2029 ఎన్నికల నాటికి ఏపీలో నియోజకవర్గాలు పెరగనున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభం అయింది. 2026 నాటికి పూర్తిచేసేలా కసరత్తు జరుగుతోంది. ఏపీలో 50 అసెంబ్లీ సీట్లు పెరగనున్నాయి. పార్లమెంట్ స్థానాల సంఖ్య సైతం పెరగనుంది. వాస్తవానికి నియోజకవర్గాల పునర్విభజన అనేది ఇప్పటికే జరగాలి. కానీ అనేక రకాల సాంకేతిక సమస్యలతో అది జరగలేదు. నియోజకవర్గాల సంఖ్య పెరగలేదు.
తెలుగు రాష్ట్రాల విభజన జరిగిన సమయంలో నియోజకవర్గాల పునర్విభజన తెరపైకి వచ్చింది. విభజన చట్టంలో సైతం అదే రాసుకోచ్చారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ తో పాటు అసెంబ్లీ నియోజకవర్గాలు పెరగనున్నాయని చెప్పుకొచ్చారు. కానీ జన గణనతో పాటు బీసీ గణన అడ్డంకిగా మారింది. అందుకే నియోజకవర్గాల విభజన జరగలేదు. ఉమ్మడి రాష్ట్రంలో 292 నియోజకవర్గాలతో పాటు 42 పార్లమెంట్ స్థానాలు కొనసాగేవి. అయితే రాష్ట్ర విభజనతో తెలంగాణకు 117 అసెంబ్లీ, 17 పార్లమెంట్ స్థానాలు దక్కాయి. నవ్యాంధ్రప్రదేశ్ కు 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలు మిగిలాయి. అయితే పాలనాపరమైన సరళతరం కోసం నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే జాతీయస్థాయిలో నెలకొన్న పరిణామాలతో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ జరగలేదు.
అయితే తాజాగా జాతీయస్థాయిలో నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి కసరత్తు ప్రారంభం అయింది. ఇప్పుడు ఉన్న నియోజకవర్గాలు 2029 ఎన్నికల నాటికి పెరగనున్నాయి. ఏపీకి సంబంధించి మరో 50 అసెంబ్లీ స్థానాలు, మరో ఏడు నుంచి పది వరకు పార్లమెంట్ స్థానాలు పెరగనున్నట్లు తెలుస్తోంది. చివరిసారిగా 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అప్పట్లో చాలా నియోజకవర్గాలు కనుమరుగయ్యాయి. కొత్తవి తెరపైకి వచ్చాయి. ఇప్పుడు మరోసారి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుండడంతో ఏ నియోజకవర్గాలు ఉంటాయి? కొత్తగా ఎన్ని తెరపైకి వస్తాయి? అన్నది తెలియాల్సి ఉంది.
అయితే 50 అసెంబ్లీ స్థానాలు పెరగనుండడంతో అన్ని పార్టీల నుంచి ఓ 200 మంది వరకు ఆశావహులకు చాన్స్ దక్కుతుందన్నమాట. ప్రస్తుతం కూటమిలో మూడు పార్టీలు ఉన్నాయి. ఆ మూడు పార్టీలు పెరిగిన నియోజకవర్గాలను సర్దుకోవాల్సి ఉంటుంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీది ఎప్పుడు ఒంటరి పోరాటమే. అందుకే నియోజకవర్గాల పునర్విభజన అనేది ఆ పార్టీకి కలిసి వచ్చే అంశమే. కొత్తగా 50 నియోజకవర్గాలు రావడంతో నేతలకు ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. అయితే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియతో సేఫ్ జోన్ కోసం కూటమి ప్రభుత్వం ఎలా ను ప్రయత్నిస్తుంది. అయితే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశం. ఆ పార్టీ వైపు ఎక్కువమంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. అటువంటి వారికి నియోజకవర్గాల పునర్విభజన అనేది కలిసొచ్చే అంశమే. అయితే 2026 నాటికి ఈ నియోజకవర్గాల పునర్విభజన పూర్తవుతుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.