వైయస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి కీలక నియోజకవర్గాలపై దృష్టి పెట్టారు. ఎక్కడైతే నాయకత్వ లోపం ముందు అక్కడ సమర్థవంతమైన నేతకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. అందులో భాగంగా మంగళగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు వచ్చింది. గత కొంతకాలంగా ఆళ్ల రామకృష్ణారెడ్డి క్రియాశీలకంగా లేరు. ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ దక్కలేదు. అయినా సరే పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేశారు. పార్టీ బలోపేతానికి పాటుపడ్డారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నుంచి పిలుపు రావడంతో ఆయన భేటీ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు. తిరిగి మంగళగిరి నియోజకవర్గ బాధ్యతలు అప్పు చెపుతారని ప్రచారం నడుస్తోంది.
ఆది నుంచి ఆళ్ల కుటుంబానికి ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి ఆ కుటుంబం సైతం ఆ పార్టీ వెంట నడుస్తోంది. ఈ తరుణంలో ఆళ్ల రామకృష్ణారెడ్డికి 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. ఆ ఎన్నికల్లో రామకృష్ణారెడ్డి గెలిచారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే ఐదేళ్లపాటు కేసులతో ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. అప్పటి టిడిపి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటం చేసేవారు. ఈ క్రమంలో అత్యున్నత న్యాయస్థానంలో సైతం కేసులు వేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఆళ్ల రామకృష్ణారెడ్డికి చెప్పాలని భావించారు చంద్రబాబు. 2019 ఎన్నికల్లో మంత్రి నారా లోకేష్ ను బరిలో దించారు. అయినా సరే లోకేష్ ఆళ్ల రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయారు.
అయితే నారా లోకేష్ ను ఓడించడంతో ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంత్రి పదవి దక్కుతుందని భావించారు. చాలా ఆశలు పెట్టుకున్నారు. ఇంకోవైపు ఆళ్ల అయోధ్యరామిరెడ్డికి రాజ్యసభ పదవి కూడా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఎన్నికల్లో అనూహ్యంగా ఆళ్ల రామకృష్ణారెడ్డిని తప్పించారు జగన్మోహన్ రెడ్డి. దీంతో మనస్థాపానికి గురైన ఆయన షర్మిల నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే వెళ్లిన కొద్ది రోజులకే తిరిగి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేశారు. ఈ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసిన వైయస్సార్ కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు. ప్రచారం కూడా చేశారు. అయితే మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రయోగం విఫలమైంది.
అయితే ఇప్పుడు తిరిగి ఆళ్ల రామకృష్ణారెడ్డికి మంగళగిరి బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయనకు పిలుపు అందినట్లు సమాచారం. మంత్రి నారా లోకేష్ అక్కడ పట్టు సాధించడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతోంది. అందుకే జగన్మోహన్ రెడ్డి ఆళ్ల రామకృష్ణారెడ్డిని ప్రయోగిస్తారని సమాచారం. ఎన్నికల్లో బీసీ నినాదంతో అక్కడ బరిలో దిగింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రయోగం విఫలం అయింది. గతంలో రెండుసార్లు మంగళగిరి నియోజకవర్గం నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రాతినిధ్యం వహించారు. దీంతో ఆయనకు ప్రత్యేకమైన అనుచరుగణం ఉంది. త్వరలో ఆళ్ల రామకృష్ణారెడ్డి నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు తీసుకుంటారని… యాక్టివ్ అవుతారని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడినట్లే.