Sunday, March 16, 2025

పూర్వ వైభవానికి బాలినేని తహతహ.. టిడిపి కూటమికి షాక్!

- Advertisement -

మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి జనసేన లో పట్టు బిగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రకాశం జిల్లా కూటమిలో తనకంటూ ఒక ముద్ర చాటుకోవాలని భావిస్తున్నారు. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆయన జనసేనలో చేరారు. అయితే ఆయన చేరికను జనసేన నేతలతో పాటు టిడిపి కూటమి నేతలు తట్టుకోలేకపోయారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రకాశం జిల్లాలో మళ్లీ బాలినేని రీయంట్రీ ఉండకూడదని భావిస్తున్నారు. జనసేనలో ఆయన చేరిక కూడా సాదాసీదాగా జరిగింది. కూటమి ప్రభుత్వంలో సైతం పెద్దగా కనిపించడం లేదు బాలినేని. ఆయనతో వేదికలు పంచుకునేందుకు కూడా కూటమి నేతలు ముందుకు రావడం లేదు. ఒకానొక దశలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చానా అని బాలినేని బాధపడ్డారు. కానీ జనసేన లో ఉండి తాడోపేడో తేల్చుకోవాలని బాలినేని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే మాస్టర్ స్కెచ్ గీసినట్లు ప్రచారం నడుస్తోంది.

బాలినేని పై గెలిచారు దామచర్ల జనార్ధన. బాలినేని జనసేనలో చేరికపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. గత ఐదేళ్లుగా టిడిపి తో పాటు జనసేన శ్రేణులను ఇబ్బంది పెట్టిన బాలినేనిని ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. గత ఐదేళ్ల వైయస్సార్ కాంగ్రెస్ పాలనలో బాలినేని దోపిడీకి దిగారని సంచలన ఆరోపణలు చేశారు. ఆయనపై కేసులు కొనసాగుతాయని కూడా చెప్పుకొచ్చారు. అదే సమయంలో జనసేన జిల్లా నాయకత్వం సైతం బాలినేని రాకను తీవ్రంగా వ్యతిరేకించింది. బాలినేని జనసేనలో చేరినా పట్టించుకోవడం లేదు. మెజారిటీ జనసేన శ్రేణులు బాలినేని రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. దీంతో బాలినేనిలో ఒక రకమైన కసి ప్రారంభం అయింది. జనసేన నేతలకు దీటైన సమాధానం ఇవ్వాలి. టిడిపి ఎమ్మెల్యే కు షాక్ ఇచ్చేలా వ్యవహరించాలి అని ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ లను జనసేనలోకి రప్పించేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం.

గత మున్సిపల్ ఎన్నికల్లో ఒంగోలు కార్పొరేషన్ను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా కైవసం చేసుకుంది. అప్పట్లో మంత్రిగా బాలినేని ఉన్నారు. కార్పొరేటర్లలో చాలామంది ఆయన అనుచరులుగా ఉన్నారు. అందుకే ఓ 20 మంది కార్పొరేటర్ లను జనసేనలోకి రప్పించి.. తన సత్తా చాటాలని బాలినేని భావించారు. ఓ 20 మంది కార్పొరేటర్ లను విజయవాడకు తరలించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో వారిని జనసేనలో చేర్చారు.
దీంతో ప్రకాశం జిల్లాలో బాలినేని హవా మళ్లీ ప్రారంభం అయినట్టే..

టిడిపి తో పాటు జనసేన నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి చర్యలను నిశితంగా గమనిస్తున్నారు. మళ్లీ బాలినేని పట్టు ప్రారంభం అయితే.. ఒంగోలులో తమకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ఆ రెండు పార్టీల నేతలకు తెలుసు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని దారుణంగా దెబ్బతీశారు బాలినేని. అయితే మున్ముందు రాజకీయాలు బట్టి బాలినేని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్కడ సైలెంట్ గా ఉంది. బాలినేని వర్సెస్ టిడిపి, జనసేన అన్నట్టు పరిస్థితి ఉంది. ఒకవేళ బాలినేని పట్టు బిగిస్తే మాత్రం ఆ రెండు పార్టీల నేతలు పలాయనం చిత్తగించాల్సిందే. అదే జరిగితే టిడిపి తో పాటు జనసేన పక్కకు వెళ్లిపోతాయి. బాలినేని శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ హవా ప్రారంభిస్తారు. బాలినేని ఎంత బలం పెంచుకుంటే టిడిపి కూటమిలో అన్ని విభేదాలు ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!