెందులలో ముఖ్యమంత్రి స్థాయి నేతను ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. ఎన్నో రకాల ఇబ్బందులు ఫేస్ చేశారు బీటెక్ రవి. వాస్తవానికి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా.. ప్రతిపక్ష నేతకు ధీటుగా మరో నేతను అధికార పార్టీ ప్రోత్సహించాలి. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పులివెందులలో ఉన్న సతీష్ రెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారు. 2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబుకు వ్యతిరేకంగా భరత్ ను బరిలోదించారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దీటైన అభ్యర్థిగా నిలిచిన బీటెక్ రవికి సైతం ఎమ్మెల్సీ చేయాల్సిన అవసరం చంద్రబాబుకు ఉంది. మరి ఏం చేస్తారో చూడాలి.