Sunday, March 16, 2025

ఎమ్మెల్సీ పదవుల భర్తీ చంద్రబాబుకు అంత ఈజీ కాదు!

- Advertisement -

ఏపీలో 5 ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి షెడ్యూల్ వెల్లడించింది ఎన్నికల కమిషన్. మార్చి 20న ఎమ్మెల్యేల కోటా కింద 5 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరగనున్నాయి. కూటమి అధికారంలో ఉండడంతో ఏకపక్షంగా ఎమ్మెల్సీ సీట్లు దక్కించుకునే అవకాశం ఉంది. 135 అసెంబ్లీ సీట్లలో టిడిపి గెలుపు పొందడంతో ఆ పార్టీ ఐదు స్థానాలు పొందడం చాలా ఈజీ. అందుకే తెలుగుదేశం పార్టీ సింహభాగం ఎమ్మెల్సీ సీట్లు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ స్థానాలు దక్కించుకోవడం ఈజీ అయినా.. ఎమ్మెల్సీ పదవుల పంపకం మాత్రం అంత సులువు కాదు. ముమ్మాటికి ఇది చంద్రబాబుకు ఇబ్బందికరమే. ఇప్పుడు పదవీ విరమణ చేస్తున్న నేతలు టిడిపిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. మరోసారి ఎమ్మెల్సీ పదవులను కోరుకుంటున్నారు. ఇంకోవైపు ఎమ్మెల్సీ పదవులపై చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఎన్నికల్లో సీట్లు త్యాగం చేసిన నాయకులు ఉన్నారు. వారికి సైతం సర్దుబాటు చేయాల్సి ఉంటుంది.

యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీ పదవి మార్చి 31 తో ముగియనుంది. మరోసారి ఆయన ఎమ్మెల్సీ పదవి కోరుకుంటున్నారు. ఆపై మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఈ ఎన్నికల్లో ఆయన తప్పుకున్నారు. కుమార్తె దివ్య ను నిలబెట్టారు. ఎమ్మెల్యేగా గెలిచిన ఆమెకు మంత్రి పదవి ఇవ్వలేదు చంద్రబాబు. అందుకే తనను ఎమ్మెల్సీ చేసి మంత్రి పదవి ఇవ్వాలని కోరుతున్నారు యనమల. ఇటీవల పార్టీకి అంటి ముట్టనట్టుగా ఉన్నారు. అందుకే ఆయన విషయంలో చంద్రబాబు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది.

మరో ఎమ్మెల్సీ పరుచూరి అశోక్ బాబు సైతం మరోసారి పదవి కోరుకుంటున్నారు. ఉద్యోగ సంఘాల నేతగా ఉన్న అశోక్ బాబు తెలుగుదేశం పార్టీకి బలమైన మద్దతు దారుడుగా నిలిచారు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చేందుకు కృషి చేశారు. అందుకే చంద్రబాబు పిలిచి మరి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. గత ఐదేళ్లలో పార్టీ కోసం బలంగా నిలబడ్డారు. అందుకే ఈసారి కూడా తనకు ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఆయన ఆశలు పెట్టుకున్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు జంగా కృష్ణమూర్తి. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ నిరాకరించడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పనిచేశారు. చంద్రబాబు సైతం జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో మరోసారి తనకు అవకాశం వస్తుందని జంగా కృష్ణమూర్తి ఆశతో ఉన్నారు.

విశాఖ జిల్లాకు చెందిన దువ్వారపు రామారావు మరోసారి తనకు ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ఆశ పెట్టుకున్నారు. ఈయన సైతం తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేత. పలు విభాగాల్లో పనిచేయడంతో గుర్తించిన చంద్రబాబు పిలిచి మరి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఇప్పుడు మరోసారి ఆయన పదవి కోరుకుంటున్నారు. అయితే విశాఖ జిల్లాకు చెందిన చాలామంది నేతలు ఆశావహులుగా ఉన్నారు.

మరో ఎమ్మెల్సీ తిరుమల నాయుడు ది అదే పరిస్థితి. రాయలసీమలో అత్యంత సీనియర్ నేత ఈయన. కర్నూలు జిల్లాలో పార్టీ కష్టకాలంలో ఉండగా అండగా నిలిచిన నాయకుడు. రెండుసార్లు ఎంపీగా పోటీ చేసి ఓడిపోవడంతో చంద్రబాబు ఎమ్మెల్సీ చేశారు. ఇప్పుడు పదవీ విరమణ చేస్తుండడంతో.. మరోసారి ఆ పదవి కోరుకుంటున్నారు తిరుమల నాయుడు.

అయితే ఈ ఐదుగురు నాయకులకు తిరిగి ఇస్తే ఆశావాహులు నీరు గారి పోతారు. పిఠాపురం వర్మ, దేవినేని ఉమామహేశ్వరరావు, బుద్ధ వెంకన్న లాంటి నేతలు టిడిపిలో పదిమంది వరకు ఉన్నారు. మరోవైపు జనసేన నుంచి నాగబాబు, ఇంకా చాలామంది నేతలు ఉన్నారు. బిజెపి నుంచి సోము వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జిబిఎల్ లాంటి పదిమంది వరకు నాయకులు ఉన్నారు. అందుకే ఎమ్మెల్సీ స్థానాల బట్టి చంద్రబాబుకు అంత ఈజీ కాదు అని పొలిటికల్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

- Advertisement -
- Advertisement -

Latest News

error: Content is protected !!