Wednesday, March 19, 2025

జమ్మలమడుగు వైయస్సార్ కాంగ్రెస్ ఇన్చార్జిగా రామ సుబ్బారెడ్డి..

- Advertisement -

కీలక నియోజకవర్గాల విషయంలో కాయాకల్ప చికిత్స ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి. ఏ నియోజకవర్గాల్లో అయితే నాయకత్వ లోటు ఉందో అక్కడ సమర్థవంతమైన నాయకులను బరిలో దించుతున్నారు. అటువంటి నియోజకవర్గాలను సెట్ చేసే పనిలో పడ్డారు. ఇప్పుడు కడప జిల్లాలో అదే పని చేస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి. కీలకమైన జమ్మలమడుగులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని గాడిలో పెడుతున్నారు. అక్కడ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నట్టు పరిస్థితి ఉంది. అయితే ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సుధీర్ రెడ్డి సైలెంట్ అయ్యారు. దీంతో అక్కడ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కొత్త గందరగోళానికి గురవుతూ వచ్చాయి.

2019 ఎన్నికల్లో సుధీర్ రెడ్డి ఇక్కడ ఆదినారాయణ రెడ్డి పై గెలిచారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సమయంలో ఆదినారాయణ రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు. జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు. 2014 ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. అయితే కొద్ది రోజులకే తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించారు. దీంతో జగన్మోహన్ రెడ్డి సుధీర్ రెడ్డిని తెరపైకి తెచ్చారు. 2019 ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి పై పోటీకి దింపారు. 50 వేల ఓట్ల మెజారిటీతో సుధీర్ రెడ్డి గెలిచారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత అప్పటివరకు టిడిపిలో ఉన్న ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆదినారాయణ రెడ్డి బిజెపిలోకి వెళ్లిపోయారు. అయితే గత ఐదేళ్లుగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చాలా దూకుడుగా ఉండేవారు. ముఖ్యంగా చంద్రబాబుతో పాటు లోకేష్ పై విరుచుకుపడేవారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం దృష్టి పెడుతుందని భావించి ఆయన పొలిటికల్ గా సైలెంట్ అయినట్లు ప్రచారం నడుస్తోంది.

అయితే మొన్నటి వరకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో రామసుబ్బారెడ్డి వర్సెస్ సుధీర్ రెడ్డి అన్నట్టు పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు సుధీర్ రెడ్డి నియోజకవర్గంలో అడుగుపెట్టడం లేదు. హైదరాబాద్ కి పరిమితం అవుతున్నారు. ఇటువంటి తరుణంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని యాక్టివ్ కావాలని జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్లు సమాచారం. జమ్మలమడుగు నియోజకవర్గంలో సుదీర్ఘకాలం రాజకీయం చేస్తూ వచ్చారు రామసుబ్బారెడ్డి. అయితే ఆదినారాయణ రెడ్డి నిష్క్రమణ తర్వాత రామ సుబ్బారెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తారని అంతా భావించారు. అయితే మధ్యలో సుధీర్ రెడ్డి ఎంట్రీ తో రామసుబ్బారెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక ఆలస్యం అయింది. ఇప్పుడు బలమైన నేతగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రామసుబ్బారెడ్డి మిగిలారు. అందుకే రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.

ప్రస్తుతం జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా భూపేష్ రెడ్డి కొనసాగుతున్నారు. బాబాయ్ అబ్బాయిలను తట్టుకోవడం అంత ఈజీ కాదు. పైగా కడప జిల్లా పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాలను విజయం సాధించేలా ప్లాన్ చేస్తోంది. అయితే ఓటమి నుంచి గుణపాటాలు నేర్చుకున్న జగన్మోహన్ రెడ్డి.. కడప జిల్లాలో పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నారు. అందుకే రామసుబ్బారెడ్డి తో ఇటీవల జగన్ మోహన్ రెడ్డి చర్చలు జరిపినట్లు సమాచారం. త్వరలో జమ్మలమడుగు వైసిపి ఇన్చార్జిగా రామసుబ్బారెడ్డి పేరు ప్రకటించే పరిస్థితి కనిపిస్తోంది. చూడాలి ఏం జరుగుతుందో?

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!