ఎట్టకేలకు ఎన్టీఆర్ అల్లుళ్ల మధ్య సఖ్యత కుదిరింది. పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు ఇటీవల కలుసుకున్నారు. దగ్గుబాటి రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. అయితే తమ మధ్య గ్యాప్ ఉండేదని ఒప్పుకున్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. కానీ ఇప్పుడు ఆ గ్యాప్ లేదని.. అంతా కలిసిపోయామని చెప్పుకొచ్చారు. అయితే ఈ కలయిక వెనుక భారీ రాజకీయ స్కెచ్ ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ముఖ్యంగా దగ్గుబాటి కుమారుడు హితేష్ కోసం రాజీ పడినట్లు సమాచారం.
ఎన్టీఆర్ పెద్దల్లుడిగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు సుపరిచితం. పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్టీఆర్ తోనే ఆయన ఉన్నారు. అప్పటికి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. రాష్ట్ర మంత్రిగా కొనసాగుతూ వచ్చారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగానే పోటీ చేశారు చంద్రబాబు. ఓడిపోవడం తో ఎన్టీఆర్ పంచన చేరారు. పార్టీ కార్యక్రమాలను చూసుకునేవారు చంద్రబాబు. ప్రభుత్వంలో కీరోల్ ప్లే చేశారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. 1994లో ఎన్టీఆర్ క్యాబినెట్లో ఇద్దరూ మంత్రులు అయ్యారు. అయితే 1995 టీడీపీ సంక్షోభంలో మాత్రం చంద్రబాబు సీఎం అయ్యారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆయన క్యాబినెట్లో చేరారు. ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన దారి తాను చూసుకున్నారు.
2004లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందేశ్వరి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వరుసగా రెండుసార్లు ఎంపీ అయ్యారు పురందేశ్వరి. యూపీఏ 2 గవర్నమెంట్ లో కేంద్రమంత్రి పదవి కూడా పొందారు. 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ ప్రమాదంలో పడింది. ఆ సమయంలో బిజెపిలో చేరారు పురందేశ్వరి. దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేశారు. కానీ అక్కడ సరైన గుర్తింపు లభించలేదు.
అయితే కుమారుడు హితేష్ కు పొలిటికల్ లైఫ్ ఇవ్వాలని వెంకటేశ్వరరావు భావించారు. 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయించాలని చూశారు. అయితే అమెరికా పౌరుషత్వం విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడంతో హితేష్ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు వీలు కాలేదు. అయితే పురందేశ్వరి ఏపీ బీజేపీ చీఫ్ అయిన తర్వాత పూర్తిగా సీన్ మారింది. బిజెపిని తెలుగుదేశం పార్టీ దరి చేర్చడంలో పురందేశ్వరి సక్సెస్ అయ్యారు. అదే నేపథ్యంలో చంద్రబాబు సైతం దగ్గుబాటి కుటుంబాన్ని దగ్గర తీసుకున్నారు.
అప్పట్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు తో ఎన్నడు ముఖాముఖిగా చంద్రబాబు మాట్లాడిన సందర్భాలు లేవు. ఫ్యామిలీ ఫంక్షన్ లో తప్పించి కలిసింది కూడా తక్కువే. అప్పుడెప్పుడో ఆసుపత్రిలో చికిత్స పొందిన దగ్గుబాటి వెంకటేశ్వరరావును పరామర్శించారు చంద్రబాబు. అయితే ఇటీవల పుస్తకావిష్కరణ కోసం ఆహ్వానించేందుకు చంద్రబాబు ఇంటికి వచ్చారు దగ్గుబాటి. అయితే కుమారుడు హితేష్ రాజకీయ భవిష్యత్తు కోసం చర్చించినట్లు సమాచారం. చంద్రబాబు సానుకూలంగా హామీ ఇవ్వడంతో దగ్గుబాటి అన్ని మరిచి చంద్రబాబుతో బంధాన్ని కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చంద్రబాబు దగ్గుబాటిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. దీంతో 30 సంవత్సరాల వైరానికి బ్రేక్ పడినట్లు అయ్యింది..