తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ కట్టు దాటుతోంది. జాగ్రత్తగా ఉండాలని అధినేత చంద్రబాబు ఆదేశాలను తమ్ముళ్లు పట్టించుకోవడం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఇదే పరిస్థితి. అధినేత మాత్రం క్రమశిక్షణ అంటూ ఆదేశాలు ఇస్తున్న పట్టించుకునే పరిస్థితుల్లో తెలుగు తమ్ముళ్లు లేరు. అంతెందుకు సొంత పార్టీ ఎమ్మెల్యేలే అధినేతకు జలక్ ఇస్తున్నారు. అంతా మా ఇష్టం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో అధినేత ఆదేశాలు వట్టి మాటలు గానే తేలిపోతున్నాయి.
తాజాగా పల్నాడు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ప్రభుత్వం పై తిరుగుబాటు చేసినంత పని చేశారు. ఏకంగా ఎక్సైజ్ రాష్ట్ర కమిషనర్ కార్యాలయంలో హల్చల్ చేశారు. సొంత ప్రభుత్వం పైనే నిరసన వ్యక్తం చేశారు. కార్యాలయంలోనే బయటయించి ఆందోళనలను కొనసాగించారు. చివరికి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఒకరిద్దరు సహచర ఎమ్మెల్యేలు వద్దని వారించిన వినలేదు. ఏం చేసుకుంటే చేసుకోండి అంటూ సవాల్ చేస్తూ అక్కడే నిరసన కొనసాగించారు.
నరసరావుపేట మద్యం డిపోలో 11 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించాలన్నదే అరవింద బాబు డిమాండ్. వారంతా వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నియమితులైన వారు కావడంతో వారిని మార్చాలని పట్టుబడ్డారు ఎమ్మెల్యే అరవింద్ బాబు. అయితే నిబంధనల మేరకు అది కుదరని పనిగా తేల్చి చెప్పారు ఎక్సైజ్ అధికారులు. దీంతో ఎమ్మెల్యే అరవింద బాబుకు చిర్రెత్తుకొచ్చింది. నా మాటే వినరా అంటూ నేరుగా ఎక్సైజ్ శాఖ రాష్ట్ర కమిషనర్ కార్యాలయానికి వెళ్లి రచ్చ రచ్చ చేశారు.
అయితే ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్ ఆ సమయంలో కార్యాలయంలోనే ఉన్నారు. అసౌకర్యం కలిగించవద్దని కోరారు. అయినా సరే ఎమ్మెల్యే అరవింద బాబు వినలేదు. వెంటనే మంత్రి కొల్లు రవీంద్ర కు సమాచారం ఇచ్చారు. ఆయన సముదాయించిన వినలేదు. మంత్రి వైతే గొప్ప అన్నట్టు కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీంతో మంత్రి రవీంద్ర నోొచ్చుకున్నట్లు సమాచారం. ఇంకోవైపు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ సైతం సమదాయించే ప్రయత్నం చేశారు. ఆయన మాటలను సైతం వినలేదు. గుంటూరు జిల్లాకు చెందిన సహచర ఎమ్మెల్యేలు బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేశారు. కానీ వారి మాటలను సైతం వినలేదు ఎమ్మెల్యే అరవింద్ బాబు.
అయితే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యవహార శైలి ఇప్పుడు అధికార వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. సీఎం చంద్రబాబు పారదర్శకమైన పాలన అందించాలని ఆదేశిస్తున్నారని.. క్షేత్రస్థాయిలో చూస్తుంటే ఎమ్మెల్యేలు కార్యాలయాల్లోకి వచ్చి గలాటా చేస్తున్నారని అధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇలా అయితే పాలన సాగించలేమని తేల్చి చెబుతున్నారు. మొత్తానికి అయితే అధికార పార్టీ ఎమ్మెల్యే వ్యవహార శైలి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది.